NTV Telugu Site icon

Pottel Movie Review: పొట్టేల్ రివ్యూ..అనన్య నాగళ్ళ హిట్ కొట్టినట్టేనా?

Pottel Movie Review

Pottel Movie Review

Pottel Movie Review: అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా పొట్టేల్. ఒక్కసారిగా టైటిల్ తోనే ప్రేక్షకులందరికీ ఆసక్తిని చూరగొన్న ఈ సినిమాని సవారి అనే సినిమా డైరెక్ట్ చేసిన సాహిత్ డైరెక్ట్ చేశాడు. యువచంద్ర హీరోగా నటించిన ఈ సినిమాలో అజయ్ మరో కీలకపాత్రలో నటించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్, రింగ్ రియాజ్ వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడేలా చేసింది. దానికి తోడు ట్రైలర్లో అజయ్ లేడీ గెటప్ సినిమా మీద అంచనాలు మరింత పెంచింది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాకి ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

పొట్టేల్ కథ :
తెలంగాణ ప్రాంతంలో పటేల్ వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజులవి. పెద్ద గంగాధరి (యువచంద్ర) చదువుకోవాలని చేసిన ఎన్నో ప్రయత్నాలు విఫలం కావడంతో తనకు ఇష్టం లేకపోయినా తన కులవృత్తి అయిన గొర్రెలను మేపుతూ జీవితం గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తన గ్రామం ఆచారం ప్రకారం ‘బాలమ్మ’ అమ్మవారి అనుగ్రహంగా ఊరి వాళ్ళు భావించే ‘పొట్టెల్’ని పెంచుతుంటాడు. తన భార్య బుజ్జమ్మ (అనన్య)తో ఒకసారి నువ్వు ఎలాగో చదువుకోలేకపోయావు కూతురునైనా చదివించు అని చెప్పడంతో తన కూతురు సరస్వతి( తనస్వి చౌదరి)ని చదివించాలనే పట్టుదలతో ఉంటాడు. మరోపక్క ఆ ఊరి పెద్ద , బాలమ్మ పూనే భూస్వామి పటేల్ (అజయ్) పెద్ద గంగాదరీతో సహా గ్రామంలో ఉన్నవాళ్ళందరి మీద అజమాయిషీ చెలాయిస్తూ ఎలాంటి రూల్స్ లేకుండా తనకు ఇష్టమైన విధంగా వ్యవహరిస్తుంటాడు. తక్కువ కులం వాళ్ళని తన దగ్గరకి కూడా రానివ్వకుండా అరాచకం చేస్తూ ఉంటాడు. కానీ బాలమ్మ సిగం(పూనకం) వస్తుంది అనే ఏకైక కారణంతో పటేల్ ని ఒక దేవుడిలా కొలుస్తుంటారు. ఆ గ్రామ దేవర ‘బాలమ్మ’ తల్లి పటేల్ కి ఆవహించి పటేల్ ద్వారా మంచి చెడ్డల్ని చెప్తుంది. అయితే కూతుర్ని చదివించాలని గంగాధరి చేస్తున్న ప్రయత్నాన్ని విఫలం చేయడం కోసం బాలమ్మ తల్లి ‘పొట్టెల్’ ని పటేల్ అపహరించి పెద్ద గంగాదరీని ఊరి ముందు దోషిగా పటేల్ నిలబెడతాడు. అయితే పటేల్ కి పెద్ద గంగాధరి అంటే ఎందుకు అంత కోపం? పెద్ద గంగాదరీ పొట్టెల్ ని కనిపెట్టాడా? ఆ ప్రాసెస్ లో పెద్ద గంగాదరీ కి ఎదురైన కష్టాలు ఏంటి? మరి సరస్వతి చదువుకుందా లేదా? సరస్వతి చదువు విషయంలో పెద్ద గంగాధారి ఎందుకు అంతలా రిస్క్ చేశాడు? అసలు పటేల్ కి నిజంగానే అమ్మవారు ఆవహిస్తుందా? చివరికి ఏమైంది? అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథగా చూసుకుంటే ఒక తండ్రి తన కూతురిని చదివించడం కోసం ఎలాంటి కష్టాలకు ఎదురెళ్ళాడు? చివరికి తన కూతురిని ఎలా చదివించాడు అనేదే పాయింట్. దానిని వీలైనంత రా అండ్ రస్టిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎక్కువగా ఇలాంటి తరహా సినిమాలు తమిళంలో వస్తూ ఉంటాయి. కానీ దాన్ని పూర్తిగా తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు సాహిత్. రచయితగా సాహిత్ రాసుకున్న కథ చాలా అద్భుతంగా కుదిరింది కానీ దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో తడబడ్డాడు. ఒకప్పుడు మూఢనమ్మకాలు ఎంత ప్రజలను ప్రభావితం చేసే ఓ చూపిస్తూ అప్పటి జనం చదువు మీద ఎంత శ్రద్ధ చూపించేవారు? వారి వరకు చదువు వెళ్లకుండా ఎలాంటి అరాచక శక్తులు అరాచకాలు చేసేవి? వంటి విషయాలను చాలా కన్వెన్సింగ్ గా చెప్పినట్లు అనిపించింది. ఒకపక్క కొన్ని విషయాలను మూఢనమ్మకాలు అని చెబుతూనే మరొకపక్క దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్లు మనం అనుకునేలా బలులు లాంటివి కోరుకోరు. కానీ అరాచకం పెరిగినప్పుడు వాళ్లే దండించడానికి వస్తారు అని చాలా సింబాలిగ్గా చెప్పాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ రోజుల్లో పుట్టకుండా మంచిపని చేశాం అని ఆ తర్వాత కాలంలో పుట్టిన వారికి అనిపించేలా అప్పటి అరాచకాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే సాధారణంగా ఇలాంటి సినిమాలలో హీరో ఒకానొక దశ వరకు చేతకాని వాడిగా ఉండి ఏదో ఒక సందర్భం వలన బలవంతుడిగా మారతాడు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చివరి సెకను వరకు హీరో బలహీనుడిగా ఉండడమే తెలుగు ఆడియన్స్ కి కాస్త కనెక్ట్ కాని అంశం. అలాగే ఈ సినిమా కథకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అవసరం లేదు కానీ దర్శకుడు ఎందుకో ఆ విధానాన్నే ఎంచుకున్నాడు. ఈ సినిమా ద్వారా దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చాలా మంచిది. ఇవ్వాలనుకున్న సందేశం కూడా మంచిదే కానీ దానిని అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పడంలో తడబడ్డాడు. ముఖ్యంగా చదువు ప్రాముఖ్యత ఆ చదువు దక్కని వారికే తెలుస్తుంది. అలాగే చదువుకోవడానికి మైళ్ల దూరం నడిచి వెళ్లిన వాళ్లకే తెలుస్తుంది. కానీ ఈ జనరేషన్ అలా లేదు. చదువు చాలా ఈజీగా వాళ్లకు దొరికేస్తుంది కాబట్టి చదువు మీద ఇంత డ్రామా అంటే నమ్మడానికి వారికి ఆశ్చర్యంగానే ఉంటుంది కాబట్టి ఈ తరం వారికి ఇలాంటి కథలు చెబితే ఆశ్చర్యం, అనుమానం తప్ప కనెక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్లకి చదువు ఈజీగా దొరకటం వల్ల చదువు కోసం వాళ్ళ పడే తపన ఏంట్రా వీళ్ళు ఓవర్ యాక్టింగ్ అనిపించొచ్చు.బహుశా దర్శకుడు 80 నేపథ్యం ఎంచుకుంది కూడా ఈ చదువు కోసం అప్పటి వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో చెప్పడానికి అనిపిస్తుంది. ఈ సినిమా ఒక సాధారణ ప్రేక్షకుడిగా చూస్తే ఏంట్రా బాబోయ్ ఈ గోల అనిపిస్తుంది. డీటెయిలింగ్ విషయంలో మాత్రం దర్శకుడు కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కథను ఇంకా కొంచెం బెటర్ గా చేయొచ్చు అనిపించొచ్చు. అలాగే మరీ ముఖ్యంగా తెలంగాణకి మాత్రమే కనెక్ట్ అవుతుంది.. ఆంధ్రా నేపథ్యం ఉన్న వారికి నసలా అనిపిస్తుంది.. ఎందుకంటే ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు.. చాలా చోట్ల లాజిక్ లెస్‌ అని కూడా వారికి అనిపించొచ్చు. ఎందుకంటే చదువు కోసం ఇంతలా కష్టపడిన దాఖలాలు ఆంధ్ర నేపథ్యం ఉన్న వారికి ఉండవు కాబట్టి అనిపిస్తే అది మీ తప్పు కాదు. క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం గూజ్ బంప్స్ గ్యారెంటీ మూమెంట్.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కంటే ముందు మాట్లాడుకోవాల్సిన పాత్ర అజయ్ ది. పటేల్ అనే పాత్రలో అజయ్ నటించలేదు జీవించాడు. అజయ్ కనిపించినంత సేపు అతని ఏదో చేసేయాలి అనే అంత కసి ఆడియన్స్ లో పుట్టించాడు అంటే ఎంతలా ఆ పాత్రలో ఇమిడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే అజయ్ యాక్టింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంది. ఇక ఈ సినిమాలో యువచంద్ర నటన చాలా బాగుంది. నిజానికి అనన్య అజయ్ గురించి సినిమాకి వెళ్లిన వారికి యువచంద్ర ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనిపిస్తాడు. అనన్యకి కూడా చాలా మంచి పాత్ర పడింది. అలాగే వీరి కుమార్తె పాత్రలో నటించిన తన్వికి మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. అంతలా ఆమె ఈ పాత్రలో చాలా సహజమైన విధంగా నటించింది.. శ్రీకాంత్ అయ్యంగార్ కి చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. ఇక నోయల్ కి కూడా తనకి బాగా అలవాటైన పాత్ర అయినా కాస్త బరువున్న పాత్ర దొరికింది. రింగ్ రియాజ్ ఇప్పటివరకు కమెడియన్ గా మాత్రమే పరిచయం గాని ఈ సినిమాలో ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించాడు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ టెక్నికల్ టీమ్ మొత్తానికి హీరో సాగర్ చంద్ర. ఆయన అందించిన సంగీతంతో పాటు నేపథ్య సంగీతం సినిమా లెవెల్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. 1980 కాలాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ప్రధానమైన అసెట్స్ లో ఒకటి. టెక్నికల్గా సినిమా చాలా సౌండ్ గా ఉంది. నిర్మాణ విలువల విషయానికి వస్తే నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా ఖర్చుపెట్టినట్లే అనిపించింది.

ఫైనల్లీ పొట్టేల్ మూఢనమ్మకాలతో అణిచివేతకు గురై చదువు కారణంగా బయటపడ్డ ఒక ఊరి కథ. సీరియస్ సబ్జెక్ట్ కావడంతో అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు..

Show comments