నందమూరి కళ్యాణ్‌రామ్ సొంత బ్యానర్ ఎన్టీయార్ ఆర్ట్స్ లో తీసే సినిమాల విషయంలో ఎప్పుడూ రిస్క్ కు వెనకాడడు. అది ఐదేళ్ళ క్రితం తన తమ్ముడు ఎన్టీయార్ తో తీసిన ‘జై లవ కుశ’ కావచ్చు, తాజాగా నిర్మించిన ‘బింబిసార’ కావచ్చు. విశేషం ఏమంటే… ఈసారి కళ్యాణ్ రామ్ కొత్త దర్శకుడు వశిష్ఠ మీద నూరు శాతం నమ్మకాన్ని పెట్టుకుని కోట్లు ఖర్చు పెట్టి, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఫాంటసీ యాక్షన్ మూవీగా ‘బింబిసార’ను నిర్మించాడు. సో… ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ నుండి వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బింబిసార’ ఎలా ఉందో తెలుసుకుందాం…
ఈ సినిమా కథ గురించి ఏ మాత్రం లోతుకు వెళ్ళినా… సస్పెన్స్ ను విప్పి చెప్పేసినట్టే అవుతుంది. అందుకే జస్ట్ ఔట్ లైన్ మాత్రం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వానికి చెందిన బింబిసార (కళ్యాణ్ రామ్) మదగజ చక్రవర్తి. సామంతులను నయాన, భయాన తన దారిలోకి తెచ్చుకుంటాడు. పక్కనే ఉన్న అస్మక రాజ్యం యువరాణి ఐరా (కేథరిన్)ను తన బందీని చేసుకుంటాడు. అలానే సామంత రాజుల నుండి దోచుకున్న వజ్రవైఢుర్యాలను, బంగారాన్ని ఓ గుహలో దాస్తాడు. ఆ నిధిని బింబిసారుడు తప్పితే వేరెవరూ తెరవలేని విధంగా కట్టడి చేస్తాడు. అలాంటి బింబిసార అనుకోని పరిస్థితుల్లో మాయాదర్పణంలో పడిపోయి… ఈ కాలానికి వస్తాడు. రెండు వేల ఐదువందల సంవత్సరాల తర్వాత ఈ సమాజంలోకి అడుగుపెట్టిన బింబిసారకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మదగజం లాంటి ఆ చక్రవర్తి ఎలా ఓ మామూలు మనిషిగా జీవితాన్ని సాగించాడు? తనలోని అహాన్ని జయించి, ఎలా మానవత్వం వైపు ప్రయాణించాడన్నదే ఈ చిత్ర కథ.
కథగా చెప్పుకోవడానికి ఇది సింపుల్ గా అనిపించినా, సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ప్రేక్షకుల బుర్రకు దర్శకుడు వశిష్ఠ పెద్ద పనే పెట్టాడు. బింబిసారకు చెందిన తిగర్తల సామ్రాజ్య సరిహద్దుల్లో ఈ కథ మొదలవుతుంది. ఈ ప్రారంభాన్ని మిస్ అయితే… సినిమా అర్థం కాదు, చిత్రం ఏమంటే… ఆ తర్వాత కూడా అర్థం కాని అంశాలు ఇందులో చాలానే ఉంటాయి. విఠలాచార్య మూవీలోని మాయలు, మంత్రాలు, చిత్రవిచిత్రాలకు ఇందులో కొదవలేదు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో మొదలైన ఈ కథలో పౌరాణికాల మాదిరి శాపవిమోచనాలు, దానికి బదులుగా వరాలు ఇవ్వడాలు ఉన్నాయి. అలా ఓ వ్యక్తికి వరంగా లభించిన మాయా దర్పణమే ఈ కథను ముందుకూ, వెనక్కు నడుపుతుంది. నిజానికి ఇలాంటి సినిమాలను చూసేప్పుడు లాజిక్కులు ఆలోచించకుండా తెర మీద మ్యాజిక్ ను చూసి ఆనందపడాలి. అలాంటి మ్యాజిక్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. కథ గాడిలో పడటానికి ఓ ఐదు పదినిమిషాలు పడుతుంది. ఇంతలోనే వరీనా హుస్సేన్ ఐటమ్ సాంగ్ వచ్చేస్తుంది. బింబిసార రాక్షస కృత్యాలు, తదనంతర పరిణామాల కాగానే… కథ ఈ కాలంలోకి అడుగుపెడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత తిరిగి తిగర్తల సామ్రాజ్యంలో మొదలై అటూ ఇటూ తిరుగుతూ చివరకు శుభం కార్డు పడిపోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ గొప్ప విషయం ఏమంటే… దర్శకుడు ఈ పెద్ద కథను పే…ద్దగా తీయకుండా సింపుల్ గా నడిపించేశాడు. రన్ టైమ్ తక్కువ ఉండటం ఓ వరం.
ఇలాంటి ట్రైమ్ ట్రావెల్ మూవీస్ గతంలో కొన్ని వచ్చాయి. అయితే వాటితో దీన్ని పోల్చలేం. అలానే మాయాదర్పణంలోకి వెళ్ళిపోయిన బింబిసార ఆ దర్పణంలోంచి ఇన్నేళ్ళ తర్వాత ఎలా బయట పడ్డాడనే దానికి కారణం చూపలేదు. నిద్రలోంచి లేచినట్టుగా ట్రక్ లోంచి బయటకు వచ్చేస్తాడు. ఇక సినిమా ప్రారంభంలో దేవదత్తకు వరంగా లభించిన మాయాదర్పణాన్ని ఓ వ్యక్తి ఎలా పొంది, బింబిసార ఆస్థానానికి తీసుకెళ్ళాడో లింక్ లేదు. పేరుకు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ వారిని సరిగా ఉపయోగించుకోలేదు. అయితే కేథరిన్ పోషించిన ఐరా పాత్ర కొంతలో కొంత మేలు. ఆమె కంటూ ఓ నేపథ్యం ఉంది, అలానే ఓ పాట కూడా! కానీ సీ.ఐ. వైజయంతి పాత్రను పోషించిన సంయుక్త మీనన్ ను చూసి జాలిపడాల్సిందే. పోలీస్ ఆఫీసర్ అయినా… ఎక్కడా ఆమెకు ఖాకీ డ్రస్ వేసే సాహసం దర్శకుడు ఎందుకో చేయలేకపోయాడు. ఆమె పక్కన వెన్నెల కిశోర్ మాట్లాడే డైలాగ్స్ వింటే నిజంగానే వీళ్ళు పోలీసులేనా అనే సందేహం కూడా కొన్నిసార్లు వచ్చేస్తుంది. ఇక ధన్వంతరి గ్రంధం కోసం శాస్త్రి అండ్ సన్స్ చేసే పోరాటం, వారు పడే ఆరాటం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కళ్యాణ్ రామ్ కు మొదటి నుండి భిన్నమైన పాత్రలను చేయడం అంటే ఇష్టం. ఆ విషయంలో రిస్క్ చేయడానికికైనా సిద్ధపడతాడు. ఈ సినిమాను చూస్తుంటే ఇదే బ్యానర్ లో గతంలో వచ్చిన ఎన్టీయార్ ‘జై లవకుశ’ గుర్తొస్తుంది. అందులోనూ ఎన్టీయార్ నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను చేసి మెప్పించాడు. ఇందులో బింబిసారగా కళ్యాణ్ రామ్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. ఆ పాత్ర వరకూ పూర్తి న్యాయం చేకూర్చాడు. ఒక రకంగా ఇది కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో! ఇతర పాత్రలను ప్రకాశ్ రాజ్, కేథరిన్, సంయుక్త మీనన్, భరణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్, అయ్యప్ప శర్మ, సీవీ సుబ్రహ్మణ్యం, చమ్మక్ చంద్ర, శ్రీనివాసరెడ్డి, రాజీవ్ కనకాల వంటి వారు పోషించారు. సాయికిరణ్ ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను ఎందుకు చేశాడో అర్థం కాదు. ఇలా చాలా మందిని దర్శకుడు ఎందుకో సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే తలంపుతో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఉద్దేశ్యపూర్వకంగానే దాచిపెట్టారేమో తెలియదు. ఏదేమైనా… సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంటుంది. కానీ థియేటర్ నుండి బయటకు వచ్చాక… ఏం చూశామో, ఆ సంఘటన ఎందుకు అలా జరిగిందో చెప్పలేని పరిస్థితి.
‘బింబిసార’కు ప్రధాన బలం ఎం. ఎం. కీరవాణి నేపథ్య సంగీతం. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని తన ఆర్.ఆర్.తోనూ, బిట్ సాంగ్స్ తోనూ నిలబెట్టారు. అంతేకాదు ఓ పాటకు ట్యూన్ ఇవ్వడంతో పాటు ఆయనే రాశారు. చిరంతన్ భట్, వరికుప్పల యాదిగిరి ఒక్కొక్క పాటకు స్వర రచన చేశారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ సైతం మూవీని కన్నుల పండువగా మార్చాయి. వాసుదేవ్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. అలానే నిర్మాత హరికృష్ణ చిత్ర నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నది ప్రతి ఫ్రేమ్ చెప్పకనే చెప్పింది. కళ్యాణ్ రామ్ వైవిధ్యమైన నటన కోసం, గ్రాండ్ విజువల్స్ కోసం, ఓ కొత్త అనుభూతిని పొందడం కోసం ఈ సినిమాను చూడొచ్చు!
ప్లస్ పాయింట్
కళ్యాణ్ రామ్ నటన
గ్రాండ్ విజువల్స్
టెక్నీషియన్స్ పనితనం
రన్ టైమ్
మైనెస్ పాయింట్స్
బలహీనమైన కథ
కన్ ఫ్యూజన్ కు గురిచేసే కథనం
హీరోయిన్లకు ప్రాధాన్యం లేకపోవడం
ట్యాగ్ లైన్: వన్ మ్యాన్ షో!