NTV Telugu Site icon

Thodelu Movie Review: తోడేలు రివ్యూ (హిందీ డబ్బింగ్)

Thodelu Movie Review

Thodelu Movie Review

మన ప్రొడ్యూసర్స్ ఒక్కోసారి ఉన్నట్టుండీ పర్యావరణ ప్రేమికులుగా మారిపోతుంటారు. ‘అడవిని కాపాడుకోవాలి, ప్రకృతిని ఆరాధించాలి, లేకుంటే మనిషికి మనుగడే ఉండదు. జంతువులు ఉండే అడవిలోకి మనిషి వెళ్ళి అభివృద్ధి పేరుతో దాన్ని నాశనం చేస్తే ప్రకృతితే ఏదో ఒక రూపంలో మనల్ని అంతం చేస్తుంది’ అనే సందేశాన్ని ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది మంచి ఆలోచనే. కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతేనే తంటా వస్తుంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి, ఈశాన్యభారత్ లో అభివృద్ధి పేరుతో అవినీతి పరుడైన ఓ చిన్న కాంట్రాక్టర్ అడవిని నరికేసి రోడ్డు వేయాలనుకున్నప్పుడు ఏం జరిగిందో ‘తోడేలు’ మూవీతో తెలుసుకుందాం.

భాస్కర్ (వరుణ్‌ థావన్) ఓ చిన్న కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్ లోని అడవి మధ్యలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ ను ఓ పెద్ద సంస్థ నుండి అతను సంపాదిస్తాడు. తన స్నేహితులు ఇద్దర్ని తీసుకుని అక్కడకు వెళతాడు. కాస్తంత తెలివి, కొంత డబ్బులతో అక్కడి మనుషులను; ప్రభుత్వ విభాగాల వారి మనసుల్ని జయించి తన పని పూర్తి చేసుకోవచ్చని భావిస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో అతన్ని అడవిలోని ఓ తోడేలు కరుస్తుంది. అక్కడ నుండి భాస్కర్ జీవితమే మారిపోతుంది. ప్రతి పౌర్ణమి రాత్రి అతను కూడా తోడేలుగా మారిపోయి… మనుషులను చంపేస్తుంటాడు. ఇదో రకమైన వైరస్ అని స్థానికులు చెబుతుంటారు. తాతల నాటి ఇల్లును తాకట్టు పెట్టి మరీ ఈ కాంట్రాక్ట్ పొందిన భాస్కర్ దీన్ని పూర్తి చేయగలిగాడా? తనలోకి దూరిన తోడేలును అతను ఎలా బయటకు పంపగలిగాడు? అందుకు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.

ధర్మోరక్షతి రక్షితః అన్నట్టుగానే మనవాళ్ళు వృక్షో రక్షతి రక్షితః అని కూడా చెబుతుంటారు. గత కొన్నేళ్ళుగా మొక్కలను పెంచమని, పర్యావరణ సమతౌల్యాన్ని పాటించడమని హితబోధ చేస్తున్నారు. లేకుండా వచ్చే జనరేషన్ పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లభించదని, ఇవాళ నీళ్ళు కొనుక్కుంటున్నట్టుగా గాలినీ కొనుక్కొనే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే అడవుల సంరక్షణ నేపథ్యంలోనూ, అభివృద్ధి పేరుతో వాటిని నాశనం చేసే జరిగే పర్యావసానాల మీద సినిమాలూ వస్తున్నాయి.

చిత్రం ఏమంటే… ఈ సినిమా చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘కాంతార’ మనసులో మెదులుతుంది. అందులోనూ అడవిని గిరిజనుల నుండి ఓ భూస్వామి లాక్కోవాలని చూస్తాడు. స్థానికులు ప్రతిఘటిస్తారు. అల్లరి చిల్లరిగా తిరిగే హీరో, ముందు భూస్వామి పక్షాన నిలిచినా వరాహ రూపంలోని దేవుడి కారణంగా నిజానిజాలు తెలిసి, అడవిని కాపాడతాడు. ఇందులోనూ అంతే హీరో, ‘ఎవరు ఎలా పోతే నాకేం… నా పని కావాలి, నేను డబ్బులు సంపాదించాలి’ అనుకుంటాడు. గిరిజనులను ప్రలోభ పెట్టి అడవి మార్గం గుండా రోడ్డు వేయాలని చూస్తాడు. తోడేలు నోటికి చిక్కుతాడు. ‘కాంతార’లో వరాహం అడవిని కాపాడితే, ఇక్కడ అదే పని తోడేలు చేస్తుంది! అక్కడి గిరిజనులు వరాహాన్ని దైవంగా భావిస్తారు. ఇక్కడి వారు తోడేలును వైరస్ గా భావించి భయపడతారు. చివరకు హీరోకు బుద్ధి వచ్చి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ లో నటిస్తూ వచ్చిన వరుణ్ ధావన్ ఇప్పటి వరకూ ఇంత క్లిష్టమైన పాత్ర చేయలేదు. అతని కెరీర్ లోనే చెప్పుకోదగ్గ పాత్ర ఇది. అతను తోడేలుగా మారిపోయే సన్నివేశాలను ఎంత సీజీలో చేసినా వరుణ్ పడిన కష్టం సామాన్యమైంది కాదు. ఇక ‘వన్ – నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలైన కృతీసనన్ ఇందులో వెటర్నరీ డాక్టర్ గా నటించింది. పెద్దంత ప్రాధాన్యం లేని పాత్ర పోషించిందని భావిస్తున్న తరుణంలో డైరెక్టర్ అమర్ కౌశిక్ ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ను ఆమె పాత్రకు లింక్ చేశాడు. మరో విశేషం ఏమంటే… అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘స్త్రీ’లో కృతీసనన్ ఓ పాటలో నర్తించగా, ఇప్పుడీ సినిమాలోని సాంగ్ లో ‘స్త్రీ’ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అలానే రాజ్ కుమార్ రావ్ కూడా క్లయిమాక్స్ లో అతిథి పాత్రలో మెరిశాడు. ఇతర ప్రధాన పాత్రలను దీపక్‌ డోబ్రియల్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్, అర్నాద్ ఖాన్ తదితరులు పోషించారు.

అడవి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని దినేశ్‌ విజన్ త్రీడీలోనూ నిర్మించాడు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు, తమిళంలోకి దీన్ని డబ్ చేశారు. తెలుగులో మాటలు, పాటలు వినడానికి కాస్తంత కామెడీగానే ఉన్నాయి. ఇక ఉన్నంతలో కాస్తంత ఆదరణ పొందిన ‘తుమ్కేశ్వరి’ పాట ఎండ్ టైటిల్స్ లో వస్తుంది. కానీ అప్పటికే జనాలు సీట్లలోంచి లేచి థియేటర్ ఖాళీ చేయడం మొదలు పెట్టేస్తారు. సచిన్ – జిగర్ నేపథ్య సంగీతం, జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. అడవికి సంబంధించిన సన్నివేశాలను త్రీడీలో చూస్తుంటే… ఆనందంగానే అనిపిస్తుంది. తోడేలు మన ముఖం మీదకే దూకినట్టనిపించి కాస్తంత థ్రిల్, కాస్తంత భయం కలుగుతాయి. దర్శకుడు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి వారిని ఇతరులు తక్కువగా చూస్తారని ఓ పాత్ర ద్వారా చెప్పించారు. ఆ సన్నివేశం ఆకట్టుకుంటుంది. అలానే గతంలో ఈ తరహాలో వచ్చిన కొన్ని సినిమాల పేర్లను ప్రస్తావించడం సరదగా ఉంది. బట్ కొన్ని కామెడీ సీన్స్ వెగటు పుట్టిస్తాయి. ఓవర్ ఆల్ గా దర్శకుడు ఏ సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించాలని అనుకున్నాడో… దాన్ని బలంగా, ప్రభావంతంగా చెప్పలేకపోయాడు.

రేటింగ్ : 2.25/5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న పాయింట్
వరుణ్‌ ధావన్ నటన
టెక్నికల్ వాల్యూస్

మైనెస్ పాయింట్స్

బలహీనమైన కథ, కథనాలు
ఆకట్టుకోని పాటలు
పేలవమైన పతాకసన్నివేశం

ట్యాగ్ లైన్: తోడేలు పగ!