NTV Telugu Site icon

రివ్యూ: కాంతార (కన్నడ డబ్బింగ్)

Kantara Review1

Kantara Review1

శాండిల్ వుడ్ పరిమళం ఇవాళ దేశవ్యాప్తంగా వీస్తోంది. మొన్న ‘కేజీఎఫ్’, నిన్న ‘విక్రాంత్ రోణ’, ఇవాళ ‘కాంతార’లతో కన్నడ చిత్రసీమ అందరూ అనుకుంటున్నట్టు వెనకబడి లేదని, కథల రూపకల్పనలో, వాటిని తెరకెక్కించడంలో ఇతర భాషలతో పోటీ పడుతోందని నిరూపిస్తోంది. మధ్యలో కొన్ని పాన్ ఇండియా కన్నడ చిత్రాలు పరాజయం పాలైనా, ‘కేజీఎఫ్‌’, ‘కాంతార’ చిత్రాల విజయంతో శాండిల్ వుడ్ ను నిర్లక్ష్యం చేయకూడదనే విషయం అందరికీ బోధపడింది. ప్రముఖ దర్శకుడు రిషబ్ శెట్టి తానే ప్రధాన పాత్రను పోషించి, రూపొందించిన ‘కాంతార’ కన్నడనాట సెప్టెంబర్ 30న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీని తెలుగు వర్షన్ శనివారం జనం ముందుకు వచ్చింది.

1847లో కన్నడ రాజు ఒకరు భోగభాగ్యాలు ఎన్ని ఉన్నా అశాంతితో సతమతమౌతుంటాడు. ఆనందాన్ని వెతుక్కుంటూ అడవి బాట పడతాడు. అతనికి అక్కడి గిరిజనులు దైవంగా కొలిచే ఓ రాయి కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతనికి సాంత్వన కలుగుతుంది. వాళ్ళు దేవుడిగా కొలిచే ఆ రాయిని పొందడం కోసం తన రాజ్యంలోని కొంత అడవి భాగాన్ని వారికి కానుకగా ఇస్తాడు. ఓ వందేళ్ళు గడిచిన తర్వాత ఆ రాజు వారసుడొకరు కోట్ల విలువ చేసే ఆ భూములను తిరిగి పొందాలని ప్రయత్నించి విఫలమౌతాడు. అడవిని, తమ గూడెంను వారాహ స్వామి కాపాడతాడనే నమ్మకం వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుత కథ 1990లో జరుగుతుంది. గిరిజనుడైన శివ (రిషబ్ శెట్టి) అటవీ ప్రాంతానికి హద్దులు గీయాలనుకునే ఫారెస్ట్ ఆఫీసర్ మురళి (కిశోర్)తో గొడవ పడతాడు. రాజు వారసుడైన దొర గిరిజనుల పక్షాన నిలిచి, ప్రభుత్వ అధికారులను అదుపులో ఉండమని హెచ్చరిస్తాడు. అయితే గోముఖ వ్యాఘ్రం లాంటి దొర నైజంను శివ ఎలా తెలుసుకున్నాడు? సంప్రదాయంగా వస్తున్న గిరిజన జాతర పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అతనిలో కనువిప్పు ఎలా కలిగింది? ప్రభుత్వ అధికారులకు, గిరిజనులకు మధ్య చిచ్చు పెట్టాలను చూసిన దొరకు ఏ గతి పట్టింది? అనేది మిగతా కథ.

రాజుల కాలం నాడు కథను మొదలు పెట్టి 1990లోకి దీనిని చాలా సులువుగా దర్శకుడు రిషబ్ శెట్టి తీసుకొచ్చాడు. తండ్రి వారసత్వాన్ని స్వీకరించడానికి ఆసక్తి చూపని శివలో మార్పు రావడం అనేది ఈ కథలో కీలకం. అలానే మేకవన్నె పులి లాంటి దొర లోగుట్టు బైట పెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. అడవి ప్రాంతాన్ని ప్రభుత్వ అధికారులు కాపాడటం ఎంత సముచితమో, అక్కడి గిరిజనులకు ఆ అడవి మీద సర్వహక్కులు ఉంటాయనేది అంతే వాస్తవం! అయితే ఆ వారిని మాయ చేసి, ఎవరైనా దుర్మార్గులు అడవిని ఆక్రమించాలని చూసినప్పుడు ప్రభుత్వం, స్థానికులు కలిసి తిరగ బడాల్సిందే. వారి అంతు చూడాల్సిందే. ఇదే అంశాన్ని ఈ సినిమాలో చూపించారు. అడవికి, గిరిజనులకు మధ్య అడ్డంగా నిలిచే వారిని దేవుడు కూడా ఉపేక్షించడని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. గిరిజనుల సంప్రదాయాలను అధికారులు గౌరవించినప్పుడు, అధికారుల సూచనలనూ వారూ పాటిస్తారు. ఇది పరస్పర అవగాహనతో జరగాల్సిన విషయం. అలా కాకుండా చేతిలో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే, పర్యవసానాలూ తీవ్రంగా ఉంటాయి. దీనిని దర్శకుడు చెప్పకనే చెప్పాడు.

దర్శకుడిగా ‘రిక్కీ’ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రిషబ్ శెట్టి ‘కిరాక్ పార్టీ’తో తన సత్తాను చాటుకున్నాడు. ఈ మధ్యలో నటుడిగానూ కొన్ని సినిమాలలో చేసిన అతను ఇప్పుడీ ‘కాంతార’లో శివ పాత్రను పోషించాడు. ప్రథమార్థం మొత్తం సరదాగా సాగిపోయినా, పతాక సన్నివేశం దగ్గరకు వచ్చేసరికీ తన నటనతో ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేసేశాడు. ఒక్కసారిగా థియేటర్ మొత్తం మాస్ హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయేలా ఆ సన్నివేశాలను తెరకెక్కించాడు. అలానే అత్యద్భుత నటన ప్రదర్శించాడు. కథానాయిక లీల గా నటించిన సప్తమి గౌడ పాత్రకు ఉన్న ప్రాధాన్యం తక్కువే అయినా… ఉన్న మూడు నాలుగు సన్నివేశాలు బలంగా బాగున్నాయి. శివ తల్లిగా మానసి సుధీర్, దొరగా అచ్యుత్ కుమార్, ప్రజా ప్రతినిధి సుధాకర్ గా ప్రమోద్ శెట్టి నటించారు. ఇందులో రిషబ్ శెట్టి తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రను కిశోర్ సమర్థవంతంగా చేశాడు.

నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు నూరు శాతం ఎఫర్ట్ పెట్టడమే ఈ సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ రీజన్. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ మోరే యాక్షన్ కొరియోగ్రఫీ మూవీకి హైలైట్. అలానే అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, బి. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. సౌండ్ డిజైనింగ్ కూడా అద్భుతంగా ఉంది. హనుమాన్ చౌదరి సంభాషణలూ ఆకట్టుకున్నాయి. ‘కేజీఎఫ్‌’ లాంటి భారీ యాక్షన్ మూవీని నిర్మించిన హోంబలే సంస్థ నుండి వచ్చిన మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కాంతార’. ఈ తరహా సినిమాను థియేటర్ లోనే చూడాలి. అప్పుడే సరైన అనుభూతికి లోనుకాగలం. ఈ సినిమా దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టితో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులు సైతం ఈసారి జాతీయ అవార్డుల రేస్ లో ఉండటం ఖాయం. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మూవీని తెలుగులో విడుదల చేయడం మరో ప్లస్ పాయింట్!

రేటింగ్: 3/5

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
గగుర్పొడిచే పతాక సన్నివేశం
ఆకట్టుకునే నటీనటుల నటన
సాంకేతిక నిపుణుల ప్రతిభ

మైనెస్ పాయింట్స్
నేటివిటీ మూవీ కావడం
డబుల్ మీనింగ్ డైలాగ్స్
స్థాయిని తగ్గించే కామెడీ సీన్స్

ట్యాగ్ లైన్: మిస్టీరియస్ మూవీ!