Slum Dog Husband Movie Review: సినిమా రంగంలో ఇప్పుడు వారసుల హవా కొనసాగుతోంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు ‘పిట్టకథ’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమాకు మంచి టాక్ రాగా ఈ సారి ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండగా, బాలనటిగా కొన్ని సినిమాలు చేసి టీవీలో బిజీ అయిన తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో పెళ్ళికి ముందు కుక్కను వివాహం చేసుకోవాల్సి రావడం అనే కథ కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టు ట్రైలర్ లో కూడా కొన్ని పక్కా మాస్ డైలాగులు ఉండడంతో యూత్ లో ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
లక్ష్మణ్ (సంజయ్ రావ్) సికింద్రాబాద్ పార్శీగుట్ట బస్తీలో ఉంటూ రోడ్ మీద కళ్లద్దాలు అమ్ముకుని బతుకుతూ ఉంటాడు. అందరూ ముద్దుగా లచ్చి అని పిలుచుకునే అతను అదే ఏరియాలో మౌనిక (ప్రణవి మానుకొండ)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. వయసు తిమ్మిరిలో నైట్ అవగానే ఆమెతో ఫోనులో కాస్త హద్దులు దాటి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో తల్లికి దొరికిపోవడంతో చివాట్లు పెడుతుంది. పార్క్ లో ఆమెతో రొమాన్స్ చేయబోయి పోలీసుల చేత దెబ్బలు తినాల్సి రావడంతో ఇక లాభం లేదు పెళ్లి చేసుకోవాలని భావించి పెళ్ళికి రెడీ అవుతాడు. అయితే నిశ్చితార్ధం రోజు ముహూర్తం పెట్టడానికి పుట్టిన తేదీ అడిగితే, ఇద్దరివీ తెలియక పోవడంతో జాతకాలు చూడటం కుదరదు కాబట్టి దోషం ఏదైనా ఉంటే పోవడానికి ముందు అబ్బాయికి ఒక చెట్టుతోనో లేక కుక్కతోనో పెళ్లి జరిపించండి అంటే, లచ్చికి బేబీ అనే కుక్కతో ధూమ్ ధామ్ గా పెళ్లి చేస్తారు. వారం తరువాత లచ్చి, మౌనికల పెళ్లి సమయంలో తాళి కట్టే క్షణం ముందు పోలీసులు వచ్చి లచ్చిని అరెస్టు చేస్తారు. అయితే అసలు లచ్చిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రాణంగా ప్రేమించిన లచ్చిని కాదని మౌనిక ఇంకొకరితో పెళ్ళికి ఎలా సిద్ధం అయింది? లచ్చి మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? లచ్చికి మౌనికకి వివాహం జరిగిందా? అనేదే సినిమా కథ.
విశ్లేషణ:
నిజానికి ఎక్కడో ఒకసారి ఏదో ఒక చోట కుక్కను పెళ్లి చేసుకున్న యువకుడు.. లేదా యువతి అనే వార్తలు చూస్తూనే ఉంటాము. అలాంటి వార్తను ఆధారంగా చేసుకుని దానికి బ్యాక్ గ్రౌండ్ లో ఒక కథను రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. పంతులు చెప్పాడు కదా అని వెనుకా ముందూ ఆలోచించకుండా ఓ కుక్కను పెళ్లి చేసుకున్నాక లచ్చి అనే పాత్రకు ఏర్పడిన ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే విషయాలు కామెడీ చేయిస్తున్నట్టు చూపిస్తూనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు తన ప్రాణం అనుకున్న వ్యక్తే మోసం చేస్తే, ప్రాణం అనుకున్న అమ్మాయే హ్యాండ్ ఇస్తే ఇంట్లో వారు సైతం సూటిపోటి మాటలతో వేధిస్తుంటే ఎలాంటి ప్రెజర్ ఫేస్ చేశాడు? అనేది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. కుక్కకు విశ్వాసం ఎక్కువ అనే లైన్ నే ఫోకస్ చేస్తూ ఒక్క పూట పిడికెడు అన్నం పెట్టినా ప్రాణాలకు తెగించి కాపాడుతుంది అనే విషయాన్ని చూపించారు. నిజానికి ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ కు కాదు కేవలం మాస్ ఆడియన్స్, యూత్ ను టార్గెట్ చేసి చేసిన సినిమాల ఉంటుంది. ఫ్యామిలీతో అస్సలే చూడలేని సినిమా ఇది. కుక్కతో పెళ్లి జరిగే వరకు కామెడీగా అనిపించినా కోర్డు రూమ్ సీన్స్ కొంత సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక బ్రహ్మాజీ, సప్తగిరి, యాదమ్మరాజు వంటి వారు ఉన్నా కామెడీ యాంగిల్ పూర్తిస్థాయిలో వర్కౌట్ చేయలేకపోయారు. స్పైసీ ఫోన్ సీన్లతో సమానంగా ఎమోషన్స్ కూడా క్యారీ అయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది.
ఎవరెలా చేశారంటే?
లచ్చి అలియాస్ లక్ష్మణ్‌గా సంజయ్ రావు సరిగ్గా సూట్ అయ్యాడు. కామెడీ సీన్స్ లోనే కాదు క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకునేలా నటించాడు. ఇక మౌనికగా ప్రణవి మానుకొండ గుర్తుండిపోయేలా నటించింది. సంజయ్ రావు తల్లి పాత్రలో నటించినామె నటన ఆకట్టుకుంది. యాదమ్మ రాజుకు మంచి రోల్ పడింది. బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి దర్శకుడు శ్రీధర్ ఈ సినిమాని మాస్ ప్రేక్షకులకు అలరించడానికి మాత్రమే తీసినట్టు అనిపించింది. మాటలు, సీన్స్, పాటలు, డాన్సులు అన్నీ కూడా మాస్ ప్రేక్షకులని టార్గెట్ చేసుకున్నట్టు అనిపిస్తాయి. ఈ కాన్సెప్ట్ ని పట్టుకొని ఇంకా కొంచెం కామెడీ జనరేట్ చేయొచ్చు కానీ, దర్శకుడు కామెడీతో పాటు బోల్డ్ నెస్, ఎమోషనల్ సీన్స్ కూడా ప్లాన్ చేసుకోవడంతో యూత్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ‘మౌనికా అంటూ సాగుతున్న పాట, ‘లచ్చి గాని పెళ్లి’ పాటలు బాగున్నాయి. భీమ్స్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే అనిపించాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల ఇప్పటి మాస్ జనానికి తగ్గట్టు పక్కా హైదరాబాదీ యాసలో పాటలు రాశారు.
ఫైనల్ గా:
స్లమ్ డాగ్ హస్బెండ్ యూత్ కి మాత్రమే.. మంచి మెసేజ్ తో కూడిన ఎంటర్టైనర్