NTV Telugu Site icon

Avatar:The Way of Water Movie Review: అవతార్: ద వే ఆఫ్ వాటర్ (అవతార్ -2)

Avatar 2

Avatar 2

Avatar: The Way of Water Movie Review:ప్రపంచ వ్యాప్తంగా ఓ సినిమా సీక్వెల్ కోసం జనం కళ్ళు ఇంతలు చేసుకొని సుదీర్ఘ కాలం ఎదురుచూడడం అనే అపూర్వ సంఘటనకు తెరతీసిన చిత్రంగా ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’ నిలచింది. విఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరాన్ 2009లో తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం అప్పట్లో విశేషాదరణ చూరగొని, ఈ నాటికీ వరల్డ్ టాప్ టెన్ లో నంబర్ వన్ గ్రాసర్ గా నిలచే ఉంది. ‘అవతార్’ రెండో భాగంగా రూపొందిన ‘ద వే ఆఫ్ వాటర్’ మన దేశంలో డిసెంబర్ 16న విడుదలయింది. డిసెంబర్ 6నే లండన్ లో ప్రదర్శితమైన ఈ చిత్రం ఫ్రాన్స్ లోనూ ఓ ఎనిమిది రోజుల తరువాత వెలుగు చూసింది. కొందరు విమర్శకులు ఫ్రాన్స్ లో ‘అవతార్-2’కు ఆదరణ కరువైందని తమ ఈర్ష్యను ప్రదర్శించారు. నిజానికి డిసెంబర్ 15న ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచెస్ ఉండడం, అందులో ఫ్రాన్స్ కూడా పాల్గొనడం వల్ల సాకర్ ఫ్యాన్స్ ఈ సినిమాను తొలి రోజున వీక్షించలేదు. కానీ, మరుసటి రోజున ఫ్రాన్స్ లోనూ ‘అవతార్’ మేనియా మొదలయింది. మన దేశంలో అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో చరిత్ర సృష్టించింది.

ఇక ‘అవతార్-2’ కథలోకి తొంగి చూడబోయేముందు, తప్పకుండా ‘అవతార్-1’ను గుర్తుంచుకున్నవారికే ఈ సినిమా అర్థమవుతుంది. లేదంటే కాసింత కంగాళీగా ఉంటుంది. అయినప్పటికీ కట్టిపడేసే విజువల్ వండర్ గా జేమ్స్ కేమరాన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథలోకి వద్దాం- భూలోకం నుండి పండోరా గ్రహానికి వెళ్ళిన జేక్ సల్లీ అక్కడివారికి మానవులు అన్యాయం చేస్తున్నారని గ్రహిస్తాడు. తన సొంత మనుషులపైకే ఎదురు తిరుగుతాడు. పండోరాలో ఓ తెగకు చెందిన నాయకుని కూతురు నేతిరిని జేక్ సల్లీ ప్రేమించడం, అక్కడే నిలచిపోవడంతో మొదటి భాగం ముగుస్తుంది. తరువాత జేక్ సల్లీ, తన భార్య నేతిరి తండ్రి తరువాత తానే ఓమటికాయ తెగకు నాయకుడై ఉంటాడు. ఆ దంపతులకు నెటెయమ్, లోక్ కొడుకులు, టక్ అనే కూతురు, కిరి అనే పెంపుడు కూతురు ఉంటారు. వారితో పాటే స్పైడర్ అనే మానవబాలుడు కలసి ఉంటాడు. పండోరాను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా ఉన్న మైల్స్ క్వారిచ్ కొడుకే స్పైడర్. అయితే ఆ బాబును భూలోకం పంపడానికి సరైన సాధనం లభించక పోవడంతో జేక్ చెంతనే ఉంటాడు స్పైడర్. మొదటి నుంచీ పండోరా ప్రకృతివనరులపై కన్నేసిన కొందరు స్వార్థపరులు మళ్ళీ భూలోకం నుండి ఆ గ్రహంపైకి దండెత్తుతారు. వారికి నాయకునిగా క్వారిచ్ నా’వి బాడీతో వస్తాడు. జేక్ గెరిల్లా దాడికి సిద్ధమవుతాడు. క్వారిచ్ మనుషులు జేక్ పిల్లలను బంధిస్తారు. క్వారిచ్ కు స్పైడర్ తన కొడుకే అన్న నిజం తెలుస్తుంది. జేక్ ను మట్టుపెట్టడం, తన కొడుకు స్పైడర్ ను తనతో తీసుకెళ్ళడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంటాడు క్వారిచ్. జేక్ తన కుటుంబాన్ని విడిపించుకొని మెట్కాయినా ప్రాంతానికి వెళతాడు. అక్కడ టోనోవరి, అతని భార్య రోనాల్ పాలిస్తుంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళాక జేక్ కొడుకు లోక్ ఆ ప్రాంతనాయకుని కూతురు సిరేయాతో అనుబంధం పెంచుకుంటాడు. ఇది ఆమె అన్న ఓనంగ్ కు నచ్చదు. లోక్, ఓనంగ్ పోట్లాడతారు. జేక్ సూచనతో వారిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అయితే ఓనంగ్, లోక్ ను తీసుకువెళ్ళి భయంకరమైన జలచరాలుండే చోట పడేస్తాడు. లోక్ ను పాయకన్ అనే జలచరం రక్షిస్తుంది. జేక్ పిల్లలు సముద్రంతో ఎంతో అనుబంధం పెంచుకుంటారు. క్వారిచ్ ఎలాగైనా జేక్ ను అంతమొందించాలనే చూస్తాడు. ఇది స్పైడర్ కు నచ్చదు. అతను తన తండ్రికే వ్యతిరేకంగా పోరాడతాడు. దాంతో క్వారిచ్ స్పైడర్ తన కొడుకు కాదని భావిస్తాడు. కానీ, నేతిరి రుజువు చేస్తుంది. ఇలా మలుపులు తిరిగిన కథ చివరకు ఏమవుతుంది? జేక్ ను అంతమొందించాలనుకున్న క్వారిచ్ ఏం చేశాడు? జేక్ కొత్త ప్రాంతంలో మనగలిగాడా? అక్కడి నాయకుని కొడుకు జేక్ కొడుకు లోక్ ను మళ్ళీ ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా మిగిలిన కథ సాగుతుంది.

‘అవతార్-2’ అక్షరాలా మూడు గంటల పన్నెండు నిమిషాల ప్రదర్శన కాలంతో తెరకెక్కింది. ఇంత సేపా అనుకుంటాం కానీ, నీళ్ళలో మనకు తెలియని ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళతారు జేమ్స్ కేమరాన్. అడుగడుగునా విజువల్ ట్రీట్ ఇచ్చారు. మొదటి భాగం చూడనివారికి కాసింత తికమక అనిపించినా, కాసేపు కథ నడిచాక ఇట్టే అర్థమవుతూ పోతుంది. ‘అవతార్-2’లో పలు భారత కథలు చోటు చేసుకున్నాయనిపిస్తుంది. అలాగే పాత తెలుగు జానపద కథలు కనిపిస్తాయి. అయితే వాటిని నవతరం ప్రేక్షకులు మెచ్చేలా మోషన్ క్యాప్చర్ లో రూపొందించిన తీరు అభినందనీయం. ఇక క్వారిచ్, అతని కొడుకు స్పైడర్ మధ్య గొడవ చూస్తే ఆ మధ్య తెలుగులో వచ్చిన అడివి శేష్ ‘గూఢచారి’ గుర్తుకు రాకమానదు. ఏవి గుర్తుకు వస్తున్నా, అన్నిటినీ మరిపిస్తూ టెక్నాలజీతో మాయ చేశారు జేమ్స్. అందుకు సినిమాటోగ్రాఫర్ పనితనం, మ్యూజిక్ డైరెక్టర్ బాణీలు కూడా తోడయ్యాయి. టిక్కెట్ రేట్లు భారీగా ఉన్నా, సినిమా చూసిన తరువాత ధరకు తగ్గ అనుభూతి కలిగింది అనిపిస్తుంది. ఈ సినిమా చూశాక, మరింత బాగా అర్థం కావడానికి ‘అవతార్-1’ చూస్తారని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
– ఆకట్టుకొనే ఉన్నత సాంకేతి విలువలు
– అడుగడుగునా అబ్బుర పరిచే దృశ్యాలు
– భారతీయతకు దగ్గరగా ఉన్న కథ, కథనం
– ‘టైటానిక్’ తార కేట్ విన్స్లెట్ కనిపించడం
– అన్నిటినీ మించి మేకింగ్ వేల్యూస్

మైనస్ పాయింట్స్:
– ఫస్ట్ పార్ట్ చూడనివారికి కంగాళీగా అనిపించడం
– సినిమా నిడివి పెద్దగా ఉండడం

రేటింగ్: 3/5

ట్యాగ్ లైన్: విజువల్ వండర్

Show comments