NTV Telugu Site icon

Dongata Movie Telugu Reveiw : దొంగాట (మలయాళ డబ్బింగ్) ఆహా ఓటీటీ

Dongata

Dongata

‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు చక్కని గుర్తింపు లభించింది. దాంతో అతను నటించిన మలయాళ చిత్రాలను మన నిర్మాతలు తెలుగువారి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2017లో విడుదలైన మలయాళ చిత్రం ‘తొండిముత్యాలుం దృక్సాక్షియుం’ను తెలుగులో ‘దొంగాట’గా అనువదించారు. ఈ సినిమాను మే 6న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్ తో పాటు సూరజ్ వెంజరముడి, నిమిష సజయన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని దిలీష్ పోతన్ డైరెక్ట్ చేశాడు.

ప్రసాద్ (సూరజ్) ఓ పల్లెటూరిలో సాధారణ జీవితం గడిపే కుర్రాడు. అతని స్నేహితుడు సీతయ్య (వెట్టికిలి ప్రకాశ్‌) కూతురు శ్రీజ (నిమిష సజయన్) తో చిన్నపాటి మిస్ అండర్ స్టాండింగ్ తో ఏర్పడిన పరిచయం చివరికి ప్రేమకు దారితీస్తుంది. ప్రసాద్ ది వేరే కులం కావడంతో సీతయ్య వారి పెళ్ళికి అంగీకరించడు. వారిని కాదని ప్రసాద్, శ్రీజ గుడిలో పెళ్ళి చేసుకుని వేరే వూరిలో కాపురం పెడతారు. భార్య మెడలోని బంగారు తాళిని తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం కొన్న భూమిలో బోరు వేయిద్దామనుకుంటుండగా, ఆ గొలుసును ప్రసాద్‌ (ఫహద్ ఫాజిల్) అనే దొంగ కొట్టేస్తాడు. బస్సులో ప్రయాణిస్తుండగా తన మెడలో గొలుసు కట్ చేసి, నోటిలో వేసుకోవడం శ్రీజ చూస్తుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అదే విషయం చెబుతుంది. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. తాను దొంగతనం చేయలేదని తొలుత బుకాయించిన దొంగ… ఎక్స్ రేలో పొట్టలోని గొలుసు కనిపించడంతో తప్పు చేసినట్టు అంగీకరిస్తాడు. మరి అతని పొట్టలోని గొలుసును పోలీసులు బయటకు తీశారా? ప్రసాద్‌, శ్రీజలకు అది చేరిందా? పోలీసుల ఉద్యోగాలతో ముడిపడిన ఈ కేసు ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

నిజానికి ఇదో సింపుల్ స్టోరీ. రాబరీ కేసుల్ని పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తారనే విషయాన్ని దర్శకుడు దిలీష్ పోతన్ కళ్ళకు కట్టినట్టుగా ఇందులో చూపించాడు. తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తులైన పోలీసులు; చివరి క్షణం వరకూ నేరం ఒప్పుకోని దొంగలు; తాము నష్టపోయినా ఫర్వాలేదు, ఎదుటి వ్యక్తికి అన్యాయం జరగకూడదనే మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలు మనకు ఇందులో కనిపిస్తాయి. హీరోగా గుర్తింపు ఉన్న ఫహద్ ఫాజిల్ ఈ మూవీలో దొంగ పాత్ర చేయడం విశేషం. నటనకు ఆస్కారం ఉండాలే కానీ ఎలాంటి పాత్ర అయినా చేస్తానని ఫహద్ ఈ మూవీతో నిరూపించాడు. కాస్తంత ఆలస్యంగా అతని ఎంట్రీ జరిగినా, అక్కడి నుండి కథంతా అతని మీదనే సాగుతుంది. అయితే అతను దొంగగా మారడానికి, ఆ తర్వాత తిరిగి మామూలు మనిషి కావడానికి బలమైన కారణాలను దర్శకుడు చూపించలేదు. తన గురించి కోర్టులో మంచిగా చెప్పమని ప్రసాద్, శ్రీజలను అతను వేడుకోవడంలోనూ కపటత్వమే కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఆ తర్వాత మారడమనేది ఆ పాత్రను పలచన చేయడమే. అలాగే తన గొలుసు దొంగిలించిన వాడికి ఎలాగైనా శిక్ష పడాలని భావించిన శ్రీజ, పోలీసులు దొంగపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిసిన తర్వాత అతన్ని వదిలేయమడంతో ఆ పాత్ర ఔచిత్యం పెరిగింది. మధ్య తరగతికి చెందిన నిస్సహాయ దంపతులుగా సూరజ్, నిమిష చక్కగా నటించారు. విశేషం ఏమంటే నిమిష సజయన్ కు ఇదే తొలి మలయాళ చిత్రం. ఆ తర్వాత ఆమె పలు అర్థవంతమైన సినిమాలలో మంచి మంచి పాత్రలు పోషించింది. అవార్డులూ అందుకుంది. ముఖ్యంగా ‘ది గ్రేట్ ఇండియన్ కిచన్’తో అందరి దృష్టిని నిమిష ఆకట్టుకుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సిబీ ధామస్, అలెన్సిర్, శ్రీకాంత్ మురళి తదితరులు పోషించారు.

ఈ సినిమాలోని నటనకు గానూ ఫహద్ ఫాజిల్ కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. అలానే బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా సజీవ్ పళూర్ జాతీయ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు సైతం ఈ మూవీకి దక్కింది. మానవీయ సంబంధాలు, మధ్యతరగతి వ్యక్తుల ఆలోచనా ధోరణి, సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వారు రాజీ పడే విధానం, పోలీసు వ్యవస్థలో ఉండే లొసుగులు… వీటన్నింటి మీద దర్శకుడు మంచి హోమ్ వర్క్ చేశాడు. శ్యామ్ పుష్కరన్ క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాకు బిజిబల్ మ్యూజిక్, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ అందించారు. నేపథ్యంలో వచ్చే రెండు పాటల సాహిత్యం చాలా అర్థవంతంగా ఉంది. ఆహాలో ప్రసారం అవుతున్న ‘దొంగాట’ను సమయం చిక్కితే చూడండి, చక్కని అనుభూతికి లోనవుతారు.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్:
నటీనటుల సహజ నటన
సాంకేతిక నిపుణుల పనితనం

మైనస్ పాయింట్స్:
ఊహకందే ముగింపు
నత్తనడకలా సాగే కథనం

ట్యాగ్ లైన్ : ఆకట్టుకునే ‘దొంగాట’