విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా గతంలో కొన్ని సినిమాలు చేశాడు. అయితే, ఆ సినిమాలు హీరోగా నిలదొక్కుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. తాజాగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ అనే సినిమా చేశాడు. దీపావళి సందర్భంగా తమిళనాడులో రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ చేసి, ఈ వారం రిలీజ్ చేశారు. అయితే, ఒక రోజు ముందుగానే మీడియాకి స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శించారు. రజిష విజయన్, అనుపమ పరమేశ్వరన్, పశుపతి, లాల్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
బైసన్ కథ
కిట్టయ్య (ధృవ్ విక్రమ్) ఒక పల్లెలో పుడతాడు. చిన్నప్పటినుంచి కబడ్డీ ఆట మీద ఆసక్తి పెరుగుతుంది. కానీ తండ్రి (పశుపతి) మాత్రం ఈ ఆట మనకొద్దు, ఏదైనా పని చేసుకుని బతుకుదాం అంటూ అతన్ని కబడ్డీ వైపుకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే, పీటీ మాస్టర్‌తో పాటు అక్క రజిష విజయన్ ప్రోత్సాహంతో కిట్టయ్య కబడ్డీ మీద పట్టు పెంచుకుంటాడు. అనునిత్యం కులాల గొడవలతో రగులుతూ ఉండే ఆ ఊరు నుంచి ముందు పట్నానికి, తర్వాత జిల్లా స్థాయికి, రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి ఇండియా తరఫున ఆడే స్థాయికి కిట్టయ్య ఎలా చేరుకున్నాడు అనేది ఈ కథ.
విశ్లేషణ
తమిళ దర్శకులలో ఒక వర్గం ఉంది, వారు అణగారిన వర్గాల కథలను తీసుకుని వాటిని సినిమాలుగా మలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో మారి సెల్వరాజ్ కూడా ఒకరు. ఒక రకంగా చెప్పాలంటే, అణగారిన వర్గానికి చెందిన ఓ కుర్రాడు అనేక కంచెళ్లను, అడ్డంకులను, ఇబ్బందులను దాటుకుని ఇండియా తరఫున ఆడే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే లైన్‌లో ఈ కథ రాసుకున్నాడు మారి సెల్వరాజ్. సినిమా కథ ప్రారంభంలోనే ఇండియా తరపున ఆడుతున్న కిట్టయ్య, తన గతాన్ని గుర్తు తెచ్చుకునేలా ఈ స్క్రీన్ ప్లే రాసుకున్నారు డైరెక్టర్. ఈ క్రమంలో అతని చిన్ననాటి నుంచి ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనే విషయాన్ని చూచాయిగా చూపించారు. ఇక్కడ కులాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, రెండు వర్గాలుగా వేరుపడి కొట్టుకుంటున్న వారిలోనే రెండు కులాలను అంతర్లీనంగా చూపించారు.
నిజానికి రిజర్వేషన్ కోటా విషయం మీద చాలామందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అర్హులు కాని వారికి కూడా రిజర్వేషన్ కారణంగా అవకాశాలు దక్కుతున్నాయని, వారి వల్ల విజయ అవకాశాలు తగ్గిపోతున్నాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రాసుకున్నారు డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి “నీ వల్ల కాదు, కాదు” అంటూ కిట్టయ్య పాత్రను అందరి చేత తొక్కించే ప్రయత్నం చేసి, చివరికి ఆ అందరూ భుజాన ఎక్కించుకునేలా సినిమా నడిపించాడు డైరెక్టర్.
నిజానికి ఇది తమిళ వాసనలు ఎక్కువగా ఉన్న సినిమా. తెలుగువారికి వన్ టైమ్ వాచ్ అనిపిస్తుంది. కానీ ఆ కులాల వ్యవహారం తమిళ ఆడియన్స్ ఆదరించినంతగా తెలుగు ఆడియన్స్ ఆదరించరని చెప్పాలి. “కులం కాదు ఆట ముఖ్యం” అని భావించే ఓ యువకుడికి, ఆటను ముందుకు తీసుకెళ్లడానికి ఎలాంటి పరిస్థితులు సహాయం చేశాయి? తనవారే తనకు శత్రువులైన సమయంలో, వ్యతిరేక వర్గంగా భావించేవారు సాయం చేయడం లాంటి విషయాలు అంతర్లీనంగా, ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. ఒక గ్రిప్పింగ్ స్పోర్ట్స్ డ్రామాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ సినిమాకు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
నటీనటులు & సాంకేతిక వర్గం
ధృవ్ ఈ సినిమాలో ఆకట్టుకునే నటనతో మెస్మరైజ్ చేశాడు. అయితే, అతని కొన్ని హావభావాలలో విక్రమ్ ఛాయలు కనిపిస్తున్నాయి. కావాలని చేస్తున్నాడో లేక అప్రయత్నంగా వస్తుందో తెలియదు కానీ, విక్రమ్‌ను అనుకరిస్తున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే. అనుపమ పరమేశ్వరన్కు పెద్దగా చెప్పుకునే పాత్ర కాదు కానీ ఉన్నంతలో మెప్పించి ఆకట్టుకుంది. రజిష విజయన్‌తో పాటు పశుపతికి బాగా నటించే అవకాశం దొరికింది. ఇక లాల్ పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా రాసుకున్నారు. పాండ్యరాజు అనే క్యారెక్టర్‌లో నటించిన తమిళ డైరెక్టర్ ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులు అందరూ ఎవరో తెలియదు కానీ, తమదైన నటనతో ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, తెలుగు డైలాగ్స్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. పాటలు మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ ఒక సరికొత్త టోన్‌లో ఉంది. నిడివి తగ్గించుకోవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్లీ ఈ ‘బైసన్’ ఓ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా… విత్ హై తమిళ్ నేటివిటీ.