NTV Telugu Site icon

Swag Movie Review: స్వాగ్ మూవీ రివ్యూ..శ్రీవిష్ణు హిట్ కొట్టాడా?

Swag Review

Swag Review

Swag Movie Review and Rating: శ్రీ విష్ణు హీరోగా ఈ మధ్య వరుస హిట్లను అందుకున్నాడు. అలాంటి ఆయన తనతో రాజరాజ చోర అనే సినిమా చేసిన హాసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అచ్చ తెలుగు సినిమా అంటూ మరో సినిమా చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఆసక్తికరంగా రీతు వర్మ, మీరాజాస్మిన్ సహా ఈ సినిమాలో దక్ష నగార్కర్ నటించారు. ప్రమోషన్స్ తో ఒక్కసారిగా ఈ సినిమా యూనిట్ సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసింది. దానికి తోడు టీజర్, ట్రైలర్ కట్స్ బాగా కుదరడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూశారు. మరి ఆ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

స్వాగ్ కథ:
దివాకర్ పేట అనే ప్రాంతంలో ఎస్సైగా పనిచేసి రిటైర్ అవ్వబోతున్న భవభూతి( మూడో శ్రీ విష్ణు)కి తన పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఒక లేఖ అందుతుంది. దానికోసం వంశవృక్ష నిలయం వెళ్లిన భవభూతి అక్కడ అధికారి (గోపరాజు రమణ)నీ నమ్మించి ఆస్తి దక్కించుకోవాలి అని అనుకుంటాడు. అయితే అక్కడికి అలాంటిదే లేఖ అందుకున్న అనుభూతి (రీతూ వర్మ) కూడా చేరి ఆ ఆస్తి తనకు దక్కాలని అంటుంది. ఇదంతా ఇలా జరుగుతుంటే మరోపక్క సింగ ( నాలుగో శ్రీ విష్ణు) అలాంటి లేఖ రావడంతోనే వంశవృక్షనిలయానికి వస్తాడు. అసలు వీళ్ళందరికీ లేఖలు రాసింది ఎవరు? ఈ శ్వాగణిక ఆస్తి ఎవరికి దక్కుతుంది? అసలు వారసులు ఎవరు? చిన్నప్పుడే తండ్రి యయాతి (రెండో శ్రీ విష్ణు) నుంచి భవభూతి ఎందుకు దూరమయ్యాడు? అసలు ఈ శ్వాగణిక వంశ మూలపురుషుడు భవభూతి(మొదటి శ్రీ విష్ణు ) మాతృస్వామ్యాన్ని పితృస్వామ్యంగా ఎలా మార్చాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
ఒకరకంగా చెప్పాలంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. కానీ తనదైన రైటింగ్ స్టైల్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా కథ రాసుకున్నాడు డైరెక్టర్.. ఎప్పుడో రాజరికపు రోజుల నుంచి మొదలుపెట్టి ఆ తరాలను వారి వారసులను కనెక్ట్ చేస్తూ రాసుకున్న తీరు ఆసక్తికరం. అలాగే సమాజంలో ఒక ప్రధానమైన సమస్యను చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. అయితే ఒక సాధారణమైన కథను కాస్త జటిలంగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా చెబుదామనుకునే ప్రక్రియలో కన్ఫ్యూజన్ కి గురిచేసిన ఫీలింగ్ కలుగుతుంది. వింజామర సామ్రాజ్యం, శ్వాగణిక వంశం అంటూ 1500 సంవత్సరంలోని విషయాలతో మొదలై వారి తరతరాల వారసుల కథలను భలే ఆసక్తికరంగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. అయితే చాలా సుదీర్ఘమైన కథను రెండున్నర గంటల్లోనే చెప్పాల్సి వచ్చిన క్రమంలో చాలా వరకు సీన్లు లేపేసి ఉండవచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి సినిమా విషయంలో కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లే చాలా సీన్స్ అనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ అంతా కాస్త సరదా సరదాగానే సాగిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి కొద్దికొద్దిగా అనుమానాలు క్లియర్ అవుతూ వస్తాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత మొత్తం సినిమా అంతా ఎమోషనల్ గా ఆలోచింపచేసే విధంగా సాగుతూ పోయింది. నిజానికి ఈ సినిమాల్లో ప్రస్తావించిన విషయాన్ని ఇదే మొదటిసారి ప్రస్తావించలేదు. గతంలో ఎన్నో సినిమాల్లో కూడా ప్రస్తావించారు. కానీ ఒక పూర్తిస్థాయి కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో ఇలాంటి మెసేజ్ ఇప్పించడం, ఇప్పించాలనుకోవడం సాహసమే. ఆ సాహసాన్ని చేసి ప్రేక్షకులను చాలావరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయింది సినిమా యూనిట్. కాకపోతే మనం ఒకటి ప్రిపేర్ అయ్యి వెళితే క్వశ్చన్ పేపర్ వేరేది వచ్చినట్టు పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ అనుకుని థియేటర్లోకి మీరు వెళితే పొరపాటు పడినట్లే ఎందుకంటే సినిమాలో ఎమోషనల్ పార్ట్ కీలక పాత్ర పోషించింది.

నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఈ సినిమాలో నటుడిగా మరో మెట్టు ఎక్కేశాడు. దాదాపు ఐదు పాత్రలు, ఆరేడు గెటప్పులతో ఒక్కొక్క దానికి భిన్నత్వాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక రివీల్ చేయని పాత్రలో ఎవరూ ఊహించని విధంగా కనిపించిన శ్రీ విష్ణు భళా అనిపించాడు. ఇక రీతు వర్మ కూడా పలు భిన్నమైన పాత్రలు పోషించింది. కానీ మీరాజాస్మిన్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్. ఆమెకు రీఎంట్రిలో మంచి పాత్ర దొరికింది. గోపరాజు రమణ- రవిబాబు కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. సునీల్, గెటప్ శ్రీను, కమెడియన్ పృథ్వి వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడిగా రచయితగా హాసిత్ తనదైన మార్కు వేసుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా డైలాగ్స్ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇక వివేక్ సాగర్ సంగీతం సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అలాగే మేకప్ వర్క్ బాగా సెట్ అయింది. సినిమా కోసం వేసిన ఆర్ట్ వర్క్ అంతా సినిమాను ఎలివేట్ చేసేలా ఉంది. అయితే ఇలాంటి కథను విని దానిని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతను అభినందించాల్సిందే.

ఫైనల్లీ స్వాగ్.. అంచనాలు లేకుండా వెళ్తే ఎంజాయ్ చేసి ఆలోచిస్తూ బయటకొస్తారు. 

Show comments