NTV Telugu Site icon

O2 Movie Review : ఓ2 (తమిళ డబ్బింగ్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్)

New Project (14)

New Project (14)

 

స్టార్ హీరోయిన్ నయనతార పెళైన తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘ఓ2’ (ఆక్సిజన్). లేడీ సూపర్ స్టార్ గా సౌతిండియాలో గుర్తింపు తెచ్చుకున్న నయన్ నటించిన ఈ మూవీ ఎలాంటి ప్రచార ఆర్బాటం లేకుండా శుక్రవారం నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జి.ఎస్. విఘ్నేష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ దీనిని ప్రొడ్యూస్ చేసింది.

మనం నీటికి ఇచ్చే ప్రాధాన్యం ప్రాణవాయువైన ఆక్సిజన్ కు ఇవ్వం. నీటి ఎద్దడిని ఏదో సమయంలో ఫేస్ చేసి ఉంటాం కాబట్టి దాని అవసరం మనకు కొద్దొగొప్పో తెలుసు. కానీ ఆక్సిజన్ అందకపోవడం అనే అనుభవం చాలా రేర్. (కరోనా సమయంలో కొంతమందికి దాని విలువ తెలిసింది) అదే పరిస్థితి వస్తే… మనిషిలోని మృగం ఎలా బయటకు లేస్తాడు అని చెప్పే ప్రయత్నం ఈ సినిమా ద్వారా దర్శకుడు జి. ఎస్. విఘ్నేష్ చేశాడు.

పార్వతి (నయనతార) సింగల్ ఉమన్. బాబు వీర (రిత్విక్) పుట్టిన తర్వాత భర్త అనారోగ్యంతో చనిపోతాడు. తండ్రిలానే వీరకు పుట్టికతో ఓ ఇబ్బంది ఉంటుంది. ఎనిమిదేళ్ళ వీర ఊపిరి తిత్తుల సమస్య కారణంగా తనంతట తాను గాలి పీల్చుకోలేడు. ఆక్సిజన్ ను సిలిండర్ ద్వారా అతనికి అందించాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిసి, చిత్తూరు నుండి తన తమ్ముడు ఉండే కొచ్చికి బయలుదేరుతుంది పార్వతి. ఆమె బయలుదేరిన బస్ లోనే అవినీతి పరుడైన ఓ పోలీస్‌ ఆఫీసర్, మాజీ ఎమ్మెల్యే, పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో అదను చూసి లేచిపోదామనుకునే ఓ ప్రేమ జంట, జీవిత ఖైదీ అనుభవించి జైలు ఉండి బయటకు వచ్చిన ఓ పెద్దాయన ఉంటారు. ప్రతికూల వాతావరణం కారణంగా భారీ వర్షాలు పడి, కొచ్చికి వెళ్ళే మార్గంలోని కొండచరియలు విరిగిపడిపోతాయి. అంతేకాదు… ఓ పెద్ద కొండ కూలిపోవడంతో బస్సు మట్టిలో కూరుకుపోతుంది. బస్సులోని పది మంది ప్రయాణీకులు, డ్రైవర్ ప్రాణభయంతో అల్లాడుతుంటారు. బస్సులో ఉన్న ఆక్సిజన్ కేవలం పది గంటల వరకూ మాత్రమే సరిపోతుందని పార్వతి వాళ్ళకు చెబుతుంది. అదే సమస్య అవుతుంది. దాంతో అందరి దృష్టి వీర దగ్గరున్న ఆక్సిజన్ సిలిండర్ మీద పడుతుంది. తాము ఆపదలో ఉన్నామనే విషయం తెలిసినప్పుడు మనిషి ఆలోచనలు ఎలా మారిపోతాయి? మానవత్వాన్ని మరిచి మనిషి ఎలా పశువుగా మారిపోతాడనే అంశాన్ని ద్వితీయార్థంలో చూపించారు. అలాంటి మానవ మృగాల నుండి తన కొడుకును పార్వతి ఎలా రక్షించుకుందన్నదే క్లయిమాక్స్.

ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ కు స్క్రీన్ ప్లే ప్రాణం. ఎందుకంటే కథంతా ఒకే చోటే సాగుతుంది. భిన్నమైన వ్యక్తులు, వారి మనస్తత్త్వాలను ఆసక్తికరంగా తెలియ చేయడంతో పాటు ప్రేక్షకులను ఆ పాత్రలతో ఐడెంటిఫై చేసుకునేలా చేయడం కత్తిమీద సాము. అయితే ఈ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. భిన్న వ్యక్తిత్వాలు ఉన్న వారిని ఒకచోట చేర్చినా కష్టకాలంలో వారిలోని మరోకోణం బయటపడుతూ ఉండటంతో ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ తనని తాను ఐడెంటిఫై చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. బస్ లో ఏర్పడిన ఆక్సిజన్ కొరత, దాని పరిష్కారం కోసం ఏదో ఒక స్థాయిలో వారు ప్రయత్నాలు చేయడం అనేది ఆసక్తికరంగా సాగినా, బయట నుండి వారిని రక్షించడానికి తీసుకున్న చర్యలను దర్శకుడు అంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు. వాళ్ళను రక్షించడం మీదకంటే సర్వైవల్ సమస్య వచ్చినప్పుడు మనిషి ఎలా మారిపోతాడు అనేదాని మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అది అంతగా రక్తి కట్టలేదు. ఒక పాయింట్ కు కథ చేరేసరికీ చూసే వారికి ఆసక్తి సన్నగిల్లిపోతుంది. దానికి తోడు బస్ లోని వారు స్పృహతప్పి పడిపోయిన తర్వాత వాళ్ళు సేవ్ అయ్యే సన్నివేశం కూడా చాలా డ్రమటిక్ గా ఉంది. సినిమా ప్రారంభంలో టైటిల్స్ నుండే పారిశ్రామికీకరణ పెరిగిపోతున్న ఈ సమయంలో మొక్కల పెంపకం, వాటి ద్వారా ఆక్సిజన్ ను జనరేట్ చేసుకోవడం, మొక్కలకు ఉండే ప్రత్యేక లక్షణాలను ఆసక్తికరంగానే చూపారు. కానీ ఆ తర్వాత సినిమా గ్రాఫ్ నిదానంగా డౌన్ అయ్యింది. దర్శకుడు తాను చెప్పాలనుకున్న అంశాన్ని ఎఫెక్టివ్ గా చెప్పలేకపోయాడు.

ఈ సినిమాకు నయనతార నటనే హైలైట్. తనకున్న ఏకైక బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నించే మధ్యతరగతి మహిళగా నయనతార చక్కగా నటించింది. అయితే ద్వితీయార్థం అంతా లిమిటెడ్ స్పేస్ లో జరగడంతో హావభావాలకు తప్పితే యాక్షన్ కు పెద్దంత ప్రాధాన్యం లేకపోయింది. ఇక బాలనటుడి రిత్విక్ కూడా చక్కగా నటించాడు. ఇతర ప్రధాన పాత్రలను ఆర్ఎన్ఆర్ మనోహర్, భరత్ నీకలంఠన్, ‘ఆడుకాలమ్’ మురుగదాస్, లీనా తదితరులు పోషించారు. తమిళ అళగన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం బాగున్నాయి. సెల్వ ఆర్కే ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండటంతో కేవలం రెండు గంటలలో సినిమా ముగిసిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన ఇదో ప్లస్ పాయింట్! నయనతార అభిమానులు, సర్వైవల్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారు ‘ఓ2’ మూవీని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులోనూ చూడొచ్చు. భారీ అంచనాలతో ఈ మూవీని చూస్తే మాత్రం నిరాశ తప్పదు!

 

ప్లస్ పాయింట్స్
నయనతార నటన
సర్వైవర్ థ్రిల్లర్ కావడం
టెక్నీషియన్స్ వర్క్

మైనెస్ పాయింట్స్
ప్రిడిక్టబుల్ క్లయిమాక్స్
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే

ట్యాగ్ లైన్: సర్వైవల్ కష్టం!