NTV Telugu Site icon

Suzhal Review : సుడల్ (తమిళ డబ్బింగ్)

suzhal

suzhal

 

తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ కంటే ముందు రెండు సినిమాలను పుష్కర్ – గాయత్రి దంపతులు తీసినా, ఆ సినిమాతోనే అందరి దృష్టీ వాళ్ళ మీద పడింది. తెలుగులో ‘విక్రమ్ వేద’ రీమేక్ అవుతుందనే ప్రచారం బాగా జరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు పుష్కర్ – గాయత్రి జంటే హిందీలో ‘విక్రమ్ వేద’ను రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే పుష్కర్, గాయత్రి రచన చేసి, క్రియేటివ్ డైరెక్టర్స్ గా వ్యవహరించిన ‘సుడల్’ వెబ్ సీరిస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థిల్లర్ డ్రామాను జి. బ్రహ్మ, అనుచరన్‌ మురుగయన్ డైరెక్ట్ చేశారు.

తమిళనాడులోని ఓ చిన్న పల్లెటూరిలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలోని సిమెంట్ ఫ్యాక్టరీనే అక్కడి జనాలకు జీవనాధారం. ఉన్న ఎకరం, రెండు ఎకరాల పొలాన్ని ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇచ్చేసి, అందులోనే వర్కర్స్ గా పని చేస్తుంటారు ఊరి జనం. ఎనిమిది రోజుల పాటు సాగే గ్రామదేవత సంబరాలు మొదలైన మొదటి రోజునే అక్కడి సిమెంట్ ఫ్యాక్టరీ తగలబడిపోతుంది. అదృష్టం కొద్ది ఆ రోజున వర్కర్లంతా స్ట్రైక్ చేయడంతో ప్రాణనష్టం జరగదు. ఫ్యాక్టరీ తగలబడటానికి కారణం యూనియన్ లీడర్ షణ్ముఖం (పార్తీబన్) అని నమ్మిన ఇన్ స్పెక్టర్ రెజీనా థామస్ (శ్రియా రెడ్డి) అతన్ని అరెస్ట్ చేయడానికి వెళుతుంది. అదే సమయంలో షణ్ముఖం కూతురు నీలా (గోపికా రమేష్‌) తప్పిపోయిన విషయం తెలుస్తుంది. తండ్రి సంరక్షణలో ఉన్న చెల్లెలు ఎలా తప్పిపోయిందో తెలియని నందిని హుటాహుటిన సిటీ నుండి గ్రామానికి వస్తుంది. తన స్నేహితుడైన సబ్ ఇన్ స్పెక్టర్ చక్రవర్తిని ఎలాగైనా తన చెల్లెల్ని వెతికి పెట్టమని వేడుకుంటుంది. పాతికేళ్ళ క్రితం ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు జాతర సమయంలోనే ఓ అమ్మాయి తప్పిపోతుంది. మళ్ళీ ఇన్నేళ్ళకు ఫ్యాక్టరీ తగలబడిన రోజునే మరో అమ్మాయి మిస్ కావడంతో ఫ్యాక్టరీకీ, జాతరకు, మిస్సింగ్స్ కు ఏదో సంబంధం ఉందనే భావన ఊరి జనాలకు కలుగుతుంది. ఇదే సమయంలో తగలబడిన ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఇన్ స్పెక్షన్ కు కోదండ రామం (సంతాన భారతి) వస్తాడు. అతనికి లంచం ఇచ్చి అయినా తమకు అనుకూలంగా రిపోర్ట్ రాయించుకోవాలని దాని ఎండీ త్రిలోక్ వడ్డే (హరీష్‌ ఉత్తమన్) ప్రయత్నిస్తుంటాడు. అసలు ఫ్యాక్టరీ తగలబడటానికి కారణం ఏమిటీ? గ్రామదేవత ఆగ్రహంతో ఉందనే ఊరి జనాల నమ్మకంలో నిజం ఎంత? ప్రతి చిన్న విషయానికీ యూనియన్ లీడర్ షణ్ముఖం, ఇన్ స్పెక్టర్ రెజీనా ఎందుకు కయ్యానికి కాలుదువ్వుతూ ఉంటారు? చెల్లిని కాపాడుకోవాలని తాపత్రయ పడిన నందిని కోరిక తీరిందా? పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేస్తున్న తప్పేమిటీ? వీటన్నింటి చుట్టూ అల్లుకున్న కథే ‘సుడల్’.

సీజన్ వన్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు నలభై అయిదు నిమిషాలు. ఇటీవల చాలామంది ఇలాంటి వెబ్ సీరిస్ మధ్యంతరంగా ఆపేసి, తర్వాత ఏం జరిగిందో సీజన్ 2లో చూడమని చెబుతున్నారు. కానీ అలాంటి తిరకాసులేవీ ‘సుడల్’ దర్శకులు పెట్టలేదు. కథను చెప్పడానికి తగినంత సమయం తీసుకున్న కారణంగా ఎనిమిది ఎపిసోడ్స్ లో తాము చెప్పాలనుకున్నది చెప్పేశారు. తమిళనాడులోని మారుమూల పల్లెల్లో ఉండే మూఢనమ్మకాల నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ సాగినా, నిజానికి దర్శకులు చెప్పాలనుకున్నకథ వేరే ఉంది. కిడ్నాప్ అయిన పదోతరగతి అమ్మాయి నీలను వెతికే క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు ఊహకు అందుకుండా ఉంటాయి. దాంతో అందులోని పాత్రలే కాదు, వీక్షిస్తున్న వారు సైతం అయోమయానికి గురవుతారు. ఇవాళ యువత తీరు ఇలా ఉందా? అని ఆశ్చర్యపోతారు. అయితే దర్శకులు బ్రహ్మ, అనుచరణ్‌ ఉద్దేశ్యపూర్వకంగా వ్యూవర్స్ ను సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చాలా చోట్ల చేశారు. చివరి ఎపిసోడ్ వరకూ ఈ మొత్తం వ్యవహారానికి మూల కారణం ఎవరనే దాన్ని దాచిపెట్టారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల సాగతీసినట్టు అనిపిస్తుంది. అయితే ఒక్కో చిక్కుముడి విడదీస్తూనే, మరో కొత్త ముడి వేసుకుంటూ వెళ్ళడంతో కథ రక్తి కట్టింది. చివరకు వచ్చే సరికీ ఈ చిన్న అంశాన్ని చెప్పడానికి ఇంత తతంగం అవసరమా!? అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెబ్ సీరిస్ లో చెప్పిన ప్రధానమైన అంశాన్నిఇటీవల దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీలో చూపించేశాడు.

నటీనటుల విషయానికి వస్తే పార్తీబన్ చాలా సన్నివేశాల్లో ‘ఆచార్య’లో చిరంజీవిని తలపించాడు. అతని బాడీ లాంగ్వేజ్ అచ్చు చిరంజీవి లానే ఉంది. హీరో విశాల్ వదిన, ఒకప్పటి పాపులర్ యాంకర్ శ్రియా రెడ్డి మరోసారి అద్బుత నటన ప్రదర్శించింది. పోలీస్ ఆఫీసర్ గా, దారి తప్పిన ఓ కొడుకు తల్లిగానూ చక్కగా నటించింది. ఒకానొక సమయంలో ఇది ‘దృశ్యం’లా సాగుతోందేమిటా అనే సందేహం చూస్తున్న వాళ్ళకు కలుగుతుంది. అలా అనుకుంటూ ఉండగానే కథ మరో మలుపు తిరిగిపోయింది. ఇక రెజీనా సహాయకుడిగా కదిర్, షణ్ముఖం పెద్ద కూతురుగా ఐశ్వర్యా రాజేశ్‌ బాగా చేశారు. ఐశ్వర్యా రాజేశ్‌ పాత్రను దర్శకులు మలచిన తీరు బాగుంది. రెజీనా భర్తగా ప్రేమ్ కుమార్, కొడుకు అతిశయంగా ఎఫ్‌జే, మరో కీలక పాత్రలో ఎలంగో కుమారవేల్ నటించారు. అయితే కుమార వేల్ పాత్ర ను అంత కన్వెన్సింగ్ గా దర్శకులు చివరిలో చూపలేకపోయారు. ఇతర ప్రధాన పాత్రలను హరీశ్ ఉత్తమన్, నివేదిత సతీశ్, గోపిక రమేశ్‌, లతారావు, యూసఫ్ హుస్సేన్, నితీశ్ వీర, సంతాన భారతి తదితరులు పోషించారు. ప్రతి పాత్రకూ ప్రాధాన్యమిచ్చిన దర్శకులు వాటిని చక్కగా మలిచారు. జాతర సన్నివేశాలు కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. అందుకు సామ్ సి. ఎస్. నేపథ్య సంగీతం ప్రధాన కారణం. నైట్ ఎఫెక్ట్ కు సంబంధించిన సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ బాగా చూపించాడు. నటీనటుల అభినయంతో పాటు సాంకేతిక నిపుణుల పనితనం చెప్పుకోదగ్గది. ఓ చక్కని సందేశంతో ముగిసే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కోసం వెచ్చించిన సమయం వృథా కాదు!

రేటింగ్ : 3/5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
నటీనటుల నటన
సామ్ నేపథ్య సంగీతం
దర్శకత్వ ప్రతిభ

మైనెస్ పాయింట్స్
ఎపిసోడ్స్ నిడివి ఎక్కువ ఉండటం
కథను అనవసర మలుపులు తిప్పడం

ట్యాగ్ లైన్: కనబడని సుడిగుండం!