NTV Telugu Site icon

Crazy Fellow Movie Review Telugu : క్రేజీ ఫెలో

Crazy Fellow Review Telugu

Crazy Fellow Review Telugu

Crazy Fellow Movie Telugu Review

యంగ్ హీరో ఆది సాయికుమార్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ శుక్రవారం మరో సినిమా ‘క్రేజీ ఫెలో’ జనం ముందుకు వచ్చింది. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.

అభి (ఆది సాయికుమార్) వదిన (వినోదిని వైద్యనాధన్) చాటు బిడ్డ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నయ్య (అనీశ్ కురువిల్ల) గారాబంతో అతను ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతుంటుంది. దానికి తోడు అభికి కాస్తంత తొందరపాటూ ఎక్కువే. ఎదుటివాళ్ళు చెప్పేది వినకుండా తన మనసుకు నచ్చింది చేసుకుని వెళ్ళిపోతూ స్నేహితులను చిక్కుల్లో పడేస్తాడు. తానూ ఇబ్బందుల్లో పడతాడు. ఈ క్రేజీ ఫెలోని దారిలో పెట్టడం కోసం తన స్నేహితుడి కంపెనీలో ఉద్యోగానికి పంపిస్తాడు అతని అన్నయ్య. అక్కడ కోలిగ్ మధుమతి (దిగంగనా సూర్యవంశీ)తో అతనికి గొడవ అవుతుంది. అదే సమయంలో మరో కొలిగ్ రమేశ్ (నర్రా శ్రీనివాస్) సలహా మేరకు డేటింగ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటాడు. అందులో బాలా త్రిపుర సుందరి అనే పేరున్న అమ్మాయికి రిక్వెస్ట్ పెడతాడు. అభి తన ప్రొఫైల్ పిక్ గా సంపూర్ణేష్ బాబు ఫోటో పెడితే, ఆ అమ్మాయి ఏకంగా సూర్యకాంతం ఫోటోను పెడుతుంది. ఒకరిని ఒకరు చూసుకోకుండా… కేవలం మాటలతో మొదలైన వీరి ప్రయాణం, ప్రేమకు ఎలా దారితీసింది? ఆ తర్వాత పెళ్ళి పీటలు ఎక్కడానికి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? అనేదే ఈ చిత్ర కథ.

కంటికి కనిపించని వ్యక్తిని ప్రేమించడం, ఆ తర్వాత ఒకరి బదులు మరొకరిని ఆ స్థానంలో ఊహించుకోవడం, ముందు వెనుక ఆలోచించకుండా చక చకా నిర్ణయాలు తీసుకోవడం… వీటితో ఎదురయ్యే సమస్యలు సమాహారమే ఈ సినిమా. ఇలాంటి సన్నివేశాలను మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేశాం. ఇది అలాంటి ఓ ముక్కోణ ప్రేమకథే. అయితే ఈ తరానికి కనెక్ట్ అవడం కోసం డేటింగ్ యాప్స్ వంటి వాటిని డైరెక్టర్ కథానుగుణంగా వాడుకున్నాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎలాంటి కొత్తదనం కనిపించదు. పరమ రొటీన్ స్టఫ్ తో మూవీ సాగిపోతుంది. పాట మొత్తాన్ని ఒకేసారి ప్లే చేయకుండా మధ్యలో ఒకటి రెండు సీన్స్ ను యాడ్ చేసి వేయడం కాస్తంత రిలీఫ్ ఇచ్చింది. సంభాషణలు బాగానే ఉన్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ ను మరీ లైటర్ వీన్ లో రాసుకున్నారు. ఫైట్స్ పెట్టకపోతే బాగోదన్నట్టుగా రెండు యాక్షన్ సీక్వెన్స్ ను బలవంతంగా ఇరికించారు. బుర్రతో ఆలోచించకుండా, నోటికి ఏది వస్తే అది మాట్లాడే హీరో మెంటాలిటీ, తద్వారా దర్శకుడు జనరేట్ చేయాలనుకున్న ఎంటర్ టైన్ మెంట్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇక హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య కాన్ ఫ్లిక్ట్ కూడా ప్రీ క్లయిమాక్స్ సమయంలో వస్తుంది. అప్పటి వరకూ టైమ్ పాస్ చేసి, చివరిలో ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీని టక్కున ముగించే ప్రయత్నం చేసేశాడు డైరెక్టర్. పైగా క్లయిమాక్స్ కూడా ఊహకందేదే!

ఆది సాయికుమార్ ఈ యేడాది ఇప్పటికే ‘అతిధి దేవో భవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్’ చిత్రాలలో నటించాడు. మొదటి రెండు డిఫరెంట్ జానర్స్ కు చెందినవి కాగా… ‘తీస్ మార్ ఖాన్’ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇవేవీ ప్రేక్షకాదరణ పొందలేదు. దాంతో ఈసారి యూత్ ఫుల్ లవ్ స్టోరీ ట్రై చేశాడు. ఇదీ ఏమంత గొప్పగా లేదు. తన పాత్ర వరకూ ఆది బాగానే చేశాడు. ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీకి అందం ఉన్నా, నటిగా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇంత వరకూ పడలేదు. ఇందులోనూ ఆమె క్యారెక్టరైజేషన్ సో… సో… గానే ఉంది. మలయాళీ భామ మిర్నా మీనన్ సెకండ్ లీడ్ లో ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నర్రా శ్రీనివాస్, సప్తగిరి వినోదాన్ని పండించే ప్రయత్నం చేశారు. హీరో అన్న, వదినలుగా అనీశ్ కురువిల్ల, వినోదిని వైద్యనాధన్ బాగానే సెట్ అయ్యారు. అయితే తమిళ నటి అయిన వినోదిని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. ఇద్దరు హీరోయిన్ల స్నేహితురాళ్ళుగా ప్రియా హెగ్డే, దీప్తి నాయుడు చేశారు. ఇతర పాత్రల్లో రవిప్రకాశ్, మణిచందన, పవన్ కుమార్, సాయి పంపన, సాయి పమ్మి కనిపిస్తారు. ‘ఏబీసీడీ…’ సాంగ్ లో సింగర్ రోల్ రైడా మెరుపులా మెరిశాడు. నిర్మాత రాధామోహన్ ఆర్టిస్టుల ఎంపిక, మూవీ నిర్మాణం విషయంలో రాజీ పడకపోయినా, కొత్తదనం లేని కంటెంట్ కారణంగా ‘క్రేజీ ఫెలో’ ఏమాత్రం ఆకట్టుకోడు.

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
ఫర్వాలేదనిపించే సంభాషణలు
ఆర్.ఆర్. ధృవన్ నేపథ్య సంగీతం
సతీశ్ ముత్యాల సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ
పేలని కామెడీ
ఊహకందే క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: యూజ్ లెస్ ఫెలో!

 

Show comments