NTV Telugu Site icon

Dunki Review: షారుఖాన్ ‘డంకీ’ రివ్యూ!

Dunki Review

Dunki Review

చేసింది తక్కువ సినిమాలైనా ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ఆలోచింపజేసే సినిమాలు చేస్తాడని పేరున్న ఆయన షారుఖాన్ తో డంకీ అనే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు షారుక్ ఖాన్ గత సినిమాలు పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులలో భారీగా ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు దక్షిణాదిన రిలీజ్ అవుతున్న సలార్ సినిమాకి ఒకరోజు ముందు రిలీజ్ అవడంతో ప్రేక్షకులలో ఈ సినిమా ఎలా ఉంటుందని ఆసక్తి ఏర్పడింది. స్వయంగా రాజ్ కుమార్ ఇరానీ షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.

డంకీ కథ ఏమిటంటే?
ఒకానొక సమయంలో తుపాకీ కాల్పులలో గాయపడిన సైనికుడు హృదయ పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హార్డీ( షారుఖ్ ఖాన్) తనను కాపాడిన వ్యక్తిని వెదుకుతూ అతని ఇంటికి వెళతాడు. అయితే అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడని అతని సోదరి మను రంధ్వా (తాప్సీ పన్ను) ద్వారా తెలుసుకుంటాడు. తనకోసం చాలా సమయం వెచ్చించిన వ్యక్తి కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని వారి ఇబ్బందులు తీర్చే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా ఇంగ్లాండ్ వెళ్ళడానికి యత్నిస్తున్న మనుకి రెజ్లింగ్లో ట్రైనింగ్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత హార్డీ మనుతో ప్రేమలో పడడమే కాదు ఆమెతోపాటు ఇంగ్లాండ్ కూడా వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. లీగల్ గా వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేసి అవి సఫలం కాకపోవడంతో ఇల్లీగల్ గా డంకీ అంటే గాడిదల రూట్ లో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ నేపథ్యంలో మరికొంత మందితో బయలుదేరి ఇంగ్లాండ్ అనేక వ్యయ ప్రయాసలకోర్చి తీసుకు వెళతాడు. అయితే అంత కష్టపడి ఇంగ్లాండ్ తీసుకు వెళ్లిన తర్వాత హార్డీ ఇండియా వచ్చేయాలని, అక్కడే ఉండాలని మను నిర్ణయం తీసుకుంటారు. అలా పాతికేళ్లు ఒకరికి ఒకరు కాంటాక్ట్ కూడా లేకుండా గడిచిపోయిన నేపద్యంలో ఇంగ్లాండ్ సిటిజెన్షిప్ వచ్చిన తర్వాత మను భారత్ రావాలనుకుంటుంది. కానీ అందుకు ఇండియన్ ఎంబసీ ఒప్పుకోదు. మరి ఆమె ఇండియా తిరిగి వచ్చేందుకు ఏం చేసింది? ఆమెను ఇండియా తీసుకొచ్చేందుకు హార్డీ ప్రయత్నాలు చేశాడా? చివరికి ఆమె ఇండియా తిరిగి వచ్చిందా లేదా? ఇంగ్లండ్ సిటిజన్షిప్ వచ్చిన ఏడాదికే ఆమె ఇండియా తిరిగి రావాలని ఎందుకు అనుకుంది? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సాధారణంగా రాజ్ కుమార్ హిరానీ సినిమాలు అంటేనే ఒక సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు అని అందరూ భావిస్తూ ఉంటారు. ఆయన మొదటి సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్ కానీ, తర్వాత చేసిన పీకే కానీ బ్లాక్ బస్టర్ హిట్లవడమే కాదు కొన్ని ఎవరూ ప్రశ్నించని విషయాలను కూడా సూటిగా ప్రశ్నించాయి. ఆ తర్వాత సంజయ్ దత్ బయోపిక్ గా చేసిన సంజు సినిమా కూడా బాగానే ఆడింది. ఈ నేపథ్యంలో రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన డంకీ సినిమా ఎలా ఉంటుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే డంకీ సినిమా మరో సరికొత్త సమస్యతో ప్రేక్షకులను పలకరించింది. మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం ఫలానా దేశపు బోర్డర్లో అక్రమ వలసదారులు కాల్చివేయబడ్డారు లేదా పట్టుబడి జైలుకు వెళ్లారు అని. ఇలా అక్రమ వలసదారులు అనే కాన్సెప్ట్ తీసుకుని వారు ఎమోషన్స్ తో ప్రేక్షకులను టచ్ చేసే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్ హిరానీ. పుట్టిన దేశంలో బతుకు దుర్భరమై ఇక ఇక్కడ బతకలేము మెరుగైన బతుకు కావాలంటే చిన్న పనికి కూడా గట్టిగా డబ్బు సంపాదించగలిగే దేశానికి వెళ్లాలని అనేక ఆఫ్రికా దేశాల వారితో పాటు మన భారతీయుల సైతం భావిస్తూ ఉంటారు. అలాంటి వారి కష్టాలు ప్రతిబింబించేలా ఈ సినిమా డైరెక్ట్ చేశాడు రాజ్ కుమార్ హిరానీ.. మొదటి భాగమంతా పాత్రల పరిచయానికే తీసుకున్న దర్శకుడు ఇంటర్వెల్ కి ముందు డంకీ అసలు కథ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చాడు. డంకీ అంటే గాడిదల రూట్. అసలు ఎలాంటి లీగల్ పేపర్లు లేకుండా హీరో హీరోయిన్ సహా కొందరు వ్యక్తులు భారతదేశంలోని పంజాబ్ నుంచి లండన్ వెళ్లే ప్రయాణమే ఈ డంకీ సినిమా.. మొదటి భాగం అంతా ఏదో సాగతీస్తున్నట్టు, ఇంకా అసలు కథ మొదలవడం లేదు ఎంటి అని అనుమానం కలిగించేలా ఉంటుంది.. ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలవుతుందో అప్పుడు సినిమా మీద ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది. పంజాబ్ లో బయలుదేరిన బృందం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్ మీదుగా లండన్ చేరుకోవడం, అక్కడికి వెళ్ళాక అడుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడడం అది చూసి ఈ హీరోకి విరక్తి కలగడం లాంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంగ్లండ్ దేశంలో బతకడానికి సొంత దేశంలో తమకు రక్షణ లేదని చెప్పలేను అని హీరో పలికిన డైలాగ్ తో రాజ్ కుమార్ హిరానీ థియేటర్ అంతా చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. అయితే అక్కడ ఉండలేక, ఇండియా వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించక అక్కడే ఉండిపోయిన వారి కష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపించడంలో ఈ సినిమా సఫలం అయింది. అయితే ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీ యాంగిల్ లో, లైటర్ వేలో సాగిన సినిమా సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా సాగింది.. గత రాజ్ కుమార్ హి mరానీ సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవడం కష్టమే కానీ. ఇది చాలా మంది అక్రమంగా లేదా సక్రమంగా విదేశాలకు వెళ్లి కష్టపడుతున్న వారికి, వారి కుటుంబాల వారికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.

నటీనటుల విషయానికి వస్తే కనుక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఎప్పటిలాగే తన గ్రాస్ తో చుట్టూ ఉన్న అందరిని డామినేట్ చేశాడు. యుద్ధంలో గాయమై వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న జవాన్ గా తొలుత ప్రేక్షకులకు పరిచయమై ఆ తరువాత మను అనే అమ్మాయిని ప్రేమించే వ్యక్తిగా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. మిగతా పాత్రధారులు ఉన్నా సరే వన్ మ్యాన్ షో లాగా సినిమా మొత్తాన్ని భుజస్కందాల మీద వేసుకుని నడిపించాడు. మను అనే పాత్రలో తాప్సీ పన్ను ఒదిగిపోయి నటించింది. ఉన్నంతలో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. అయితే తాప్సి స్థానంలో బాలీవుడ్ లో వేరే ఎవరైనా స్టార్ హీరోయిన్ ని తీసుకుని ఉంటే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉండేదేమో.. ఇంగ్లీష్ టీచర్ గా గీతు అనే పాత్రలో నటించిన బోమన్ ఇరానీ కూడా పూర్తిస్థాయిలో తన పాత్ర న్యాయం చేశాడు.. ఇక మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమా దర్శకుడిగా రాజ్ కుమార్ హిరానీ తన ప్రతిభను మరోసారి చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే విషయం అనుమానమే. అయితే క్రాఫ్ట్ పరంగా ఎప్పటిలాగే తనదైన మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే అది పూర్తిస్థాయిలో సఫలం కాలేదనిపిస్తుంది.. ఎడిటింగ్ కూడా ఆయనే చేయడంతో కాస్త క్రిస్పీగానే కట్ చేసుకున్నట్లుగా అనిపించింది. ఇక సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, పంజాబ్ అందాలతో పాటు ఇంగ్లాండ్లోని దుర్భర పరిస్థితులను క్యాచ్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఫైనల్లీ : డైరక్టర్ మీద, షారుఖ్ మీద.. ఎలాంటి “అంచనాలు” లేకుండా థియేటర్ కి వెళ్తే డంకీ నచ్చచ్చు.