NTV Telugu Site icon

Kalki 2898 AD Review: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ రివ్యూ!

Kalki 2898 Ad Review

Kalki 2898 Ad Review

Prabhas’s Kalki 2898 AD Review: ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రేమికులందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడి అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. టీజర్, ట్రైలర్ తో సినిమా మీద విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో సినిమాకి ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. మరి ప్రేక్షకులలో ఏర్పడిన ఈ క్రేజ్ ఎంతవరకు నిజమైంది ? ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

కల్కి 2898 ఏడి కథ:
సినిమా కథ అంతా కల్కి 2898 ఏడిలో జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చిట్టచివరి నగరంగా నిలుస్తుంది కాశీ. ఈ క్రమంలో అన్ని వనరులను యాస్కిన్ (కమల్ హాసన్) బంధించి కాంప్లెక్స్ అనే ఒక స్పెషల్ ప్రాంతాన్ని అదే కాశీ పక్కనే సృష్టించుకుని దానికి తానే అన్నీ అయి నడిపిస్తూ అంటాడు. మరోపక్క శంభాల అనే ప్రాంతంలో ఒకప్పటి ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల వారు కాంప్లెక్స్ కు తెలియకుండా బతుకుతూ కాంప్లెక్స్ ఇలా వనరులను బంధించడం కరెక్ట్ కాదని వారి మీద పోరాడుతూ ఉంటారు. కాశీలో ఉండే వాళ్లు కాంప్లెక్స్ లోకి రావాలంటే వన్ మిలియన్ యూనిట్స్ కట్టాలని ఒక రూల్ ఉంటుంది. దీంతో భైరవ (ప్రభాస్) వన్ మిలియన్ యూనిట్స్ సంపాదించి లోపలికి ప్రవేశించాలని బౌంటీ హంటర్ గా పనిచేస్తూ ఉంటాడు. చిన్నచిన్న బౌంటీలు కొడుతూ ఉండే అతనికి అనుకోకుండా ఒక పెద్ద బౌంటీ వస్తుంది. కాంప్లెక్స్ నుంచి తప్పించుకున్న సుమైటీ(దీపికా)ను పట్టుకుంటే ఫైవ్ మిలియన్ యూనిట్స్ వస్తాయని తెలుసుకొని ఆమె వెంట పడతాడు. అయితే ఆమెను అశ్వద్ధామ ( అమితాబ్ బచ్చన్) కాపాడుతూ ఉంటాడు. మరణమే లేని అశ్వద్ధామ శ్రీకృష్ణుడి శాపంతో ఎందుకు 6000 సంవత్సరాలు నిద్రావస్థలో ఉండిపోయాడు? ఎందుకు సుమైటీనీ కాపాడడానికి సిద్ధమవుతాడు? ఆమె కోసం శంభాల మొత్తం ఎందుకు ఎదురు చూస్తోంది? చివరికి భైరవ ఆమెను ఏం చేశాడు? భైరవను అశ్వద్ధామ అడ్డుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా మొత్తం బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి అనే సినిమా మొదలైందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. దానికి తోడు మహాభారతానికి సంబంధించి లింకు కూడా ఉందని ప్రమోషన్స్ చేయడంతో సినిమా మీద ఆసక్తి అంతకంతకు పెరుగుతూ వెళ్ళింది. సినిమా ప్రారంభమే మహాభారత ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. అశ్వద్ధామకు శ్రీకృష్ణునికి ఈ మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ఈ సినిమా మొదట్లోనే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అయితే ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఎప్పుడైతే కాశీ వీధుల్లో కథ మొదలవుతుందో అప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మొదలవుతుంది. నిజానికి ఫస్ట్ ఆఫ్ అంతా క్యారెక్టర్ లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడంతో కథను బాగా సాగ తీసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఒక్కసారిగా పుంజుకుంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత మొదలైన కథ ఎవరూ ఊహకు అందని విధంగా పరుగులు పెడుతూ నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభను చాటుతుంది. మహాభారతంలోని కొన్ని క్యారెక్టర్ లను సుమారు ఇప్పటినుంచి ఒక ఆరేడు వందల సంవత్సరాల తర్వాత అంటే 2898లో జరిగే ఊహాజనిత కథతో తెరకెక్కించిన తీరు చాలా ఆసక్తికరం అని చెప్పాలి. అయితే దానితో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధానంతోనే ఈ సినిమా పూర్తి ఫలితం ఆధారపడి ఉంటుంది అని కూడా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి ఈ సినిమా కథ ఏమిటి అనే విషయాన్ని ముందు నుంచే నాగ్ అశ్విన్ ప్రేక్షకులలో రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేస్తూ వచ్చాడు. అయితే సినిమా మొదలైన తర్వాత నాగ్ అశ్విన్ వీడియోలన్నీ ఒక్కసారిగా స్ఫురణకు వస్తాయి. నిజానికి అశ్వద్ధామ చిరంజీవి అని అందరికీ తెలుసు. అలాంటి ఆయన బతికి ఉంటే దానికి ఒక కారణం ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదాన్ని నాగ్ అశ్విన్ రాసుకున్న తీరు ప్రేక్షకులకు అబ్బురపరిచే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాంటి ఆలోచన రావడమే కాదు దాన్ని ఒక దృశ్యరూపకంగా తీసుకు రావడం అభినందనీయం. విజువల్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు మేకర్స్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫైట్స్ అయితే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

నటీనటుల ప్రదర్శన:
ముఖ్యంగా ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గురించి ప్రధానంగా మాట్లాడాలి. ప్రభాస్ క్యారెక్టర్ భైరవ ఎంత ఆసక్తికరంగా ఉందో సెకండ్ హాఫ్ లో వచ్చే మరొక భిన్నమైన పార్శ్యం అంతే ఆసక్తికరంగా ఉంది. ఇక ఇలాంటి పాత్రను చేయడం కమల్హాసన్ కెరియర్లో మరొక కీలక ఘట్టం అని చెప్పొచ్చు. అమితాబ్ బచ్చన్ పాత్ర ఆయన కటౌట్ కి సరిపోయింది. అమితా ప్రభాస్ మధ్య వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ చూసి అబ్బురపడాల్సిందే. దిశాపటాని కేవలం చిన్న పాత్రకు మాత్రమే పరిమితమైంది. దీపికా పదుకొనే కి నటించే స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్, ఆర్జీవీ, రాజమౌళి వంటి వాళ్ళు ఒక్కొక్క సీన్ లో వచ్చి మెరిసి వెళ్లారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమా మొత్తానికి ప్రాణం విజువల్స్. ఎక్కడా మనం ఏదో తెలుగు సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం అనేలా గ్రాండ్గా విజువల్స్ తో మాయ చేయడంలో ఆ టీం సఫలం అయింది. సంగీతం విషయానికి వస్తే కొన్ని పాటలు బాగానే ఉన్నా కొన్ని అంత ఆకట్టుకునేలా లేవు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టు బాగా సెట్ అయింది అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో పేరు తీసుకుని ఉండొచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రం అత్యద్భుతంగా కుదిరింది. కొన్ని ఫైట్ సీన్స్ లో కెమెరా పనితనం కనపడింది. అయితే నిడివి విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ ఆఫ్ బోర్ కొట్టించకున్న మిడిల్ తగ్గించి కథ నడిపించవచ్చు కానీ ఎందుకో దర్శకుడు నిడివి విషయంలో వెనక్కి తగ్గలేదు. కొన్ని డైలాగులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

ఫైనల్లీ:
కల్కి 2898 ఏడి మైథాలజీ మిక్స్ చేసిన సైఫై మూవీ.. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళి తీసుకొస్తుంది.