NTV Telugu Site icon

Liger Movie Review :: లైగర్ రివ్యూ

Liger Movie Review

Liger Movie Review

 

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మొదటి సారి ‘లైగర్’తో పాన్ ఇండియా రిలీజ్ కు వెళ్ళాడు. ఇప్పటికే రెండు హిందీ సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ ముచ్చటగా మూడోసారి ‘లైగర్’తో బాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇచ్చాడు. క్యూట్ బేబీ అనన్యాపాండే తో పాటు మైక్ టైసన్ లాంటి బాక్సింగ్ లెజెండ్ ‘లైగర్’లో యాక్ట్ చేయడంతో ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి పూరి టీమ్ ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం…

కరీంనగర్ కు చెందిన బాలామణి (రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్ (విజయ్ దేవరకొండ)తో ముంబై వెళుతుంది. తన భర్త బలరాం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ) ఫైనల్స్ లో మరణించడంతో కొడుకును నేషనల్ ఛాంపియన్ గా చూడాలని కలలు కంటుంది. ముంబై వీధుల్లో చాయ్ అమ్ముకుంటూ, కృష్ణ శర్మ (రోనిత్ రాయ్) ఎంఎంఏ ట్రైనింగ్ సెంటర్ లో కొడుకును చేర్పిస్తుంది. ఫ్లోర్ క్లీనర్ గా అందులో చేరిన లైగర్… ఎం.ఎం.ఎ. నేషనల్ ఛాంపియన్ ఎలా అయ్యాడన్నదే ‘లైగర్’ కథ.

ముంబై చేరిన లైగర్… వద్దు వద్దు అనుకుంటూనే తాన్య (అనన్యా పాండే) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అలాంటిది జరిగితే నేషనల్ ఛాంపియన్ కావాలనుకున్న కొడుకు కల గంగలో కలిసి పోతుందని తల్లి భయపడుతుంది. అనుకున్నంతా అయ్యి, అతని ఫోకస్ డైవర్ట్ అవుతుంది. ఇంతలో తాన్యా హ్యాండివ్వడంతో తిరిగి తన లక్ష్యం మీద లైగర్ ఫోకస్ పెడతాడు. సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు. అక్కడితో అయిపోయిన సినిమాను ఇంటర్నేషనల్ ఛాంపియన్ కావాలన్నది తన లక్ష్యమని లైగర్ చెప్పడంతో స్టోరీని ఎక్స్ టెండ్ చేశాడు పూరి. దాంతో సీన్ లోకి బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ ను తీసుకొచ్చాడు. చిన్నతనం నుండి టైసన్ తో ఒక్క సెల్పీ దిగితే చాలు అనుకునే లైగర్… చివరకు హీరోయిన్ కోసం అతనితోనే పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో లైగర్ ఎలా విజయం సాధించాడన్నది క్లయిమాక్స్!

కరోనా కారణంగా పూరి జగన్నాథ్ కు ‘లైగర్’ కథ తయారు చేసుకోవడానికి బోలెడంత సమయం చిక్కింది. బట్…. ఆయన ప్రాజెక్ట్ ను ఎంత భారీగా తీయాలా అని ప్లాన్ చేశారు తప్పితే, ఈ టైమ్ లో కథ మీద దృష్టి పెట్టలేదని తెలిసిపోతోంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ పరమ రొటీన్ గా సాగింది. ఊహకందని మలుపులు కానీ ఉత్సుకత కలిగించే సీన్స్ గానీ ఇందులో లేవు. సినిమా కాస్తంత చూడదగ్గదిగా ఉందంటే ఆ క్రెడిట్ డీవోపి విష్ణుశర్మకు, ఆర్.ఆర్. ఇచ్చిన సునీల్ కశ్యప్ కు దక్కుతుంది. అలానే జునైద్ సైతం షార్ప్ ఎడిటింగ్ చేసి, మూవీని బాగా ట్రిమ్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. సినిమా ప్రారంభం నుండి ఇందులో కీలక పాత్రధారి రోనిత్ రాయ్ రెండు మాటలు చెబుతాడు. ఒకటి ఫోకస్.. రెండు పేషన్స్! అయితే ఫోకస్ అనే దాన్ని పూరి జగన్నాథ్ వివిధ శాఖల నుండి అవుట్ పుట్ తీసుకోవడంలో పెట్టాడు కానీ స్టోరీ మీద పెట్టలేదు. ఇక రెండవది పేషన్స్. ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టినా సహనాన్ని కోల్పోకూడదని కోచ్… లైగర్ కు చెబుతాడు. ఇది హీరో క్యారెక్టరైజేషన్ లో మిస్ అయ్యింది. హీరోలో ఎక్కడా ఆ పెషన్స్ మనకు కనిపించదు. అతను ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకున్నట్టు అనిపించదు. ఇందులో పాటలను డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో చేయించడం కొంతలో కొంత మంచిదైంది. కాస్తంత డిఫరెంట్ సౌండ్ వినగలిగాం. పాటల చిత్రీకరణ పూరి గత చిత్రాలనే గుర్తు చేసింది. ఏదీ కొత్తగా లేదు! వీటిని భాస్కరభట్ల రవికుమార్ తనదైన స్టైల్ లో రాశాడు. బట్…. ‘కోకా… కోకా…’ సాంగ్ ను ఎండ్ టైటిల్స్ లో వేయడం దారుణం. థీమ్ సాంగ్ లాంటిది అలా వస్తే ఓకే కానీ, హిట్ అయిన డ్యూయెట్ ను తీసుకెళ్ళి అక్కడ వేశారంటే డైరెక్టర్ కు స్క్రిప్ట్ మీద గ్రిప్ లేనట్టే! తన చిత్రాలకు మాటలను అలవోకగా రాసేసుకునే పూరి జగన్నాథ్ ఒకటికి రెండు సార్లు రాసేముందు, రాసిన తర్వాత ఆలోచించుకుంటే మంచిది. ‘అమెరికాకు ఇంత వరకూ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు వచ్చారు… కానీ మొదటిసారి ఓ మగాడు వచ్చాడు’ అని చంకీపాండే తో అనిపించాడు. అంటే అంతవరకూ అమెరికాకు వెళ్ళినవారిని పూరి ఏం అనుకుంటున్నట్టు!? అక్కడ ‘మగాడు’ అని కాకుండా ‘ఫైటర్ వచ్చాడు’ అని రాసి ఉంటే బెటర్ గా ఉండేది!!

నటీనటుల విషయానికి వస్తే… ఇది విజయ్ దేవరకొండ సినిమా! బలహీనమైన కథను తన భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించడానికి బాగా కష్టపడ్డాడు. నిజానికి డైరెక్టర్ హీరోకి ఉన్న నత్తి అనే బలహీనతను మరి అంతగా ఎక్స్ పోజ్ చేయాల్సి అవసరం లేదు. ఎంత నత్తి ఉన్న వాళ్ళు అయినా, కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడతారు తప్పితే, ప్రతి పదం దగ్గర కుస్తీ పట్టరు. విజయ్ దేవరకొండ మేకోవర్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. ముఖ్యంగా ఫైట్స్ లో ఇరగదీశాడు. అనన్య పాండే నుండి గొప్ప నటనను ఎక్స్ పెక్ట్ చేయలేం. రమ్యకృష్ణ తల్లిగా బాగానే నటించింది. ఇలాంటి పాత్రలు చేయడం ఆమెకు కొట్టినపిండే! కానీ ఆమె పేరును తెరమీద ఇంతవరకూ ఎప్పుడూ వేయని విధంగా ‘రమ్యకృష్ణన్’ అని వేయడమే విడ్డూరం! రోనిత్ రాయ్, విషు, చంకీపాండే, అలీ, టెంపర్ శివ, గెటప్ శ్రీను వీళ్ళంతా ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. మకరంద్ దేశ్ పాండేదీ గెస్ట్ రోల్ అనే అనుకోవాలి. ఏసియాలోనే మైక్ టైసన్ నటించిన మొదటి చిత్రమిదని ప్రచారంలో ఊదరగొట్టారు. అదే ఈ మూవీకి మెయిన్ మైనస్ అయ్యింది. క్లయిమాక్స్ ఫైట్ లో ఆయనతో గెస్ట్ అప్పీయరెన్స్ ఇప్పించినట్టు అయ్యింది. పాపం మైక్ టైసన్ పాత్ర బఫూన్ ను గుర్తు చేసింది. ఇలాంటి పేలవమైన, పరమ రొటీన్ కథతో పూరి టీమ్ ‘వాట్ లగాదేంగే’ అని ఎలా జబ్బలు చరుచుకున్నారో అర్థమే కాదు!

రేటింగ్: 2.25 / 5

ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ యాక్టింగ్
యాక్షన్ సీన్స్
సినిమాటోగ్రఫీ
పాన్ ఇండియా మూవీ కావడం

మైనెస్ పాయింట్స్
పూరి పూర్ స్టోరీ
రొటీన్ స్క్రీన్ ప్లే
వీక్ క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: నా.. నా.. నాకౌట్!