NTV Telugu Site icon

Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ

సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ది గోట్ లైఫ్- ఆడు జీవితం. తెలుగులో ఇదే పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేశారు. తెలుగు మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మలయాళంలో డీసెంట్ సినిమాలు చేసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బ్లేస్సి దర్శకత్వంలో ఈ సినిమాని విజువల్ రొమాన్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాని పెద్ద ఎత్తున పృథ్వీరాజ్ ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చాడు. దానికి తోడు ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఒక విజువల్ రూపంగా తెరకెక్కించడానికి పదహారేళ్లు పట్టిందని సుమారు ఆరేళ్లు తన ట్రాన్స్ఫర్మేషన్ కోసమే పట్టిందని చెప్పడంతో ఒక్కసారిగా అందరిలో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి అలాంటి సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

ఆడు జీవితం కథ:
కేరళలోని హరిపాద్ అనే టౌన్ దగ్గరలో ఉండే ఒక కుగ్రామానికి చెందిన నజీబ్ మహమ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) స్వగ్రామంలో డబ్బులు సంపాదించడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. గల్ఫ్ లో ఉద్యోగం చేస్తున్నా తన స్నేహితుడి బావ తరఫున ఉద్యోగానికి వెళ్లడానికి అవకాశం ఉందని తెలియడంతో సుమారు 30 వేల రూపాయలు అప్పుచేసి గల్ఫ్ వెళతాడు. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని కంపెనీ ప్రతినిధులు వచ్చేలోపు ఒక అరబ్ వ్యక్తి ద్వారా కిడ్నాప్ కి గురవుతాడు. తాను కిడ్నాప్ అయ్యాను అనే విషయం కూడా తెలియక ముందే అతన్ని తీసుకువెళ్లి ఎడారిలో గొర్రెలను మేపేందుకు రెడీ చేస్తారు. ఎన్నో మార్లు తాను ఈ పని చేయలేనని చెప్పినా సరే వినకుండా అరబ్ వ్యక్తులు అతన్ని గొర్రెలు మేపే పనిలోనే ఫిక్స్ చేస్తారు. ఒకటి రెండు సార్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అరబ్ వ్యక్తులు దారుణంగా కొడుతూ ఉండడంతో ఇక చేసేదేమీ లేక అదే జీవితానికి అలవాటు పడతాడు. అయితే తనతో పాటు గల్ఫ్ వచ్చిన హకీమ్(గోకుల్)ను ఒకరోజు చూడడంతో అతనికి తప్పించుకునే విషయంలో ఆశ కలుగుతుంది. ఒక ఆఫ్రికన్ వ్యక్తికి రూట్ తెలుసు అని, అతను మనం తప్పించుకోవడానికి సహాయం చేస్తాడని హకీమ్ చెబుతాడు. హకీమ్, నజీబ్ ఇద్దరూ నరకం లాంటి ఆ ఎడారి నుంచి బయటపడ్డారా? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? చివరికి బయటపడ్డారా లేదా అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
కథగా చెప్పుకుంటే 90 లలో మోసానికి గురై ఎడారిలో గొర్రెలను మేపే పనిలో పడి నరకం లాంటి జీవితాన్ని గడిపి దాని నుంచి తప్పించుకున్న ఒక కేరళ వ్యక్తి తిరిగి భారతదేశానికి ఎలా వచ్చాడు అనేది సింపుల్గా అనిపిస్తుంది. కానీ దానికి ఒక దృశ్య రూపకం ఇవ్వడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి. నిజానికి ఇది ఒరిజినల్ గా జరిగిన కథ. నజీబ్ అనే వ్యక్తి జీవిత కథను కేరళలో నవలగా రాస్తే కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. దీంతో ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ఎంతోమంది స్టార్ హీరోలు ప్రయత్నం చేశారు. చివరికి అక్కడ స్టార్ హీరోగా ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే సాహసానికి పూనుకున్నారు. కథగా చెప్పుకుంటే ఎన్నో వర్ణనలు, ఇంకెన్నో వనానాతీతమైన బాధలు, ప్రేక్షకులను ఒక ఊహ లోకంలోకి తీసుకువెళ్లే పదప్రయోగాలు చేయవచ్చు. కానీ ఈ సినిమాని విజువలైజ్ చేయటం అనేది పెద్ద సాహసమే. అయితే ఆ సాహసాన్ని పృథ్వీరాజ్ చాలా సునాయాసంగా చేసినట్లు కనిపించినా అతని కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. చెప్పుకోవడానికి ఇది కథ కాదు వ్యధ అని సింపుల్గానే చెప్పేసినా ఆ వ్యధను ప్రేక్షకులకు చేర వేయడంలో పృథ్వీరాజ్ వందకి వంద మార్కులు సంపాదించాడు అని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా కేవలం జరిగిన కథను కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకోవడం అభినందనీయం. సినిమాటిక్ లిబర్టీ కొన్నిచోట్ల తీసుకున్నారు అనిపించినా ఫైనల్ గా అవుట్ ఫుట్ మాత్రం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం పృధ్వీరాజ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇతర నటీనటులు ఉన్నా సరే మేజర్ పార్ట్ మనం పృథ్వీరాజ్ ను మాత్రమే చూస్తూ ఉంటాం. అతని నటన మేకోవర్ అనితర సాధ్యం అనే విధంగా పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. అతని నటనకి అవార్డులు వస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆఫ్రికన్ వ్యక్తిగా కనిపించిన హాలీవుడ్ నటుడు, హకీం పాత్రలో నటించిన గోకుల్ కూడా తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. అమలాపాల్ పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో ఆమె ఆకట్టుకుంది. టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ సినిమా మొత్తాన్ని ఫ్రేమ్, ఫ్రేమ్ కి తన పనితనం చూపించాడు. రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి బాగా సెట్ అయి సినిమాకి హైలైట్ అయింది. డైరెక్టర్ బ్లేస్సీ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నిడివి బాగా ఎక్కువ అనిపిస్తుంది ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కానీ చెప్పాల్సిన విషయం ఎక్కడ డైల్యూట్ అవుతుందో అని భావించినట్లు ఉన్నారు.

ఫైనల్ గా చెప్పాలంటే ఆడు జీవితం ది గోట్ లైఫ్ ఒక ప్రయోగం లాంటిది. నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు, నాలుగు కామెడీ సీన్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ సినిమా అస్సలు నచ్చదు. సినీ ప్రేమికులకు, మేకింగ్ ఇష్టపడే వారికి మాత్రమే కనెక్ట్ అయ్యి నచ్చే సినిమా ఇది.

Show comments