NTV Telugu Site icon

Oh My Dog Review: ఓ మై డాగ్ (తమిళ డబ్బింగ్ – అమెజాన్)

Oh My Dog

Oh My Dog

తమిళ కథానాయకుడు సూర్య, అతని భార్య జ్యోతిక గత కొంతకాలంగా ఓటీటీ చిత్రాలపై దృష్టి పెట్టారు. అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకుని తమ చిత్రాలను ఆ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా వీరు నిర్మించిన ‘ఓ మై డాగ్’ మూవీ గురువారం నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే ఈ సినిమాలో మూడు తరాలకు చెందిన నటులు ఉన్నారు. సీనియర్ నటుడు విజయ్ కుమార్, ఆయన కొడుకు అరుణ్ విజయ్‌, మనవడు అర్ణవ్ విజయ్ ఇందులో తాత, తండ్రి, మనవడు (నిజజీవితంలో మాదిరి) పాత్రలను పోషించారు.

ఫెర్నాండో (వినయ్ రాయ్) కు కుక్కలంటే ప్రాణం. వాటికి శిక్షణ ఇచ్చి తద్వారా పేరు ప్రఖ్యాతులు గడిస్తుంటాడు. ఆ క్రమంలో అతనో క్రూరుడుగానూ మారతాడు. తన దగ్గర ఉన్న ఓ కుక్క పిల్లకు చూపులేదని తెలిసి దాన్ని చంపేయమని తన వాళ్ళకు పురమాయిస్తాడు. అయితే వారి కళ్ళు కప్పి ఆ కుక్కపిల్ల పారిపోతుంది. శంకర్ (అరుణ్ విజయ్) కొడుకు అర్జున్ (అర్ణవ్ విజయ్)కు అది దొరుకుతుంది. దాంతో దాన్ని ఇంటికి తీసుకెళ్ళి, సింబా అనే పేరు పెట్టి, పెంచుతాడు. ఇది అతని తాతయ్య (విజయ్ కుమార్)కు ఇష్టం ఉండదు. కానీ ఒకానొక సమయంలో ఆ కుక్కపిల్ల కారణంగా ఆయన గుండెపోటు నుండి బయటపడతాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా సింబాకు దగ్గరవుతారు. సింబా కంటికి ఆపరేషన్ చేయించి, దానికి అర్జున్ ట్రైనింగ్ ఇప్పిస్తాడు. వరుసగా ఏడోసారి డాగ్స్ కాంపిటీషన్ లో విజయం సాధించి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవాలనుకున్న ఫెర్నాండోకు సింబా కారణంగా ఎలాంటి ఎదురుదెబ్బ తగిలింది? పోటీలో విజేతగా నిలిచిన అర్జున్ ప్రత్యర్థి ఫెర్నాండోలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాడనేది క్లయిమాక్స్.

గతంలో ఈ తరహా కథాంశాలతో కొన్ని సినిమాలు వచ్చాయి. అంగ వైకల్యం ఉన్న తమ పిల్లలను దూరంగా పెట్టేసే తల్లిదండ్రులు తిరిగి, వారు ఓ స్థాయికి చేరుకుని, సమాజంలో గుర్తింపు తెచ్చుకోగానే ఎలా వారిని తమ బిడ్డలుగా గుర్తించారో ఆ సినిమాల్లో చూపారు. అయితే ఇందులో ఆ వైకల్యాన్ని ఓ కుక్కకు పెట్టి దర్శకుడు సరోవ్ షణ్ముగం కథను నడిపాడు. చిన్న కుక్క పిల్లకు, ఓ పిల్లాడికి మధ్య ఏర్పడిన బంధాన్ని చక్కగా చూపారు. అదే సమయంలో మధ్య తరగతి మనుషుల ఆర్థిక అవసరాలను అడ్డం పెట్టుకుని కొందరు ఎలాంటి దారుణాలకు పాల్పడతారో చెప్పారు. కథలో ఊహకందని మలుపులేవీ లేవు. సాదాసీదాగా సాగిపోయింది. అయితే క్లయిమాక్స్ లోని ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది. కొన్ని సన్నివేశాలలో సంభాషణలు ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

విజయ్ కుమార్, ఆయన కొడుకు అరుణ్, వాళ్ళ అబ్బాయి అర్ణవ్ లను ఒకే ఫ్రేమ్ లో చూసే ఛాన్స్ మొదటిసారి కలిగింది. విజయ్ కుమార్ తెలుగువారికి చాలాకాలంగా సుపరిచితుడే. మంజుల భర్తగా ఆయనకు తెలుగులో గుర్తింపు ఉంది. వారికి ముగ్గురు అమ్మాయిలు. అయితే విజయ్ కుమార్ మొదటి భార్య కుమారుడు అరుణ్. ఈ మధ్యలో అరుణ్ ‘బ్రూస్ లీ, సాహో’ వంటి స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ నటించి మనవాళ్ళకు చేరువయ్యాడు. అతని కొడుకు మాస్టర్ అర్ణవ్ కు ఇదే మొదటి సినిమా. తొలిచిత్రంలోనే ఈ పిల్లాడు చక్కని నటన కనబరిచాడు. ఇక ప్రతినాయకుడు ఫెర్నాండో పాత్రను ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ పోషించాడు. మిలిగిన పాత్రల్లో భానుచందర్, మహిమా నంబియార్, స్వామినాథన్, మనోబాల తదితరులు కనిపిస్తారు. స్టోరీ కేన్వాస్ పెద్దది కాకపోవడంతో లిమిటెడ్ బడ్జెట్ లోనూ మూవీని తీసేశారు. టెక్నికల్ గానూ పెద్దంత గొప్పగా ఏమీ లేదు. పెట్ యానిమల్స్ ఉన్నవాళ్లు ఈ సినిమాతో బాగానే కనెక్ట్ అవుతారు. మామూలు వాళ్లకు ఇది కాస్తంత బోర్ కొట్టే సినిమానే. అయితే ఓటీటీలో ఉంది కాబట్టి రిమోట్ చేతిలోకి తీసుకుని కొన్ని సీన్స్ స్కిప్ చేసి చూసేయొచ్చు.

రేటింగ్: 2.25 /5

ప్లస్ పాయింట్స్
విజయ్, అరుణ్, అర్ణవ్ ప్రెజెన్స్!
పెట్ యానిమల్ మూవీ కావడం
సూర్య, జ్యోతిక నిర్మాతలవడం

మైనెస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
ఫ్లాట్ గా సాగే కథనం

ట్యాగ్ లైన్: పట్టులేని పెట్!