NTV Telugu Site icon

Hidimba Review: హిడింబ రివ్యూ

Hidimba Movie Ntv Review

Hidimba Movie Ntv Review

Hidimba Movie Review in telugu: యాంకర్ ఓంకార్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అశ్విన్ బాబు రాజు గారి గది వంటి సినిమాతో మంచి హిట్ అందుకున్న తర్వాత సరైన హిట్టు అందుకోలేకపోయాడు. ఈ సారి ఎలా అయినా హిట్ అందుకోవాలని డైరెక్టర్ అనిల్ కన్నెగంటితో కలిసి హిడింబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా 20వ తేదీ అంటే రేపు రిలీజ్ కావాల్సి ఉంది కానీ మీడియాకి స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడమే కాదు సినిమా మీద నమ్మకంతో తెలుగు ప్రేక్షకులకు చాలా ప్రాంతాలలో స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తి పెంచింది. అలాగే రివర్స్ ట్రైలర్ పేరుతో కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకురావడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అనేది సినిమా రివ్యూలో చూద్దాం

హిడింబ కథ విషయానికి వస్తే
హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ అభయ్(అశ్విన్ బాబు) పూర్తిస్థాయిలో కేసును తేల్చలేక పోతున్న నేపథ్యంలో కేరళలో ఇదే తరహా కేసును చేదించిన ఆద్య(నందితా శ్వేత)ను నగరానికి తీసుకొస్తారు. వీరిద్దరూ కలిసి మిస్ అవుతున్న అమ్మాయిలు ఎలా మిస్ అవుతున్నారు అనే విషయాన్ని ఛేదించే పనిలో పడతారు. ఈ క్రమంలో బోయ అనే ఒక వ్యక్తి మీద అనుమానపడిన అభయ్ శత్రుదుర్భేద్యమైన బోయ అడ్డాలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలను కాపాడుతాడు. అయితే మిస్ అయిన అమ్మాయిలలో కేవలం ఒకే ఒక్క అమ్మాయి అక్కడ ఉందని మిగతా వాళ్ళు ఎవరో తెలియకపోవడంతో ఈ కిడ్నాప్ల వెనుక ఉన్నది బోయ కాదని తెలుస్తుంది. ఈ కిడ్నాప్ల వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న తరుణంలో హత్యకు ఒక ఊహించని క్లూ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో కథ కేరళకు మారుతుంది. కేరళ వెళ్ళిన అభయ్, ఆద్య కిడ్నాపులు ఎవరు చేస్తున్నారనే విషయం తెలుసుకున్నారా? అసలు నిజంగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నది ఎవరు? కిడ్నాప్ చేస్తున్న అమ్మాయిలను అందర్నీ ఏం చేస్తున్నారు ? అసలు ఇంతకీ హిడింబ? అంటే ఏమిటి? అనే వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్లు లేదా హారర్ థ్రిల్లర్లు అనగానే తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఒకపక్క భయపడుతూనే సినిమా మొత్తాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వాలు సినీ ప్రేమికులవి. ఈ సినిమాని కూడా ఒక హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కించారు. వరుసగా సిటీలో అమ్మాయిలు మిస్ అవ్వడం, ఆ కేసును బ్రేకప్ అయిన ఒకప్పటి ప్రేమికులు కలిసి ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ తర్వాత కథ కేరళకు మారడం ఇలా సినిమా సాగిపోతూ ఉంటుంది. నిజానికి దర్శకుడు జరుగుతున్న కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారనే విషయం ప్రేక్షకులకు కూడా అర్థం కాకుండా ప్లాన్ చేసుకుని నాన్ లీనియర్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అనిపించింది. ఒక సీన్ ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంటే ఆ తర్వాత సీన్ ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఒక రకంగా ప్రేక్షకుల మెదడుకు ఇదొక పదును పెట్టే సినిమానేమో అని కూడా అనిపిస్తుంది. అసలు కిడ్నాప్లు ఎలా జరుగుతున్నాయి? అనేది కనుక్కునేందుకు సిద్ధమైన టీమ్ వాటి చేధించే క్రమం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైనప్పటి నుంచి సినిమాలో వేగం పెరుగుతుంది. దర్శకుడు స్క్రీన్ ప్లే మీద మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కనుక రేసీగా ఉంటే సినిమా ఫలితం మరో లెవెల్ లో ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సినిమాలో అనేక పాత్రలు ఉన్నా, ఎవరినీ పూర్తిస్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం అందరినీ షాక్ కి గురిచేస్తుంది. సినిమా మొత్తానికి సెకండ్ హాఫ్, రీ రికార్డింగ్ బాగా ప్లస్ పాయింట్స్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది.

నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే
గత సినిమాలతో పోలిస్తే అశ్విన్ బాబు ఈ సినిమాలో నటన మెరుగుపరుచుకున్నాను. పోలీసు అధికారి పాత్రలో బాడీని కూడా బాగా ట్యూన్ చేసుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ రోల్స్ కి కరెక్ట్ గా సూట్ అవుతాడు అనేలా ఆయన బాడీని ట్యూన్ చేసుకున్నాడు. నందిత శ్వేత కూడా హీరోతో సమానమైన పాత్రలో నటించి తన కెరీర్ లో మంచి సినిమా చేశాననిపించుకుంది. హీరోతో సమానంగా ఆమె పాత్ర కూడా ఉంటుంది. ఇక కీలకమైన పాత్రలో నటించిన మకరంద్ దేశ్ పాండే అయితే ఒక రేంజ్ లో నటించాడు. ఆయన నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మకరంద్ దేశ్పాండే పాత్ర చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇక మిగతా పాత్రల్లో నటించిన సంజయ్, రఘు కుంచే, శ్రీనివాసరెడ్డి, విద్యుల్లేఖా రామన్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. అయితే శ్రీనివాసరెడ్డి, విద్యుల్లేఖా రామన్ వంటి కమెడియన్లు ఉన్నా ఎందుకో కామెడీ పరంగా ప్రయత్నించలేదు. వారి కోసం ఒక కామెడీ ట్రాక్ సృష్టించి ఉంటే బాగుండేదేమో అనిపించింది.

టెక్నికల్ డిపార్ట్మెంట్
ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ అనిల్ కన్నెగంటి ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది కానీ దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో కాస్త తడబడ్డాడు. ఈ సినిమా స్క్రీన్ ప్లే పై విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఫలితం వేరేలా ఉంటుంది. సినిమా మొత్తానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది. కొన్ని కొన్ని సీన్స్ లో బీజీఎం దెబ్బకి వెన్నులో వణుకు పుడుతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలావరకు బాగా సినిమా ఎలివేట్ చేసేందుకు ఉపయోగపడింది. ఆర్ట్ డైరెక్టర్ షర్మిల ఎలిశెట్టి వర్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది.

ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
క్లైమాక్స్
బీజీఎం

మైనస్ పాయింట్స్
స్క్రీన్ ప్లే
పెద్దగా గుర్తుండని పాటలు

బాటమ్ లైన్
హిడింబ థ్రిల్లర్ జోనర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్లలో చూస్తే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది.

Show comments