NTV Telugu Site icon

Tees Maar Khan Movie Review : తీస్ మార్ ఖాన్ రివ్యూ

Tees Maar Khan

Tees Maar

ఈ యేడాది ఆది సాయికుమార్ నటించిన రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో సినిమాగా ‘తీస్ మార్ ఖాన్’ వచ్చింది. ‘అతిధి దేవో భవ, బ్లాక్’ వంటి ప్రయోగాత్మక చిత్రాల ఫలితం ప్రతికూలంగా ఉండటంతో… తాజాగా ఆది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ట్రై చేశాడు. బట్… ఫలితం మాత్రం అదే రిపీట్ అయ్యింది. కళ్యాణ్‌ జి గోగన దర్శకత్వంలో డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోతాడు. అతనిలానే ఇల్లు వదిలేసి వచ్చిన వసూ (పూర్ణ) ఆ పిల్లాడిని చేరదీస్తుంది. ఆమెలోనే తల్లిని చూసుకుంటాడు తీస్ మార్ ఖాన్. అనుక్షణం ఆమెను ప్రొటక్ట్ చేస్తూ తానే లోకంగా బతుకుతుంటాడు. అలాంటి తీస్ మార్ ఖాన్… అనఘ (పాయల్ రాజ్ పుత్)ను చూసి ప్రేమలో పడతాడు. అప్పటి వరకూ రౌడీలా తిరిగిన అతను ఆమె కోసం కాలేజీలో చేరతాడు. అండర్ వరల్డ్ డాన్ జిజా (అనూప్ సింగ్ ఠాకూర్) ఒకానొక సందర్భంలో హోమ్ మినిస్టర్ రంగరాజన్ (శ్రీకాంత్ అయ్యంగార్)పై హత్యాయత్నం చేస్తాడు. అప్పుడు తీస్ మార్ ఖాన్ అతన్ని రక్షిస్తాడు. అయితే తన వాళ్ళను తీస్ మార్ ఖాన్ కొట్టాడనే కోపంతో జిజా… వసూను హత్య చేస్తాడు. హోమ్ మినిస్టర్ సహకారంతో జీజాను చంపాలని తీస్ మార్ ఖాన్ పోలీస్ అవతారం ఎత్తుతాడు. అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. దాన్ని రివీల్ చేయడం సబబు కాదు…. తెర మీద చూడాల్సిందే.

ఫాంటసీ, థ్రిల్లర్ మూవీస్ చూసేప్పుడు ప్రేక్షకులు లాజిక్ గురించి పెద్దంత ఆలోచన చేయరు. కానీ ఇప్పుడు సోషల్ మూవీస్ కూడా అదే జాబితాలో చేరిపోయాయి. రౌడీగా జీవితాన్ని గడిపే ఓ వ్యక్తి కాలేజీ స్టూడెంట్ గా, పోలీస్ ఆఫీసర్ గా మారిపోవడం… ఇందులో చాలా చిత్రంగా జరిగిపోతుంది. హోమ్ మినిస్టర్ తలుచుకుంటే… ఎవరు ఏమైనా కావచ్చు అన్నట్టుగా చూపించారు. సినిమా ప్రారంభం నుండి దాదాపు గంటన్నర పాటు పరమ రొటీన్ గా సాగిపోయింది. సన్నివేశాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి. సాంగ్స్, యాక్షన్ సీన్స్ మధ్యలో వస్తుంటాయి. ఇక కథ కంచికి చేరుతోందని భావిస్తున్న తరుణంలో అసలు ట్విస్ట్ మొదలవుతాయి. వసూ హత్యతో మొదలైన ట్విస్ట్ మూవీ చివరి వరకూ సాగుతుంది. నిజానికి అది కూడా ఊహించని ట్విస్ట్ ఏమీ కాదు… కానీ అప్పటి వరకూ పరమ రొటీన్ గా కథ సాగడంతో అది కాస్తంత బెటర్ అనిపిస్తుంది… అంతే!

ఇలాంటి కథలో గొప్పగా నటించడానికి ఏమీ ఉండదు. ఆది సాయికుమార్ జస్ట్ ఆ పాత్రను అలా సునాయాసంగా చేసుకుంటూ పోయాడు, అంతే! హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికీ ఏమీ లేదు. పేరుకు కాలేజీలో చదువుతుంది కానీ మనకు మాత్రం రోడ్డు మీద డాన్సులు చేస్తూ కనిపిస్తుంది. అలా ఆమెను చూసే సదరు హీరో ప్రేమలో పడతాడు. స్క్రిన్ షోకు అభ్యంతరం పెట్టని పాయల్ రాజ్ పుత్ ను అందుకోసమే తీసుకున్నట్టు అర్థమైపోతోంది. హీరో హీరోయిన్ల పై ఫారిన్ బీచ్ లో తీసిన సాంగ్, క్లయిమాక్స్ ముందువచ్చే స్నేహా గుప్తా ఐటమ్ సాంగ్ కంటే హాట్ గా ఉంది. హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన పూర్ణ ఇందులో కీలకమైన పాత్ర చేసి మెప్పించింది. ఆమె భర్తగా సునీల్ సూపర్ క్యారెక్టర్ చేశాడు. అద్భుతమైన నటనా ప్రదర్శించాడు. అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ దుహన్ సింగ్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ ఇమేజ్ కు తగ్గ పాత్రలే చేశారు. ఇతర ప్రధాన పాత్రలను ఆర్జే హేమంత్, మేకా రామకృష్ణ, అంబటి అర్జున్, చింటూ తదితరులు పోషించారు. సాయికార్తిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటల ట్యూన్స్ పాతగానే అనిపించాయి. కథ రొటీన్ గా ఉండటం, కథనం ఆసక్తికరంగా లేకపోవడం ‘తీస్ మార్ ఖాన్’కు సంబంధించిన మెయిన్ మైనస్ పాయింట్. చివరిలో ఏదో కొత్తగా ట్రై చేసినా… అప్పటికే ప్రేక్షకులు డీలా పడిపోవడంతో ప్రయోజనం లేకపోయింది.

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
సునీల్ నటన
సాయికార్తిక్ సంగీతం
ప్రొడక్షన్ వాల్యూస్
యాక్షన్ సీన్స్

మైనెస్ పాయింట్స్
సరిగాలేని క్యారెక్టరైజేషన్
పండని ఎమోషనల్ సీన్స్
ఆకట్టుకోని కథనం

ట్యాగ్ లైన్: దొరికితే దెబ్బలే!