NTV Telugu Site icon

Krishnamma Review: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ రివ్యూ!

Krishnamma Movie

Krishnamma Movie

నటీనటులు : సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, రఘు కుంచె
డైరెక్టర్: గోపాలకృష్ణ
నిర్మాత: కొమ్మలపాటి కృష్ణ
మ్యూజిక్: కాలభైరవ

సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం కృష్ణమ్మ. స్టార్ డైరక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి ఈ సినిమాని నిర్మించారు. పూర్తిస్థాయి రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేసింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా మే 10వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మరి సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే:
విజయవాడకు చెందిన వించిపేటలో భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజా రెడ్డి) కలిసి జీవిస్తూ ఉంటారు. వీరు ముగ్గురు అనాధలు ఎవరికి పుట్టారో ఎప్పుడు పుట్టారో తెలియదు కానీ ముగ్గురు ఒకరికొకరు అన్నట్లు బతుకుతూ ఉంటారు. అయితే చిన్నప్పుడే జైలుకు వెళ్లిన శివ ఈ నేరాలు చేయడం మంచిది కాదని ఆ జైల్లోనే ప్రింటింగ్ మీద అవగాహన పెంచుకుని బయటకు వచ్చాక ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. అయితే బయటే ఉన్న భద్ర కోటి మాత్రం నేరాలు చేస్తూనే పొట్ట పోసుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో శివ మీనా (అతిర)తో ప్రేమలో పడతాడు. మరోపక్క భద్ర పద్మ (అర్చన అయ్యర్) తో ప్రేమలో పడతాడు. మీనా రాకతో భద్ర కూడా నేరాలు మానేసి ఆటో తోలుకుంటూ బతుకుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా వీరికి మూడు లక్షలు అవసరం పడుతాయి. చివరిసారిగా ఒక నేరం చేసి అవసరం తీర్చుకుని బయటపడాలని అనుకుంటారు. అయితే అనూహ్యంగా ఈ ముగ్గురు అనుకోకుండా చిక్కుల్లో పడతారు. అసలు చివరి నేరం చేసేందుకు వెళ్లిన ఈ ముగ్గురు ఎలా చిక్కుల్లో పడ్డారు? వీరిలో ఒకరు ఎందుకు చనిపోయారు? చివరికి మిగిలిన ఇద్దరూ ఏం చేశారు? వీరిలో ఒకరు చనిపోవడానికి ఎవరు కారణమయ్యారు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
తెలుగులో రివెంజ్ డ్రామా సినిమాలు కొత్త ఏమీ కాదు. ఈ సినిమా కూడా దాదాపుగా ఒక రివెంజ్ డ్రామా గానే చెప్పాలి. సినిమా మొదలుపెట్టినప్పుడే ఒక దారుణమైన ఫైట్ తో ప్రారంభమవుతుంది. సినిమా మొదట్లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకు వెళ్లిన విధానం బాగుంటుంది. కథగా చెప్పాలంటే ఇది కొత్త కథ ఏమాత్రం కాదు. గతంలో మనం ఎన్నో సినిమాలలో చూసిన కథని మరోసారి తమధైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ.. పైకి కొట్టుకుంటున్నట్టు కనిపించినా ఒకరి మాట ఒకరు జవదాటకుండా ఉండే స్వభావం. అలాంటి వారిలో ఒకరు దూరమైతే, మిగతా ఇద్దరు ఏం చేశారు? అనాధలుగా పుట్టి కేవలం ఒక కుటుంబంతో సంతోషంగా గడిపితే చాలు అనుకుంటున్న ముగ్గురు జీవితాల్లో జరిగిన అల్లకల్లోలం ఏమిటి? లాంటి విషయాలను చాలా ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయంలో పూర్తిస్థాయిలో సఫలం కాలేకపోయారు. అయితే అసలు అంత పగ పెంచుకోవడానికి గల కారణం ఏమిటి? అనే విషయాన్ని తనదైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక దారుణమైన హత్య, ఆ తర్వాత సత్యదేవ్ అతని స్నేహితుల పాత్రలను పరిచయం చేయడంతోనే సరిపోతుంది. కాస్త ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ వాళ్ళ క్యారెక్టర్జన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమాత్రం స్క్రీన్ స్పేస్ అవసరమే. ఇక సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం, వాళ్ళని అంతమోందించడం లాంటి విషయాలను ఆసక్తికరంగా చూపించారు. ఇక క్లైమాక్స్ మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే సినిమా వేరే లెవల్లో ఉండనిపించేది. అయితే ఉన్నంతలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలావరకు సఫలమైనట్లే కనిపించింది. చిన్న చిన్న లోపాలు పక్కన పెట్టి చూస్తే కృష్ణమ్మ ఆకట్టుకునే ఉంది.

నటీనటుల విషయానికి వస్తే:
సత్యదేవ్ తనకి బాగా ఈజ్ అనిపించే పాత్రలో మరోసారి కనిపించాడు. నిజానికి గతంలో కూడా ఒకటి రెండు సినిమాల్లో సత్యదేవ్ ఇలాంటి పాత్రలలో కనిపించాడు. ఈ సినిమాలో పగతో రగిలిపోయే ఒక అనాధ పాత్రలో పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఎమోషనల్ సీన్స్లో సత్యదేవ్ నటన ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటుంది. అతిర పాత్ర పరిమితమే అయినా ఉన్నంతలో తన మార్క్ వేసుకునే ప్రయత్నం చేసింది. మీసాల లక్ష్మణ్ తో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన నందగోపాల్ ఇద్దరికీ మంచి పాత్రలు పడ్డాయి. అయితే నందగోపాల్ నటన ప్రకాష్ ని గుర్తుకు తీసుకురావడం కాస్త మైనస్. శివ పాత్ర పోషించిన నటుడితో పాటు రఘు కుంచే అలాగే మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక దర్శకుడు గోపాలకృష్ణ తన మొదటి సినిమాతోనే మాస్ మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. సినిమాటోగ్రఫీ సినిమా సాయికి తగ్గట్టు ప్లెజెంట్ వాతావరణం తీసుకొచ్చేలా ఉంది. ఇక ఈ సినిమాకి కాలభైరవ అందించిన మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు గుర్తుపెట్టుకో తగ్గట్టు లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడుని క్యారీ చేసేలా సెట్ అయింది. ఇక ఎడిటింగ్ కూడా క్రిస్పీ గానే ఉండేలా చూసుకున్నారు మేకర్స్. నిర్మాతకి ఇది మొదటి సినిమానైనా నిర్మాణ విలువలు మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి.

ఫైనల్లీ:
ఈ కృష్ణమ్మ మూవీ రివెంజ్ డ్రామా విత్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. అంచనాలు లేకుండా వెళ్తే ఎంజాయ్ చేస్తారు.

 

Show comments