NTV Telugu Site icon

Gaalodu Review: గాలోడు మూవీ రివ్యూ

Gaalodu2

Gaalodu2

Gaalodu Review: ‘జబర్దస్త్’ కమెడియన్స్ కొందరు గత కొంతకాలంగా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అవకాశం లభించాలే కానీ అడపా దడపా హీరోలుగానూ నటిస్తున్నారు. అలా సుడిగాలి సుధీర్ ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించి, తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘గాలోడు’తో అదే పనిచేశాడు. మరి ఈ గాలి సోకిన ప్రేక్షకుల పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం!!

రాజు (సుడిగాలి సుధీర్) పల్లెటూరి కుర్రాడు. ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. ఓ రోజు పేకాటలో సర్పంచ్ కొడుకుపై చేయి చేసుకోవడంతో అతను చనిపోతాడు. దాంతో ఊరు వదిలి పెట్టి రాజు హైదరాబాద్ పారిపోతాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్ శుక్లా (గెహనా సిప్పి)తో పరిచయం అవుతుంది. ఆకతాయిల నుండి తనను కాపాడిన రాజును తన తండ్రికి పరిచయం చేసి, డ్రైవర్ గా ఉద్యోగంలో పెట్టిస్తుంది శుక్లా. అలా మొదలైన వారి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఇదే సమయంలో పల్లెటూరిలో హత్య చేసి సిటీకి వచ్చిన రాజును వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హత్య కేసులో శిక్ష పడిన రాజు.. జైలు నుండి ఎలా బయటపడ్డాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? ఈ విషయంలో లాయర్ విజయ భాస్కర్ (సప్తగిరి) అతనికి ఎలాంటి సాయం చేశాడు? అన్నదే మిగతా కథ.

పరమ సాదాసీదా కథను ఎంపిక చేసుకుని దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాను తీశారు. హీరో జైలుకు వెళ్ళటంతో మొదలైన ఈ సినిమా అక్కడ నుండి ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది. అతను జైలు నుండి బయటకు వచ్చి, హీరోయిన్ ను పెళ్ళి చేసుకోవడంతో ముగుస్తుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త సన్నివేశం కనిపించదు. మేటర్ తక్కువ, బిల్డప్ ఎక్కువ అన్నట్టుగా సినిమా సాగుతుంది. గతంలో సుడిగాలి సుధీర్ తో దర్శకుడు రాజశేఖర్ రెడ్డి ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ అనుబంధంతోనే ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. డబ్బున్న అమ్మాయిని ఆవారాగా తిరిగే కుర్రాడు ప్రేమించడం, ప్రేమ గుడ్డిదనే మాటను నిరూపిస్తూ, ఆమె ఇతనితో ప్రేమలో పడిపోవడం, వారి ప్రేమను చూసి తట్టుకోలేక హీరోయిన్ తండ్రి విలన్ గా మారడం, వారిని విడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నించడం, చివరకు హీరో తన మంచితనంతో అందరి మనసులను గెలుచుకోవడం… ఇలా సింపుల్ పాయింట్ తో మూవీని తీసేశారు. కథలో కొత్తదనం ఇసుమంతైనా లేదు… కనీసం కథనమైన ఆకట్టుకుంటుందా అంటే అదీ లేదు! రొటీన్ రొట్టకొట్టుడు టేకింగ్! ఈ తరం ఆడియెన్స్ ను ఇలాంటి పాచిపోయిన కథతో ఎలా మెప్పించవచ్చని దర్శక నిర్మాత భావించారో అర్థం కాదు! ఇందులో కొన్ని సీన్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో జబర్దస్త్ కామెడీ సీన్స్ ను గుర్తుకు తెస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే… కమెడియన్ ఇమేజ్ ఉన్న సుడిగాలి సుధీర్ కు ఇది నప్పే పాత్ర కాదు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే తపన తప్పితే దర్శకుడికి మరో ఆలోచన ఉన్నట్టుగా కనిపించదు. హీరో ఎంట్రీ సీన్ నుండి ప్రతి సన్నివేశాన్నీ బిల్డప్ షాట్స్ తో నింపేశారు. వినోదాన్ని పంచాల్సిన చోట కూడా హీరోయిజాన్నే చూపించారు. కనిపెంచిన తల్లిదండ్రులు, నానమ్మ మీద గౌరవం లేని గాలోడి పాత్రలో సుధీర్ ను ఊహించుకోవడం కష్టమే. సెకండ్ హాఫ్‌ లో ఆ పాత్రలో రియలైజేషన్ ను చూపించినా, అదేమంత ఆకట్టుకునే విధంగా లేదు. ‘చోర్ బజార్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన గెహనా సిప్పి తెర మీద చూడటానికి బాగానే ఉంది. దాంతో పాటలు, వాటి లొకేషన్స్ కాస్తంత చూడదగ్గవిగా అనిపిస్తాయి. ఇతర ప్రధాన పాత్రలను సప్తగిరి, రవిరెడ్డి, ఆధ్య, అజయ్, శరత్, పృధ్వీరాజ్, సత్యకృష్ణన్ తదితరులు పోషించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ జడ్జి పాత్రలో కనిపించారు. మొత్తం సినిమాలో షకలక శంకర్ పాత్రే కాస్తంత వినోదాన్ని పంచేది.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే…. యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. అలానే రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ కూడా. అతనే ఈ ప్రాజెక్ట్ డిజైనర్ కూడా. అంతేకాదు… జైలర్ గానూ రాంప్రసాద్ ఓ సీన్ లో తళుక్కున మెరిశాడు. ఇక ప్రాస కోసం రచయిత పడిన పాట్లు సినిమా అంతటా కనిపిస్తాయి. మూవీ టైటిల్ సాంగ్ లో కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ సైతం హీరోతో కలిసి ఓ స్టెప్ వేశాడు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన ట్యూన్స్ లో కొత్తదనం లేదు. నేపథ్య సంగీతమూ సో… సో… గానే ఉంది. మొత్తంగా గాలిని పోగేసి… జనాలను మెప్పించాలని దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించాడు. అది సఫలీకృతం కావడం కష్టం! రాబోయే రోజుల్లో అయినా సుడిగాలి సుధీర్ కథల ఎంపికపై కాస్తంత శ్రద్థ పెడితే మంచిది!!

రేటింగ్: 2 / 5

ప్లస్ పాయింట్స్
యాక్షన్ సీన్స్
కెమెరా పనితనం
ఆకట్టుకునే సంభాషణలు

మైనస్ పాయింట్స్
రొటీన్ కథ, కథనాలు
మితిమీరిన బిల్డప్స్
పండని వినోదం

ట్యాగ్ లైన్: బాలేడు!

Show comments