ఓటీటీలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని భాషల చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం మొదలు పెట్టారు. అందులోనూ థ్రిల్లింగ్ అంశాలతో, చివరి వరకు ట్విస్ట్‌లను మెయింటైన్ చేయగలిగిన సినిమాలకు అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడలాంటి చిత్రమే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని రీసెంట్‌గా జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ‘నిశ్శబ్ద ప్రేమ’ యూనిట్ తెలిపింది. ఇప్పటికే తమిళ్‌లో విడుదలై విజయాన్ని అందుకున్న ఈ సినిమా, తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
‘నిశ్శబ్ద ప్రేమ’ కథ:
సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే ఓ మాస్క్ మ్యాన్ వెంబడిస్తూ చంపే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె ఆ మనిషిని తప్పించుకుని వీధిలోకి వచ్చి పరుగెడుతుండగా ఓ వ్యక్తి ఆమెను కార్ తో డాష్ ఇస్తాడు. యాక్సిడెంట్ అయి రోడ్డుపై పడి ఉన్న సంధ్యను రఘు అనే వ్యక్తి హాస్పిటల్‌లో చేర్చినా తలకు తగిలిన దెబ్బతో ఆమె గతం మరిచిపోతుంది. తనని హాస్పిటల్‌లో చేర్చిన రఘు, ఆమె భర్తే అనేలా పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఆ సమయంలో ఓ పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. ఈలోపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలెట్టిన కమిషనర్ ఎడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు ఓ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తోంది. అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య అతని నుంచి తప్పించుకుందా? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ సినిమా ఒక రొమాంటిక్ థ్రిల్లర్. అందుకు తగ్గట్టుగానే సినిమా దర్శకుడు సినిమాలోని పాత్రలను పరిచయం చేయడం కోసం టైమ్ తీసుకోకుండా, డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమాలో రెండే రెండు పాటలు ఉన్నాయి ఎక్కడా అడ్డు లేకుంగా ప్లేస్ చేసిన విధానం ఆకట్టుకుంది. దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేయడంలో చాల వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? అనేది ఓ క్లారిటీ వస్తుంది కానీ, అతను ఎలా బయటకు వస్తాడు? అతన్ని ఎవరు కనిపెడతారు? అనేది ఉత్కంఠగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా కన్వెన్సింగ్‌గా ఉంది.
నటీనటుల విషయానికి వస్తే విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన ఈ సినిమాకు హైలెట్. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రలో ఇమిడిపోయాడు. మరోపక్క సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ కూడా మంచి అభినయం ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్రో కనిపించేది కాసేపే అయినా అందాలతో ఆకట్టుకుంది. వియాన్, హరీశ్ పెరడితో పాటు ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు. ఇక టెక్నీకల్ అంశాల పరంగా కూడా చూస్తే సినిమా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జుబిన్ కారణంగా సినిమా ఓ భారీ బడ్జెట్ సినిమా చూస్తున్న ఫీల్‌ని తెప్పించారు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ సెట్ చేయడంలో సక్సెస్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఓవరాల్‌గా ఇదో రకం ప్రేమ.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చుతుంది.