సాయికుమార్ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆది సాయికుమార్, హీరోగా చాలా సినిమాలు చేశారు. అయితే చెప్పుకోదగ్గ హిట్స్ ఆయన ఖాతాలో తక్కువే. సుదీర్ఘకాలంగా సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఆయన, ‘శంబాల’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎందుకో తెలియదు కానీ, ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి సినిమాతో హిట్ కొడతానని ఆది నమ్మకంతో చెబుతూ వచ్చాడు. దానికి తోడు, ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది సినిమా యూనిట్. మరి సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
శంబాల కథ:
1980లో ఒక ఉల్క ‘శంబాల’ అనే ఊరిలో పడుతుంది. దాని మీద రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ (ఆది సాయికుమార్) ను ఆ ఊరికి పంపుతుంది. విక్రమ్ ఆ ఊరికి వచ్చే సమయానికి, ఊరంతా ఏకమై ఒక ఆవుని చంపడానికి సిద్ధమవుతారు. ఊరందరినీ వారించి ఆవుని కాపాడతాడు విక్రమ్. ఆ తరువాత ఆ ఊరిలో వరుస హత్యలు జరుగుతూ వస్తాయి. అసలు శంబాల అనే ఊరికి ఏమైంది? అసలు వరుస హత్యలు ఎందుకు జరుగుతాయి? ఉల్క కారణంగానే ఆ ఊరిలో ఈ హత్యలు జరిగాయా? చివరికి విక్రమ్ ఆ ఊరి వారందరినీ ఆ హత్యల బారి నుంచి ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
సైన్స్‌ను మాత్రమే నమ్మే హీరో, మూఢనమ్మకాలతో అభం శుభం తెలియని ఓ చిన్నారిని సైతం బలివ్వడానికి సిద్ధమయ్యే ఓ ఊరు. ఆ ఊరికి వెళ్ళిన హీరో, తాను నమ్మే సైన్స్‌తో వారికి ఓ గుణపాఠం నేర్పడానికి ప్రయత్నించి, చివరికి వారి నమ్మకాలే నిజమని నమ్మి, ఆ నమ్మకంతోనే వారిని ఎలా మార్చాడు అనే కథాంశంతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అదే కోవలో సాగుతూ వెళుతుంది. నిజానికి మిస్టిక్ త్రిల్లర్ అనే కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను, ఆద్యంతం ఆకట్టుకునేలా రూపొందించారు.
ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఆ ఊరికి వచ్చే విక్రమ్, ఆ ఊరికి వచ్చిన సమస్యను తన భుజాల మీద వేసుకుని ఎలా క్లియర్ చేశాడు అనే లైన్‌తో రూపొందించారు. ఫస్టాఫ్ మొత్తం సమస్యను చూపించే విషయంలో దర్శకుడు శ్రద్ధ పెట్టారు. నిజానికి ఫస్టాఫ్ అంతా రవివర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలతో ఒక రేంజ్‌లో భయపెట్టారు. ఇక ఇంటర్వెల్ ముందు సెకండాఫ్ మీద ఆసక్తి పెంచేస్తూ కట్ చేసుకున్నారు.
సెకండాఫ్ మొదలయ్యాక ఒక్కొక్క విషయాన్ని రివీల్ చేస్తూ వెళ్లిన విధానం బాగుంది. నిజానికి ‘మిస్టికల్ థ్రిల్లర్’ అనే పదానికి పూర్తి న్యాయం చేసేలా సినిమా సాగింది అనే చెప్పాలి. ఆ ఊరిలో పడ్డ ఉల్క కారణంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, అసలు ఆ సమస్యలకు కారణం ఏమిటి, వాటిని హీరో కనుగొన్న విధానం.. ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో దర్శకుడు సఫలమయ్యాడు. లాజిక్స్‌కి దూరంగా ఉన్నా సరే, ఒకరకంగా పురాణ అంశాలతో ముడి పెడుతూ దాన్ని లాజికల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. పురాణాల నుంచి మొదలుపెట్టి 1980 వరకు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా కథ రాసుకున్నాడు. అక్కడక్కడ లాగ్ (Lag) చేసిన ఫీలింగ్ కలిగినా, పూర్తిస్థాయిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి చాలావరకు సక్సెస్ అయ్యాడు.
నటీనటులు & సాంకేతిక వర్గం:
నటీనటుల విషయానికి వస్తే, ఆది సాయికుమార్ ‘విక్రమ్’ అనే పాత్రలో ఒదిగిపోయాడు. చాలా కాలం తర్వాత అతనికి యాక్షన్ సీన్స్‌తో పాటు నటించే స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఇక ఆది తర్వాత ఆ స్థాయిలో నటించే పాత్ర రవివర్మతో పాటు మీసాల లక్ష్మణ్‌కు దొరికింది; వారిద్దరూ తమ తమ పాత్రలలో అదరగొట్టారు. అలాగే చిన్నారి పాత్రలో నటించిన పాప కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. అర్చన అయ్యర్, శ్వాసిక, విజయ్ సహా సినిమాలో నటించిన ప్రతి పాత్రదారుడు తమ పాత్రకు న్యాయం చేశారు.
ఇక ఈ సినిమాకి సాంకేతిక విభాగం చాలా కీలకమనే చెప్పాలి. పాటలు పరవాలేదు కానీ, నేపథ్య సంగీతం మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమాలకు అదే కీలకం; ఆ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రాఫర్ తనదైన విజువల్స్‌తో ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళగలిగాడు. దర్శకుడి రచనలో అక్కడక్కడ చిన్నచిన్న లోటుపాట్లు కనిపించినా, మేకింగ్ మాత్రం వాటిని కప్పిపుచ్చేలా అనిపించింది. నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి.
ఫైనల్‌గా ఈ శంబాల.. ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్!