Darja Movie Review :
‘ఒక్కో ఆర్టిస్ట్ దీ ఒక్కో టైమ్ నడుస్తుందని, ఆ సమయంలో వాళ్ళు తెర మీద కనిపిస్తే చాలు జనం ఆదరిస్తార’నే భావనలో కొందరు దర్శక నిర్మాతలు ఉంటారు. అలా ఇప్పుడు అనసూయ టైమ్ నడుస్తోందని కొందరి నమ్మకం. ఆమెతో కీ-రోల్ చేయిస్తే, థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే ఆశతో ఆమెను దృష్టిలో పెట్టుకునే కొందరు కథలు రాసుకుని, సినిమాలు తీస్తున్నారు. అలాంటిదే శుక్రవారం జనం ముందుకొచ్చిన ‘దర్జా’ కూడా! ఆ మధ్య వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సునీల్, అనసూయ భార్యా భర్తలుగా నటించారు. అంతేకాదు… కరడుగట్టిన వ్యక్తులుగా తెర మీద వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ఆ కాంబోను రిపీట్ చేస్తే… జనం చూడక పోతారా అనే ఆశతో ‘దర్జా’ను దర్శకుడు సలీమ్ మాలిక్ తీసినట్టు అనిపిస్తోంది. చిత్రం ఏమంటే… ఇందులో వీళ్ళిద్దరూ జంటగా కాకుండా ప్రత్యర్థులుగా నటించారు. ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
ఈ సినిమా కథ బందరులో జరుగుతుంది. ఆ ఊరిలో కనకం ఓ లేడీ గ్యాంగ్ స్టర్. అమ్మాయిల అక్రమ రవాణ, దొంగసారాతో పాటు పలు అసాంఘిక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. బందరు కు పోర్ట్ రాబోతున్న నేపథ్యంలో ఆమె కన్ను దాని మీద పడుతుంది. పోర్ట్ ను తన ఆధీనంలో ఉంచుకోవడానికి రకరకాల కుయుక్తులు పన్నుతుంది. ఆమెకు చేదోడు వాదోడుగా కవల సోదరుడైన బైరాగి ఉంటాడు. తనకు అడ్డం వచ్చిన ఎమ్మెల్యేనే కాదు పోలీస్ అధికారులను సైతం అంతం చేస్తుంది కనకం. అదే సమయంలో మూగవాడైన గణేశ్, పుష్పను ప్రేమిస్తే, అతని తమ్ముడు రంగ… గంగను ప్రేమిస్తాడు. ఊహించని విధంగా వీళ్ళ జీవితాలు కనకం కబ్జాలోకి వెళ్ళిపోతాయి. ఆమె కబంధ హస్తాల నుండి బయట పడటానికి వీళ్ళు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్ శంకర్ వీళ్ళకు ఎలాంటి సాయం చేశాడు? అతనికి, కనకంకు ఉన్న పాత వైరం ఏమిటీ అనేది మిగతా కథ.
ఆరేళ్ళ క్రితం ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించి, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఆ తర్వాత ‘క్షణం’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా ఐటమ్ సాంగ్స్ తో సహా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ వస్తోంది. చిత్రం ఏమంటే… ఆమె నటించిన ‘రంగస్థలం, పుష్ప’ వంటి సినిమాల్లోని పాత్రలు పేరు తెచ్చిపెట్టాయి కానీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ‘కథనం, థ్యాంక్ యూ బ్రదర్’ వంటివి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయినా… ఆమెతో ప్రయోగాలు చేయడం దర్శక నిర్మాతలు మానలేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. లేడీ డాన్ కనకంగా అనసూయను కొత్తగా చూపించే ప్రయత్నం దర్శకుడు సలీమ్ మాలిక్ చేశాడు. ఆమె వేషధారణ కాస్తంత భిన్నంగా ఉన్నా, ఈ పాత్రలో అనసూయ నటన ఆకట్టుకోలేకపోయింది. డైలాగ్ డెలివరీ అయితే మరీ దారుణం. ఆమె గొంతులో ఎలాంటి ఫోర్స్ లేదు. ఇక కీలక పాత్ర పోషించిన షమ్ము, అరుణ్ వర్మకు, వారి ప్రియురాళ్ళుగా నటించిన అక్సాఖాన్, శిరీష కు నటనలో పెద్దంత అనుభవం ఉన్నట్టే లేదు. అయితే… అక్సాఖాన్ డాన్స్ పెర్ఫార్మర్ అనేది అర్థమౌతోంది. ఆమె పాత్రను దర్శకుడు సరిగా తెర మీద మలచలేదు కానీ… ద్వితీయార్థంలో ఆమెపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ కొరియోగ్రఫీ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమా ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన సునీల్ అక్కడ నుండి కథను తానే నడిపాడు. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ గతంలో కొన్ని సినిమాల్లో చేశాడు. దాంతో ఇందులో కొత్తగా ఏమీ అనిపించలేదు. ఆమని, షకలక శంకర్, షఫీ, సమీర్, శేషు, నాగమహేశ్, మిర్చి హేమంత్, ‘ఛత్రపతి’శేఖర్ వంటి అనుభవం ఉన్న ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. వారిని దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. అలానే పృథ్వీపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు అస్సలు పండలేదు. రాప్ రాక్ షకీల్ సమకూర్చిన ట్యూన్స్ ఒకటి రెండు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం మరీ లౌడ్ గా ఉంది. అంజి ఫైట్స్ సోసో. ఇలాంటి కథలు తెలుగువారికి కొత్త కాదు. అయితే లేడీ డాన్ కథతో తీయడమే కాస్తంత కొత్త. ఆ పాత్రకు అనసూయ ఏ రకంగానూ న్యాయం చేకూర్చలేకపోయింది. అలానే మిగిలిన పాత్రల తీరుతెన్నులూ సక్రమంగా లేవు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలా సాగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఓ సినిమాను తీసి, జనం ముందుకు తీసుకు రాగలిగామనే తృప్తి మాత్రమే దర్శక నిర్మాతలకు ‘దర్జా’తో కలుగుతుంది.
రేటింగ్: 1.5 / 5
ప్లస్ పాయింట్స్
పేరున్న ఆర్టిస్టులు నటించడం
ఫైట్స్
మైనెస్ పాయింట్స్
చాలానే ఉన్నాయి!
ట్యాగ్ లైన్: టైమ్ కబ్జా!