Dhimahi Movie Review: ఈ మధ్య కాలంలో భిన్నమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. స్టార్ క్యాస్ట్ ఉన్నా లేకున్నా సినిమాలో కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు. అలా గతంలో 7:11 PM అనే టైం ట్రావెల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు సాహస్ పగడాల. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘ధీమహి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జయ జయ హే మహిషసుర మర్ధిని అనే టాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాను కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ బ్యానర్ పై విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మించగా నవీన్ కంటె, సాహస్ పగడాల డైరెక్ట్ చేశారు. అంటే సాహస్ హీరోగా దర్శక నిర్మాతగా చాలా బాధ్యతలు మీద వేసుకున్నాడు అన్న మాట. ఇక చనిపోయిన వారి ఆత్మలతో మట్లాడడమా అనే కాన్సెప్ట్ ట్రైలర్ లో చూపినప్పటి నుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంది అనేది రివ్యూలో చూద్దాం.
ధీమహి కథ ఏంటంటే:
అమెరికాలో ఒక సర్జన్ గా బిజీ లైఫ్ గడుపుతూ ఉంటాడు కార్తీక్(సాహస్). అతనికి తన అక్క మైత్రి(సౌజన్య), బావ జయదేవ్(శ్రీజిత్ గంగాధరన్), వారి కుమార్తె ధీమహి అలియాస్ మహి(ఆషిక పగడాల) అంటే పంచప్రాణాలు. అయితే హాస్పిటల్ లో పేషేంట్స్ తో లేదంటే అక్క కుటుంబంతో గడిపే కార్తీక్ లైఫ్ లోకి నిధి(నిఖిత కపూర్) ఎంట్రీ ఇస్తుంది. వారి పరిచయామ్ ప్రేమగా మారిన కొన్నిరోజులకే కార్తీక్ మేనకోడలు మహి అనూహ్యంగా కిడ్నాప్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తి ఆమెను చంపేయడంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోతుంది. అయితే మేనకోడలు అలా కావడానికి తానే కారణం అని బాధలో ఉన్న కార్తీక్ నెక్రోమాన్సీ అనే పద్దతితో ఆమె ఆత్మతో మాట్లాడి ఆమె మరణానికి కారణమైన వ్యక్తిని చంపాలని అనుకుంటాడు. అందుకు ఉద్యోగానికి కూడా వెళ్లకుండా రీసెర్చ్ లో పడిపోవడంతో ఆ ఉద్యోగం పోతుంది. ప్రేమ కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమయంలోనే నెక్రోమాన్సీ విషయంలో కార్తీక్ సక్సెస్ అవుతాడు. ఈ క్రమంలో నెక్రోమాన్సీ ద్వారా కార్తీక్ మహి ఆత్మతో మాట్లాడాడా? అసలు మహిని చంపింది ఎవరు? నిధి కార్తీక్ మళ్ళీ కలిశారా? లాంటి విషయాలు తెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
దెయ్యాలు, ఆత్మలు వాటితో తెలుగు సినీ పరిశ్రమకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. ఏడాదికి ఒక్క హారర్ సబ్జెక్ట్ అయినా హిట్ అవుతుంది అంటే మన వాళ్ళు వాటికి ఎంతగా కనెక్ట్ అయిపోయారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఒక్క కాన్సప్ట్ తోనే వచ్చారు ఈ ధీమహి టీమ్. ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్లాల్సిన చిన్నారి అనూహ్యంగా మాయమై, ఆమె శవం కూడా దొరకని పరిస్థితుల్లో తలితండ్రులు ఎలా తల్లిడిల్లిపోతారు? అనే లైన్ తీసుకుని దానికి పురాతన గ్రీస్ రాజు హిస్టరీ కూడా కలిపి ఆసక్తి రేకెత్తించారు. నిజంగానే చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడవచ్చా ? అంటే అవునని, కాదని ఎవరికి తోచిన సమాధానాలు వారు చెబుతారు. సైంటిఫిక్ గా నిజంగా ఆత్మలతో మాట్లాడవచ్చు అని కానీ మాట్లాడలేము అని కానీ ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. హిందు మతం సహా కొన్ని మతాల్లో చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడవచ్చు అని నమ్ముతారు. ఇల్లిల్లు తిరిగి సోది చెప్పేవారు అలాంటి కోవకే చెందుతారు. అయితే ఈ సినిమాలో ఈ నమ్మకానికి సైన్స్ కూడా జోడించి ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. చనిపోయిన చిన్నారి ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించే మేనమామగా కార్తీక్ అందుకోసం ఏమేం చేశాడు లాంటివి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అలాగే అనూహ్యంగా అసలు ఆమెను ఎవరు, ఎందుకు చంపారు అనేది కూడా క్లైమాక్స్ లో రివీల్ చేసి ఆశ్చర్యపరిచారు. అయితే అమెరికా లాంటి దేశంలో ఒక చిన్నారి స్కూల్ నుంచి మిస్ అయితే సీసీ కెమెరాలో ఎక్కడా రికార్డు కాకపోవడం లాంటి లాజిక్స్ పక్కన పెడితే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయింది సినిమా టీమ్.
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సాహస్ పగడాల అన్నీ తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. తన వల్లే తన మేనకోడలు దూరమైందన్న బాధలో వేదన అనుభవించే మేనమామగా, డాక్టర్ గా, నిధి ప్రియుడిగా భిన్నమైన కోణాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక సాహస్ పాత్ర తర్వాత నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది విరాట్ కపూర్ కి. స్టైలిష్ విలన్ గా, క్రూరుడిగా తన నటనతో మెప్పించాడు. ఇక హీరోయిన్ నిఖిత చోప్రా తన అందంతో ఆకట్టుకుంటూనే నటనలో కూడా ఆకట్టుకుంది. సాహస్, నిఖిత కెమిస్ట్రీ కూడా బాగుంది. జేడీ, శ్రీజిత్, సౌజన్య, రీతూ, ముఖ్యంగా చిన్నారి ఆషిక తమ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. చిన్నారి అయితే కొన్ని సీన్స్ లో చాలా బాగా నటించింది. ఇక టెక్నీకల్ టీమ్ విషయానికి వస్తే ఒక పక్క హీరోగా మరోపక్క దర్శకుడిగా అలాగే నిర్మాతగా మూడు బాధ్యతలు భుజాన వేసుకుని సాహస్ అన్నిటికీ న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన నటుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు వేసుకునేలా తన పని తనం చూపించారు. ఆయనతో కలిసి సినిమాను డైరెక్ట్ చేసిన నవీన్ రాసుకున్న కథ బాగుంది కానీ తెరకెక్కించే సమయంలో లాజిక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది. ఇక కెమెరా వర్క్ కూడా సినిమాకు తగినట్టుగా ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ కంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది. ఎడిటింగ్ విషయంలో వంక పెట్టేందుకు ఏమీ లేకుండా క్రిస్పీగా ఎడిట్ చేసుకున్నారు. ఇక నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు ఉన్నాయి.
ఫైనల్లీ: థ్రిల్లర్, సైన్స్ సినిమాలు ఇష్టపడే వారికి నచ్చే సినిమా ఇది.. లాజిక్స్ పక్కన పెడితే ఒకసారి చూసేయచ్చు.