NTV Telugu Site icon

Ponniyin Selvan Part 2 Review: పొన్నియిన్ సెల్వన్ -2 (డబ్బింగ్)

Ps 2

Ps 2

Ponniyin Selvan Part 2 Review: తెలుగునాట అంతగా ఆకట్టుకోని ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం, తమిళంలో జనాదరణ పొందింది. ఈ నేపథ్యంలో మణిరత్నం ఆ సినిమాకు సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్’ రెండవభాగాన్ని రూపొందించారు. మొదటి భాగంలో కేవలం పాత్రల పరిచయమే జరిగిందని, అసలు కథ ఈ రెండో భాగంలో ఉందని మణిరత్నం ప్రచార పర్వంలో చెప్పారు. మణి సినిమాలను అభిమానించేవారు ఈ రెండో భాగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 2- ఏప్రిల్ 28న శుక్రవారం జనం ముందు నిలచింది.

ఈ రెండో భాగంలో కథ ఏమిటంటే – మొదటి భాగం ఎక్కడ ముగుస్తుందో అక్కడి నుండే కథ మొదలవుతుంది. మొదటి భాగంలో లీలగా కనిపించిన ఆదిత్య కరికాలన్, నందిని ప్రేమకథ ఇందులో విపులంగా చూపించారు. నందిని తల్లి మందాకిని ఎందుకు పొన్నియిన్ సెల్వన్ ను రక్షించింది అన్న అనుమానం సుందర రాజన్ కూతురు, పొన్నియిన్ అక్కకు కలుగుతుంది. అదే విషయాన్ని తండ్రిని అడుగుతుంది. తన తండ్రి సుందరరాజన్, మందాకినికి మధ్య ఏదో ఉందని అందువల్లే నందిని, ఆదిత్య ప్రేమను ఆయన అంగీకరించలేదని భావిస్తుంది. చివరకు అత్త ద్వారా అదేమీ నిజం కాదని తెలుసుకుంటుంది. ఇక ఈ భాగంలో నందిని, తనను ప్రేమించిన ఆదిత్యను చంపడానికి పథకం వేస్తుంది. అది తెలిసే ఆదిత్య ఆమె దగ్గరకు వెళతాడు. ఆమె ప్రియుణ్ని చంపలేకపోతుంది. ఆమెచేతికి కత్తిఇచ్చి తానే పొడుచుకుంటాడు ఆదిత్య. ఆమె కూడా తరువాత కన్నుమూస్తుంది. అన్న చనిపోయిన తరువాత పొన్నియిన్ సెల్వన్ శత్రువులను ఏరిపారేయడం, అతనికి పట్టాభిషేకం జరగడంతో ఈ కథ ముగుస్తుంది.

టైటిల్ ‘పొన్నియిన్ సెల్వన్’ అయినా, మొదటి భాగంలోలాగే ఈ రెండో భాగంలోనూ అతని చుట్టూ ఉన్న పాత్రలపైనే కథ సాగుతుంది. తరువాతి కాలంలో రాజరాజ చోళునిగా ప్రసిద్ధి చెందిన పొన్నియిన్ సెల్వన్ గురించి, ఈ భాగంలోనూ పూర్తిగా వివరించక పోవడం నిరాశ కలిగిస్తుంది. అసంపూర్ణం అనే అనిపిస్తుంది. మణిరత్నం మరో భాగం రూపొందించే యోచనలో అయితే లేరు. తరువాత రాజరాజచోళుని కథ చూడాలనుకుంటే, 1973లో రూపొందిన శివాజీగణేశన్ ‘రాజరాజచోళన్’ చూడాల్సిందే.

నిజం చెప్పాలంటే మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ ఈ సినిమాకు తెలుగునాట లేదు. పైగా ఇంతకు ముందు అలరించిన రీతిలోనూ ఈ రెండో భాగంలోని పాటలు అంతగా ఆకట్టుకోలేదు. మొదటి భాగంలో ఎవరికి వారు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేసినా, కార్తి, త్రిష మార్కులు కొట్టేశారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్ నటన పైచేయిగా సాగింది. తన పాత్రకు విక్రమ్ అన్నివిధాలా న్యాయం చేశారనే చెప్పాలి. ఐశ్వర్యారాయ్ రెండు పాత్రల్లో తనదైన బాణీ పలికించారు. రహమాన్ బాణీలు కథకు తగ్గ సొబగును తెచ్చాయి కానీ, పాటల్లో ఎందుకనో అంతగా అలరించలేకపోయాయి. రవి వర్మన్ సినిమాటోగ్రఫి కనువిందు చేస్తుంది. ‘కల్కి’ నవలను తెరకెక్కించడమే ఓ సాహసం. గతంలో ఎమ్జీఆర్, కమల్ హాసన్ వంటివారు ప్రయత్నించి విరమించారు. కానీ, మణిరత్నం తనదైన పంథాలో ఆ నవలను జనం ముందు నిలిపారు. మొదటి భాగం తమిళనాట మంచి ఆదరణ పొందింది. ఈ రెండో భాగం అక్కడ ఎలా ఉన్నా, తెలుగునాట అంతగా మురిపిస్తుందని చెప్పలేం.

ప్లస్ పాయింట్స్:
మణిరత్నం సినిమాకావడం
నటీనటుల అభినయం
రవివర్మన్ సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్:
తెలుగువారికి అంతగా పరిచయం లేని కథ
అలరించని పాటలు
కథ అర్ధాంతరంగా ముగిసిన భావన

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్ : అసంపూర్ణ ‘పొన్నియిన్ సెల్వన్’!