NTV Telugu Site icon

Thar Movie Telugu Review : థార్ (హిందీ) నెట్ ఫ్లిక్స్

Thar

Thar

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ కొడుకు హర్షవర్థన్ సైతం ఇప్పుడు నటిస్తున్నాడు. అయితే మూవీస్, వెబ్ సీరిస్ లను సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటున్నాడు. తన తండ్రితో కలిసి తొలిసారి ‘ఏకే వర్సెస్ ఏకే’ మూవీలో నటించిన హర్ష… ఇప్పుడు మరోసారి ‘థార్’ చిత్రంలో నటించాడు. నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వంలో అనిల్ కపూర్, హర్షవర్థన్ సంయుక్తంగా నిర్మించడం విశేషం.

ఇండియా – పాకిస్తాన్‌ బోర్డర్ లో రాజస్థాన్ నుండి చిట్టచివరి రైల్వే స్టేషన్ ఉన్న ఊరు మునబో. అక్కడి యువకుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులు. మహిళలు భర్తల శారీరక సుఖాలను తీర్చే పనిముట్లు. ఎడారిలో జీవనాన్ని సాగించే వారి మనసుల్లో ఒయాసిస్సులు ఇంకిపోయి చాలా కాలమే అవుతుంది. ఇది 1985 నాటి కథ. ఆ ఊరిలో ఊహించని విధంగా ఓ వ్యక్తి హత్యకు గురై శవమై చెట్టుకు వేలాడ దీయబడతాడు. తన స్నేహితుడు, హెడ్ కానిస్టేబుల్ భూరేలాల్ (సతీశ్ కౌశిక్)తో కలిసి పోలీస్ ఆఫీసర్ సురేఖా సింగ్ (అనిల్ కపూర్) విచారణ మొదలు పెడతాడు. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే అదే గ్రామంలో మరో జంట హత్యలు జరుగుతాయి. ఈ రెండు సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తుంటారు. ఆ సమయంలోనే ఊరిలోకి సిద్ధార్థ్‌ (హర్షవర్థన్) అనే యాంటిక్స్ వ్యాపారం చేసే యువకుడు అడుగుపెడతాడు. ఇదిలా ఉండగానే ఆ గ్రామాన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ నుండి నల్లమందు అక్రమ రవాణా జరుగుతున్న విషయం సురేఖా సింగ్ దృష్టికి వస్తుంది. నిరుద్యోగులకు సాయం చేస్తానని చెప్పే సిదార్థ్ ఆ ఊరిలోని పన్నా(జితేంద్ర జోషి)ని కలవడానికి వస్తాడు. అతను ఊరిలో లేకపోవడంతో వచ్చే వరకూ ఉండమని పన్నా భార్య చేతన (షాతిమా సనా షేక్) సిదార్థ్ ను కోరుతుంది. నల్లమందు వ్యాపారమే ఈ హత్యలకు కారణమా? సిద్ధార్థ్ కూ ఈ హత్యలతో సంబంధం ఉందా? భర్త చేతిలో హింసకు గురైన చేతన నేపథ్యం ఏమిటీ? ఇవన్నీ సినిమా ద్వితీయార్థంలో రివీల్ అయ్యే అంశాలు.

నియో వెస్ట్రన్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘థార్’ మూవీని దర్శకుడు రాజ్ సింగ్ చౌదరి తెరకెక్కించాడు. ముందు నుండే ఇది నెట్ ఫ్లిక్స్ కోసమని ఫిక్స్ కావడంతో హింసతో పాటు శృంగార సన్నివేశాలకూ దర్శకుడు తగిన చోటు కల్పించాడు. హత్యలకు కారకులు ఎవరు అనే అంశంలో ఎటువంటి క్లూ ఇవ్వకుండా దర్శకుడు సినిమా చివరి వరకూ ఉత్కంఠను బాగానే మెయిన్ టైన్ చేశాడు. దానికి తగ్గట్టుగా ‘షోలే’ సినిమాలోని పాత్రలను ఉదహరిస్తూ చెప్పే సంభాషణలు సరదాగా ఉండి ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాటలు రాయడం విశేషం. శ్రేయా దేవ్ దుబే కెమెరా పనితనం, అజయ్ జయంతి నేపథ్య సంగీతం బాగున్నాయి. రాజస్థాన్ నేపథ్యంలో గతంలో అనేక సినిమాలు వచ్చినా, ఇందులో సరికొత్త ప్రదేశాలను చూపించారు. ముఖ్యంగా థార్ ఎడారి ప్రాంత పల్లెటూళ్ళలోని రగ్గడ్ నెస్ ను ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చూపారు. రాజ్ సింగ్ చౌదరితో కలిసి యోగేశ్ దాబువాలా, ఆంథోని కాటినో సమకూర్చిన స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. వివిధ పాత్రలు, వాటి మధ్య ఉన్న అనుబంధాల్ని రివీల్ చేయడం బాగుంది. ఓపెనింగ్ క్రెడిట్స్ లో వచ్చే శాశ్వత్ సచిదేవ్ స్వరపరిచిన పాట బాగుంది. దర్శకుడు రాజ్ సింగ్ కు ఇదే మొదటి సినిమా అయినా కథను బాగానే డీల్ చేశాడు. అయితే నల్లమందు అక్రమ రవాణా ఎపిసోడ్ ను ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించారు దాంతో అది తేలిపోయింది. అలానే సురేఖా సింగ్ కు సంబంధించిన ఆంతరంగిక సమస్యలను మరింత బాగా చూపించి ఉండొచ్చు. సినిమా నిడివి పెరగకుండా ఉండాలన్న నిర్ణయం కారణంగా చాలా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.

నటీనటుల విషయానికి వస్తే ఎప్పటిలానే అనిల్ కపూర్ తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేకూర్చాడు. పాత్రను అర్థం చేసుకుని చక్కగా నటించాడు. హర్షవర్థన్ కపూర్ కు పెద్దంతగా సంభాషణలు లేవు. వీలైనంత వరకూ అతను కళ్ళతోనే హావభావాలను పలికించాడు. నటుడిగా అతను మెరుగవుతున్న విషయం ఈ సినిమా చూస్తే అర్థమౌతుంది. ఫాతిమా సనా షేక్ పాత్ర ప్రేక్షకుల ఊహకు అందని విధంగా సాగింది. ఆమె నటన బాగుంది. ఇక మిగిలిన పాత్రలను సతీశ్‌ కౌశిక్, ‘సాక్రిడ్ గేమ్స్’ ఫేమ్ జితేంద్ర జోషి, ముక్తి మోహన్‌, నివేదిత భట్టాచార్య, మందాకిని కరిమి, అక్షయ్ గున్నావత్, సంజయ్ దథీచ్, సంజయ్ బిష్ణోయ్, రాహుల్ సింగ్ తదితరులు పోషించారు. వెస్ట్రన్ మూవీస్ ఇన్‌ ఫ్లుయెన్స్ తో రూపుదిద్దుకున్న ‘థార్’ చిత్రం థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్:
అనిల్ కపూర్, హర్షవర్థన్ కలిసి నటించడం
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్షన్
సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
బలహీనంగా ఉన్న నల్లమందు ట్రాక్
ప్రేక్షకులను కావాలని తప్పుదోవ పట్టించడం
వెస్ట్రన్ మూవీస్ ఇన్ ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం

ట్యాగ్ లైన్ : ‘థార్‌’లో ఒయాసిస్సు!