ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందించటంతో పాటు నిర్మాతగా మారి దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలసి జీ5 కోసం తీసిన వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. ‘జీ5’ ఓటీటీలో 20న విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉంది? దిల్ రాజు, హరీశ్ ఈ సీరీస్ తో సక్సెస్ అందుకున్నారా? ‘రాధ’ సినిమాతో దర్శకుడుగా ఫెయిల్ అయిన చంద్రమోహన్ కి ఈ సీరీస్ విజయాన్ని అందించిందా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాలో రాణించలేకపోయిన సన్నీ సీరీస్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడా? దిల్ రాజు వారసులుగా హర్షిత్, హన్షిత నిర్మాతలుగా విజయాన్ని దక్కించుకున్నారా? వీటన్నింటికి సమాధానం ఏమిటన్నది చూద్దాం.
కథ విషయానికి వస్తే జగన్ (వీజే సన్నీ) హైదరాబాద్ బస్తీలో యువకుడు. చిన్నతనం నుంచి డబ్బుకి ఇబ్బందులు పడుతూ వస్తున్న ఇతడు అదే బస్తీలో ఉన్న మరో ముగ్గురు యువకులతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాగా డుపుతుంటాడు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యే వీరు నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర ఐరన్ కొట్టేస్తూ పనిలో పనిగా అక్కడ ఉన్న ఓ పాత కారు దొంగిలించి అమ్మేస్తారు. ఇక అందులో పది కోట్ల డైమండ్స్ ఉండటం, వాటి కోసం ఓ గ్యాంగ్ లీడర్ వీరిని పట్టుకుని పది కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో టైమ్ తీసుకున్న జగన్ గ్యాంగ్ ఏటీఎంలకు మనీ లోడ్ చేసే 25 కోట్లు ఉన్న వ్యానును దొంగిలిస్తారు. ఈ కేసును ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న హెగ్డే (సుబ్బరాజు)కి అప్పచెబుతారు. సుబ్బరాజు తన పరిశోధనలో జగన్ గ్యాంగ్ హస్తం ఉందని పసిగడతాడు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తూ అందుకోసం 20 కోట్లు కావాలసిన బస్తీ కార్పొరేటర్ గజేంద్ర (పృథ్వీ), వజ్రాల గ్యాంగ్ లీడర్ కూడా ఈ ఎటిఎమ్ వ్యాన్ మాయం కేసులో అరెస్ట్ అవుతారు? వీరందరినీ ఆరెస్ట్ చేసిన సుబ్బరాజు ఆ డబ్బు రికవరీ చేశాడా? లేక సన్నీగ్యాంగ్ డబ్బును పంచుకుంటుందా? గజేంద్ర ఎఎమ్మెల్లే టిక్కెట్ సంపాదించాడా? అన్నదే ఈ 8 ఎపిసోడ్ల ‘ఎటిఎమ్’ వెబ్ సీరీస్.
‘ఏటీఎం’ వెబ్ సిరీస్ లైన్ బావుంది. బస్తీ యువకులు వారి ఆర్ధిక ఇబ్బందులు వంటివి ఎన్నో సినిమాల్లో సీరీస్ లో చూసినవే. అయితే క్యారక్టర్స్ ను పరిచయం చేసిన తర్వాత ఎటిఎమ్ వ్యాన్ దొంగతనం చేసిన దగ్గరనుంచి ఆసక్తి కరంగా సాగుతుంది. సి.ఐ గా దివ్యవాణి పాత్ర, ఆ పాత్రకు పెట్టిన మెడనొప్పి మేనరిజం, స్టేషన్ లో మెడ పట్టమని కానిస్టేబుల్స్ కి చెప్పటం కూడా పంటికింద రాళ్లులా తగులుతాయి. సుబ్బరాజు ఎంట్రీ తర్వాత కొంచెం స్పీడ్ అందుకుంటుంది. అయితే డ్యూటీ సిన్సియర్ గా చేసే తనని వైఫ్ వదిలి వెళ్ళిపోయిందని చెప్పటం బాగా లేదు. గజేంద్ర పాత్రను పృథ్వీ ఎంతో ఈజ్ తో చేసేశాడు. ఇలాంటివి తనకు కొట్టిన పిండే. ఇక సుబ్బరాజు పాత్ర ఈ సీరీస్ కి ఆయువుపట్టు. దానిని ఎంతో ఎఫెక్టీవ్ గా చేశాడు. జగన్ గా సన్నీ ఓకె. క్లోజ్ ఎక్స్ ప్రెషన్స్ లో ఇంకా ఇంప్రూవ్ కావాలి. తన దోస్త్ లుగా నటించిన కుర్రాళ్ళు కృష్ణ బూరుగుల, రాయల్ శ్రీ, రవిరాజ్ తమ పాత్రలలో ఒదిగిపోయారు. దివి ఫేస్ లో భావప్రకటన శూన్యం. లిప్ లాక్స్ కోసం తనను తీసుకున్నట్లు ఉంది. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథానుగుణంగా సాగింది. అయితే తను అందించిన పాటల్లో ఏ ఒక్కటి ఆకట్టుకునేలా లేదు. మోనిక్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటర్ అశ్విన్ తన కెమెరాకి ఇంకొంచె పదును పెట్టి ఉండాల్సింది. దిల్ రాజు వారసులు హన్షిత, హర్షిత్ నిర్మాతలుగా, హరీశ్ శంకర్ కథ అందించి సమర్పకుడుగా వ్యవహరించిన ఈ సీరీస్ లో అడల్ట్ కంటెంట్ మోతాదు తగ్గించి ఉంటే బాగుండేది. మొదటి 4 ఎపిసోడ్స్ అలా అలా సాగినా, 5వ ఎపిసోడ్ నుంచి ఆసక్తిగా సాగి 8వ ఎపిసోడ్ తో ఒక్కసారిగా సీరీస్ పై ఆసక్తి కలిగి రెండో సీజన్ పై క్యూరియాసిటీ పెంచింది.
రేటింగ్: 2.75/5
ప్లస్ పాయింట్స్
మెయిన్ పాయింట్
నేపథ్య సంగీతం
దొంగపోలీస్ మధ్య హైడ్ అండ్ సీక్ గేమ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఆరంభంలో సాగదీత ధోరణి
స్క్రీన్ ప్లే
అడల్ట్ కంటెంట్
ట్యాగ్ లైన్ : టైమ్ పాస్ ‘ఎటిఎమ్’