NTV Telugu Site icon

Dochevarevarura Review : దోచేవారెవరురా!

Dochevarevaru Ra

Dochevarevaru Ra

వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా శివ నాగేశ్వరరావు ఓ ఇమేజ్ ఉంది. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. అయితే… కొంతకాలంగా డైరెక్షన్ కు దూరంగా ఉన్న శివ నాగేశ్వరరావు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ పేరుతో ఓ మూవీ రూపొందించారు. శనివారం అది జనం ముందుకు కొచ్చింది.

ప్రతి మనిషి వేరొక మనిషి చేతిలో ఏదో ఒక రకంగా దోపిడీకి గురవుతూనే ఉంటాడు. కొందరు డబ్బుల్ని దోచుకుంటే… మరికొందరు మాన ప్రాణాలను దోచుకుంటారు. ఇంకొందరు మనసుల్ని దోచుకుంటారు. రాజకీయ నాయకులైతే సమాజాన్నే దోచుకుంటారు. అయితే… ఇందులో అలా రకరకాలుగా దోచుకునే పాత్రలు మనకి కనిపిస్తాయి. ఓ అనాధ పిల్లాడికి మేలైన వైద్యం చేయించడం కోసం హీరో దొంగగా మారి డబ్బులు దోచుకుంటాడు. అదే వ్యక్తి హీరోయిన్ కు సాయం చేసి ఆమె మనసు దోచుకోవాలని చూస్తాడు. అలానే తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై మోజు పడి ఓ అన్న ఆమె శీలాన్ని దోచుకుంటాడు. తనను మోసం చేసి పెళ్ళాడిన వాడి ఆస్తిని అతని భార్య దోచుకుంటుంది. ఓ కిరాయి హంతకుడు డబ్బుల కోసం ఇతరుల ప్రాణాలను దోచుకుంటాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన పాత్రలతో సాగే కథే ‘దోచేవారెవరురా’! ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే… ఆ పాత్రల లోతు తెలుస్తుంది.

ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ఈ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన వాడు కావడంతో కెమెరా ఫియర్ లేకుండా చక్కగా నటించాడు. మలయాళీ బొద్దుగుమ్మ మాళవిక సతీశన్ కూడా ఇంప్రసివ్ గానే ఉంది. ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలలో తన నట విశ్వరూపం చూపించిన అజయ్ ఘోష్ ఇందులో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేశాడు. మూగవాడి సైగలను అర్థం చేసుకోమని ప్రేక్షకులకు పరీక్ష పెట్టకుండా అతని భావాన్ని సబ్ టైటిల్స్ గా వేయడం బాగుంది. అలానే బిత్తిరి సత్తి కిరాయి హంతకుడి పాత్ర పోషించాడు. ఆ పాత్ర ద్వారా వినోదాన్ని అందించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి… ఈ ఇద్దరి మీద చెరొకపాట పెట్టడం విశేషం. యూ ట్యూబర్ ప్రణవి సాధనాల అజయ్ ఘోష్ భార్యగా చలాకీగా నటించింది. ఇతర పాత్రలను ‘జెమిని’ సురేశ్, కోట, భరణి, టార్జాన్, బెనర్జీ తదితరులు పోషించారు. అయితే అందరికంటే ప్రధానం చెప్పుకోవాల్సింది మాస్టర్ చక్రి గురించి. చక్కని హావ భావాలతో ఈ బాలనటుడు మెప్పించాడు. కొన్ని చోట్ల కళ్ళలో నీళ్ళూ తెప్పించాడు. ఆర్లీ గణేశ్ ఛాయాగ్రహణాన్ని, రోహిత్ వర్థన్, కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో లిపిలేని భాషలో శివ నాగేశ్వరరావు రాసిన ఓ పాట ఎండ్ టైటిల్స్ లో వస్తుంది.

మూవీ ప్రధమార్థం సో… సో… గా సాగినా, ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. అన్ని టీమ్స్ నూ గోవాకు షిఫ్ట్ చేసి, క్లయిమాక్స్ లో చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా దర్శకుడు విప్పదీశాడు. శివ నాగేశ్వరరావు గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి వెళితే కొంత నిరాశకు గురి కాక తప్పదు. లాజిక్కుల జోలికి పోకుండా, వినోదం కోరుకునే వారికి కొంత మేరకు ఓకే.

రేటింగ్: 2.25/5

 

ప్లస్ పాయింట్స్

వినోదాత్మక చిత్రం కావడం
గణేశ్‌ ఆర్లీ ఛాయాగ్రహణం
రోహిత్ వర్థన్, కార్తీక్ సంగీతం

మైనెస్ పాయింట్స్

లాజిక్కులు లేకపోవడం
కంగాళీగా సాగే కథనం

ట్యాగ్ లైన్ : దోచుకున్నారు!?

Show comments