సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గాంధీ తాత చెట్టు. పద్మావతి మల్లాది డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మరో దర్శకురాలు శేష సింధూ రావు నిర్మించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పించిన ఈ సినిమాను మొదట సినిమా స్టాక్ ఎక్స్ చేంజ్ అనే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫారం ద్వారా నిర్మించారు. తరువాత సుకుమార్ రైటింగ్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇన్వాల్వ్ అయి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ కి ముందే అనేక ఇంటర్నేషనల్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు సంపాదించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఎలా ఉంది? సుకుమార్ కుమార్తె ఎలా నటించింది లాంటి వివరాలు ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ :
ఈ కథ నిజామాబాద్ జిల్లాలో 90లలో జరుగుతూ ఉంటుంది. మన జాతి పిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మరణించిన సమయంలో నాటిన చెట్టు అంటే ప్రాణంగా బతుకుతూ ఉంటాడు రామచంద్రయ్య (ఆనంద్ చక్రపాణి). గాంధీ మీద ఉన్న ప్రేమతో తన మనవరాలి(సుకృతి)కి కూడా గాంధీ అనే పేరు పెడతాడు. తమ ఊరు మొత్తం ఆధారపడి బతికే చెరుకు ఫ్యాక్టరీ మూసేస్తున్నారనే విషయం తెలిసి ఆందోళన చెందుతాడు రామచంద్రయ్య. ఇదే అదునుగా కెమికల్ ఫ్యాక్టరీ పెడతాను భూములు అమ్మాలంటూ సిటీ నుంచి సతీష్ (రాగ మయూర్) ఊరిలోకి దిగుతాడు. ఊరిలో అందరూ పొలాలు అమ్మినా, రామచంద్రయ్య మాత్రం భూమి అమ్మేది లేదని తెగేసి చెబుతాడు. అయితే వీరి పొలం అమ్మితే తప్ప ఫ్యాక్టరీ కట్టే అవకాశం లేక ఆ కారణంగా ఊరిలో వాళ్ళ నిష్టురాలు భరించలేక ఒకరోజు కొడుకు రామచంద్రయ్య మీద తిరగబడతాడు. అది తట్టుకోలేక మనస్థాపంతో రామచంద్రయ్య కన్నుమూస్తాడు. అయితే కన్నుమూసే ముందు తన మనవరాలు గాంధీ దగ్గర ఒక మాట తీసుకుంటాడు. ఆ మాట ఏంటి? రామచంద్రయ్య కి ఇచ్చిన మాటను గాంధీ నిలబెట్టుకుందా ? చివరికి ఏమైంది? ఆ ఊరి సమస్యను గాంధీ ఎలా తీర్చగలిగింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ
ఒకపక్క సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సిరీస్ చేస్తుంటే అందుకు భిన్నంగా ఆయన కుమార్తె చెట్లను కాపాడే నేపథ్యంలో ఒక సినిమాతో ముందుకొచ్చింది. నిజానికి పక్షులు, జంతువుల లాగానే చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అతి తక్కువ మంది మాత్రమే వాటిని కూడా ప్రాణులుగా వాటికి కూడా ఫీలింగ్స్ ఉన్నట్లు భావిస్తూ వాటితో మెలుగుతూ ఉంటారు. అలా చెట్టుని కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించే రామచంద్రయ్య, ఆయనకు ఇచ్చిన మాట కోసం మనవరాలు గాంధీ ఆ చెట్టును కాపాడేందుకు చేసిన పోరాటమే ఈ గాంధీ తాత చెట్టు. ఇది కమర్షియల్ సినిమా కాదు, డబ్బుల కోసం చేసిన సినిమా అంతకన్నా కాదు అనే విషయం సినిమా మొదలైన కాసేపటికి అర్థం అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఊరిని, ఊరి జనాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిన దర్శకురాలు రామచంద్రయ్య పాత్రతో పాటు గాంధీ పాత్రను పరిచయం చేసి ముందే ఒక రకమైన క్లారిటీ ఇచ్చేస్తారు. అయితే అప్పుడప్పుడే ఇండస్ట్రీలు పల్లెటూర్ల మీద పడి పంట పొలాలను లాక్కుంటూ కాలుష్యం వైపు తీసుకెళుతున్న క్రమాన్ని ఆసక్తికరంగా చూపించారు. నిజానికి ఇలాంటి లైన్ తో అంటే ఒక పల్లెటూరికి వెళ్లి అక్కడ పంట పొలాలు తీసుకొని ఇండస్ట్రీ సిద్ధం చేయాలి అనుకుంటే దానిని ఎలా పోరాటం చేసి ఆపగలిగారు అనే లైన్ తో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ గాంధీయవాదం నూరిపోసిన తాతకి ఇచ్చిన మాట కోసం 12 ఏళ్ల చిన్నారి పడిన కష్టంతో కళ్ళు చెమర్చాయి. నిజానికి సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికి అసలు కథ ఏమిటి అనే విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి సినిమాలకు ట్విస్టులు ఏమైనా ఉంటాయేమో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు అలాంటి ట్విస్ట్ ఏమీ లేకుండా ముగించడం కాస్త ఇబ్బందికర అంశమే. అయినా సరే ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్లు అనిపించకుండా చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో దర్శకరాలు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో మనవరాలి చేత తాత మాట తీసుకుని మరణించడం, ఆ మాట కోసం మనవరాలు పడిన వేదన, చివరికి ఆ మాట నెగ్గించుకున్న విధానం ఆలోచింపచేస్తూనే కొందరిని కన్నీళ్ల పర్యంతం చేస్తుంది అనడంలో సందేహం లేదు.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి సుకుమార్ కుమార్తె సుకృతి వేణి హీరో. అదేంటి అని అనుకోకండి ఎందుకంటే ఆమె చుట్టూనే, ఆమె ద్వారానే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ లో గాంధేయవాదం నూరిపోసిన తాత చాటు మనవరాలిగా ఎంత అమాయకంగా నటించిందో సెకండ్ హాఫ్ లో దానికి మించిన నటనతో ఆకట్టుకుంది. మెచ్యూర్డ్ గా, ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటిలాగా ఆమె నటించిన తీరు అభినందనీయం. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు అత్యద్భుతం. భవిష్యత్తులో సుకుమార్ తన కుమార్తెను తన సినిమాల్లో కూడా తీసుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇలాంటి పెర్ఫార్మర్ ని ఎవరు మాత్రం వదలకుంటారు. ఇక తాత పాత్రలో ఆనందచక్రపాణి తనదైన అనుభవాన్ని పండించారు. సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ జీవించాడు. సుకృతి తల్లిదండ్రులుగా చేసిన వారితో పాటు ఆమె స్నేహితులుగా నటిచ్చిన ఇద్దరు కూడా చాలా న్యాచురల్ గా నటించారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సిన సంగీత దర్శకుడు రీ గురించి. ఎక్కడా అనవసరమైన రణ గొణ ధ్వనుల జోలికి వెళ్లకుండా అవసరమైన విధంగా తెలంగాణ యాసలో తెలుగు ప్రజానీకం మెచ్చేలా నచ్చేలా మ్యూజిక్ అందించిన తీరు అభినందనీయం. డైలాగ్స్ విషయంలో కూడా ఎక్కువ ఆలోచనలకు తావీయకుండా సింపుల్గా రాసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు దర్శకురాలు. ఇక సినిమాలో ముఖ్యంగా లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అంతే నేచురల్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ కూడా సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులు కాస్త సాగదీసిన ఫీలింగ్ తట్టుకుంటే ఒక మంచి సినిమా చూసినా అనుభవం ఖచ్చితంగా ఉంటుంది.
గాంధీ తాత చెట్టు… కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా చేసిన ఓ ఫీల్ గుడ్ సినిమా..