యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్, ‘బబుల్ గమ్’ అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, ఈసారి ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మౌగ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రమోషనల్ కంటెంట్ వర్కౌట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
మౌగ్లీ కథ:
పార్వతీపురం ఏజెన్సీ ఏరియాలో మౌగ్లీ అలియాస్ మురళీ కృష్ణ (రోషన్ కనకాల) లోకల్‌గా జరిగే సినిమా షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎస్సై అవ్వాలనే ప్రయత్నాలు చేస్తూనే, మరో పక్క ఈ పనులు తన స్నేహితుడు ప్రభాస్ బంటి (వైవా హర్ష) తో కలిసి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ చేస్తూ ఉండగా, ఆ సినిమాలో సైడ్ డాన్సర్‌గా చేయడానికి వచ్చిన జాస్మిన్ (సాక్షి మడోల్కార్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఆమె మీద కన్నేసిన ఆ సినిమా నిర్మాత, ఎలా అయినా ఆమెను అనుభవించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఓ రోజు దాదాపుగా ఆమెను ట్రాప్ చేసిన క్రమంలో, మౌగ్లీకి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ షాకింగ్ విషయాలు ఏమిటి? అసలు ఈ కథలో క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) పాత్ర ఏమిటి? హీరో హీరోయిన్లు కలిశారా? వారి ప్రేమ చివరికి గెలిచిందా లేదా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ‘కలర్ ఫోటో’ లాంటి సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టేలా చేసిన సందీప్ రాజ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా దానిమీద అంచనాలు ఉంటాయి, కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందనే చెప్పాలి. నిజానికి కొత్త కథ ఆశించి ఈ సినిమా థియేటర్లకు వెళితే బోల్తా పడినట్లే. ఎందుకంటే మనం ఎప్పటినుంచో చూస్తున్న సినిమాల కథని కొంచెం అటూ ఇటూ చేసి సినిమాగా తెరమీదకు తీసుకొచ్చారు. ఒక సామాన్యుడైన హీరో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోయిన్‌తో ప్రేమలో పడటం, అదే హీరోయిన్ మీద వ్యవస్థలో మరో బలవంతుడైన వ్యక్తి మోసపడటం లాంటి లైన్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ బలహీనుడు ఆ బలవంతుడిని ఎలా గెలిచి బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథ. అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం అనే లైన్ తీసుకుని సినిమాగా మలిచాడు దర్శకుడు. అది కూడా కొత్తగా ఏమీ అనిపించదు.
కథ పాతగా ఉన్నా, కథనం ఏమైనా కొత్తగా ఉంటుందా అంటే, అది కొత్తగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ మొదలయ్యాక కథ పరుగులు పెడుతుంది కానీ, అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. చివరికి క్లైమాక్స్ మాత్రం కొంతమందికి బాగా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు దర్శకుడు. ఒక రకంగా చెప్పాలంటే, సినిమా క్లైమాక్స్ ఒక్కటే కొత్తగా ఉంది. కర్మ సిద్ధాంతం అనుసరించి సినిమా క్లైమాక్స్ రాసుకోవడం కొంతవరకు కలిసొచ్చే అంశం. ‘మౌగ్లీ’ ప్రేమ, యాక్షన్ అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నప్పటికీ, రొటీన్ కథనం కారణంగా నిరాశపరిచింది. సినిమా రచన బాగుంది. కొన్ని సన్నివేశాలలో డైలాగ్స్, భావోద్వేగాలను పండించిన తీరు మెప్పిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో రోషన్, విలన్ బండి సరోజ్, అలాగే వైవా హర్ష తమ పాత్రలలో చక్కటి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా రోషన్ తన మొదటి సినిమాతో పోలిస్తే నటన విషయంలో చాలా బెటర్ అయ్యాడు. లుక్స్ విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే చేసిన పాత్రకు మాత్రం పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. బండి సరోజ్ నటన మరీ రొటీన్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. అతని పర్‌ఫార్మెన్స్‌కి వంక పెట్టే పని లేదు కానీ, ఇలాంటి లౌడ్ పాత్రలే చేస్తూ పోతే భవిష్యత్తులో ఇబ్బందికరమే. హీరోయిన్ సాక్షికి డైలాగ్స్ చెప్పే స్కోప్ లేకపోయినా, తనదైన శైలిలో ఎక్స్‌ప్రెసివ్ పర్‌ఫార్మెన్స్‌తో కళ్ళతోనే నటిస్తూ ఆకట్టుకుంది.
టెక్నికల్ టీం విషయానికి వస్తే, సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన కొన్ని పాటలు వినడానికి బాగున్నాయి, అలాగే వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం అయితే కొత్తగా ఏమీ అనిపించలేదు. సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. మంచి లొకేషన్స్‌లో సినిమాని ఇంకా అందంగా చూపించారు. సినిమా కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. నిడివి విషయంలో ఇంకా వర్కౌట్ చేసి ఉండవచ్చు. ఫైట్స్ డిజైన్ బావుంది.
‘మౌగ్లీ’ రొటీన్ లవ్-యాక్షన్ డ్రామా, కానీ పర్‌ఫార్మెన్స్‌ల కోసం ఒకసారి చూడొచ్చు.