NTV Telugu Site icon

Gorre Puranam Movie Review: గొర్రె పురాణం మూవీ రివ్యూ

Gorre Puranam

Gorre Puranam

హీరోగా మారి విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు సుహాస్. ఆయన చేసిన చాలా సినిమాలు హిట్లుగా నిలిచాయి. తాజాగా సుహాస్ నటించిన గొర్రె పురాణం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుతోనే ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాబ్ చేసిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. దానికి తోడు సుహాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించకపోవడం, ఇప్పుడే సినిమా రిలీజ్ చేయవద్దని మేకర్స్ ని ఆయన కోరినట్లు ప్రచారం జరగడంతో ప్రేక్షకుల అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది? అని ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మరి సెప్టెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

గొర్రె పురాణం కథ:
రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేసి జైలుకు వెళతాడు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి గొర్రెను జుబా చేసి ఇంటిల్లిపాది బిర్యానీ చేసుకుందామని కొనుగోలు చేస్తాడు. ఆ గొర్రెను సదరు ముస్లిం వ్యక్తి కుమార్తె ప్రేమగా చూసుకుని తన తండ్రి చంపుతున్నాడు అనే విషయం తెలిసి దాన్ని వదిలేస్తుంది. ఆ గొర్రెను పట్టుకునేందుకు దాని వెంట ముస్లిం వ్యక్తితో పాటు మరి కొంతమంది పడతారు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఒక గ్రామ దేవత ఆలయంలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇచ్చింది కాబట్టి దానిని తామే బలిస్తామని అక్కడి హిందువులు వెంటపడుతూ ఉంటారు. ఒకపక్క ముస్లింలు మరోపక్క హిందువులు వెంటపడుతూ ఉండగా గొర్రె ఎవరికీ దక్కాలి అనే విషయం మీద పంచాయతీ జరుగుతుంది. ఆ నోట ఈ నోట పడి మీడియా ఇంటర్ ఇవ్వడంతో గొర్రె మతకలహాలు రేకెత్తిస్తోంది అంటూ దాన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. రవి సెల్ లోనే దాన్ని కూడా బంధిస్తారు. అసలు రవి ఒకరిని ఎందుకు మర్డర్ చేశాడు? రవి చేసిన మర్డర్ కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? వాళ్లు ఎందుకు చంపడానికి ప్రయత్నించారు? లాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.

విశ్లేషణ:
రాజమౌళి ఈగతో సినిమా చేశాడు, నేను గొర్రెతో చేస్తే చూడరా అన్నట్టుగానే ఈ సినిమాలో గొర్రెను కూడా ఒక పాత్రగా పెట్టినట్టు అనిపిస్తుంది. సాధారణంగా ఏదైనా జంతువును ఒక ఎలిమెంట్ గా తీసుకుని మన తెలుగు దర్శకులే కాదు చాలా ఇతర భాషల దర్శకులు కూడా సినిమాలు చేశారు. ఈ సినిమా కూడా అలాగే మొదలవుతుంది. మొదట సుహాస్ ఒక మర్డర్ చేయడంతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత గొర్రె పురాణం అంటూ సాగుతుంది. అసలు ఈ గొర్రె కథ ఎక్కడ మొదలైంది? ఈ గొర్రె ఏం కోరుకుంటుంది? దాని ఉద్దేశం ఏంటి? లాంటి విషయాలను కాస్త వ్యంగ్యంగా చెబుతూనే అసలు కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా జనం మీద మీడియా మీద రాజకీయ నాయకుల మీద సెటైర్లు గట్టిగానే వేశారు. ఎలాంటి విషయాన్నైనా జనం గొర్రెల్లాగా ఒకరి మాట విని ఫాలో అయిపోవడం, మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ ని సైడ్ లైన్ చేయడానికి మరో సెన్సేషనల్ న్యూస్ తెర మీదకు తీసుకురావడం, రాజకీయ నాయకులు తమ అనుకున్న వారికోసం ఎంత దూరం వెళుతున్నారు లాంటి విషయాలను రియాలిటీకి దగ్గరగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈ క్రమంలో కాస్త కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. నిజానికి కథగా చూసుకుంటే చాలా మంచి పాయింట్. కానీ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడో లేక మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నాడో తెలియదు కానీ ప్రేక్షకులను మాత్రం కన్ఫ్యూజన్లోకి నెట్టేశాడు. అయితే మీడియా మీద, సగటు సమాజం మీద వేసిన సెటైర్లు మాత్రం నవ్వించేలా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక సోషల్ సెటైర్ సినిమా. చాలాచోట్ల ప్రేక్షకులను నవ్విస్తూ కొన్నిచోట్ల క్రింజ్ అనిపిస్తూ సాగింది. కొత్త కథ అని చెప్పలేం కానీ పూర్తిస్థాయి సెటైరికల్ విధానం మీదే నమ్మకం పెట్టుకున్న దర్శకుడు ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యాడు. అసలు సుహాస్ మర్డర్ ఎందుకు చేశాడు? మొత్తం ముగ్గురిని ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయాన్ని చూపించాడు కానీ దాని ఎమోషన్ కనెక్ట్ చేసే విషయంలో తడబడ్డాడు.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోగా చెప్పబడుతున్న సుహాస్ పాత్ర అంత ఎక్కువ సేపు ఏమీ లేదు. కథ అతని చుట్టే తిరుగుతుంది కానీ నిడివి తక్కువే. అయినా ఉన్నంతలో తనదైన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఎక్కువసేపు కనిపించింది గొర్రె. గొర్రెతో నటన ఎక్స్పెక్ట్ చేయలేం కానీ ఆ గొర్రెకు వాయిస్ ఓవర్ ఇప్పించిన తరుణ్ భాస్కర్ తో మాత్రం హాస్యం పండించారు. ఇక మరో గొర్రెకు గెటప్ శ్రీను గాత్ర దానం చేయడం గమనార్హం. మిగతా పాత్రల్లో కనిపించిన కమెడియన్ రఘు, జెన్నీ వంటి వాళ్ళ పాత్రలకు కూడా నిడివి తక్కువే కానీ ఉన్నంతలో తమ అనుభవాన్ని చూపించారు.. ఇక ఈ సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపచేసేలా రాసుకున్నారు. సోషల్ సెటైర్ సినిమాలు ప్రేక్షకులను ఒక పక్కన నవ్విస్తూనే మరోపక్క ఆలోచింపచేసేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాని కూడా అలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ క్యారీ చేయడంలో తన వంతు పాత్ర పోషించింది అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. సినిమా నిడివి కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ ఈ గొర్రె పురాణం ట్రెండీ సోషల్ సెటైర్ సినిమా.. లాజిక్స్ వెతుక్కోకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు..

Show comments