అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఆ ఒక్కటి అడక్కు. గతంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా క్లాసిక్ టైటిల్ ని ఈ సినిమాకి రిపీట్ చేయడంతో ఒక్కసారి అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. గతంలో కొంతమంది సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసిన మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రాజీవ్ చిలక చిలకా ప్రొడక్షన్స్ మీద ఈ సినిమాని నిర్మించారు. టీజర్, ట్రైలర్తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ సినిమా ఎట్టకేలకు మే మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
ఆ ఒక్కటి అడక్కు కథ:
విశాఖపట్నంలో నివసించే గణ(అల్లరి నరేష్) పెళ్లి చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటాడు. ఒకపక్క సొంత ఇంట్లోనే తమ్ముడు(రవి కృష్ణ)కు సొంత మేనమామ కూతురుతో(జేమీ లెవర్)నే పెళ్లి అయిపోతుంది. వాళ్ళకి ఒక పాప కూడా ఉన్నా గణాకి మాత్రం పెళ్లి కాదు. పేరుకి ప్రభుత్వ ఉద్యోగం అయినా 50 సంబంధాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటి తరుణంలో మాట్రిమోనీలో అయితే త్వరగా పెళ్లవుతుందని సలహా ఇవ్వడంతో మాట్రిమోనీలో మెంబర్షిప్ తీసుకుంటాడు. అతను చూసిన మొదటి అమ్మాయి సిద్ధి(ఫరీయా అబ్దుల్లా).. ఆమెను గతంలోనే చూసిన గణా మొదటి కలయికలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. అయితే ఆమె మాత్రం తనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని అతన్ని పక్కన పెడుతుంది. చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కొన్నాళ్లు ఆమె వెంటపడిన గణ తర్వాత ఆమెకి ఇష్టం లేదని తెలుసుకుని పక్కకు తప్పుకుంటాడు. అయితే అమ్మ కోసం చివరికి ఒక విడాకులైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సమయంలో సిద్ధి ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని ముందుకు వస్తుంది. ఇక ఆ తర్వాత సిద్ధి గురించి న్యూస్ ఛానల్ లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. గణాకి సిద్ధి గురించి తెలిసిన షాకింగ్ విషయాలు ఏమిటి? ఆ షాకింగ్ విషయాలు తెలుసుకున్న గణ ఏం చేశాడు? చివరికి మాట్రిమోనీలో గణకి వివాహం జరిగిందా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
పెళ్ళికాని వ్యక్తి ఆ పెళ్లి చేసుకునేందుకు పడే తంటాలతో గతంలో మల్లీశ్వరి లాంటి సినిమా వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే సినిమా చేయాలని భావించి ఈ సినిమా చేసినట్టు అనిపించింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాన్ని ఎలాంటి జంకు లేకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. పెళ్లి కాకపోవడం వల్ల సమాజంలో ఎదురయ్యే సవాళ్లు పెళ్లి చేసుకోవడం కోసం పెళ్ళికాని కుర్రాళ్ళు పడే పాటలు ఒకపక్క కామెడీగా చూపిస్తూనే మరోపక్క ఆలోచింపచేసే విధంగా సినిమా ఉంది. నిజానికి ఫస్ట్ ఆఫ్ మొదటి నుంచి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు. పెళ్లిచూపులు, పెళ్లి చేసుకోవడం కోసం నరేష్ పడే పాట్లు అందరిని నవ్విస్తాయి. అయితే కొన్నిచోట్ల కామెడీ క్రింజ్ అనిపించినా కొన్ని చోట్ల మాత్రం సిచువేషన్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. అయితే ఇంటర్వెల్ వరకు కామెడీగా సినిమా మొత్తం నడిచిపోయింది కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేయించే ప్రయత్నం చేశారు. అయితే అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ కాస్త నిజదూరం అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మాట్రిమోనీ పేరుతో జరుగుతున్న కొన్ని రకాల మోసాలను బట్టబయలు చేసి పెళ్ళి కాని వారందరికీ ఒక రకమైన హింట్ ఇచ్చినట్లు అనిపించింది. అల్లరి నరేష్ క్యారెక్టర్ని ప్రతి పెళ్లి కాని కుర్రవాడు ఓన్ చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాయింట్ గా చెప్పాలి అనుకుంటే ఇది ఒక ఆసక్తికరమైన పాయింట్.. కానీ పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూషన్ కుదరలేదేమో అనిపిస్తుంది. అల్లరి నరేష్, జెమీ మధ్య వచ్చే కామెడీ కొన్నిచోట్ల బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్స్ విషయంలో కూడా కేర్ తీసుకుని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది దానలో ఎలాంటి సందేహం లేదు.
నటీనటుల విషయానికొస్తే అల్లరి నరేష్ ఎప్పటిలాగే తనకి బాగా అలవాటైన పాత్ర ఏమో అన్నట్లుగానే నటించి అలరించాడు. వయసు పైబడుతున్నా పెళ్ళికాని కుర్రాడిగా నటించమంటే జీవించాడు. ఇక ఫరియా అబ్దుల్లా ఉన్నంతలో తన పాత్ర న్యాయం చేసింది. అల్లరి నరేష్ తర్వాత ఆ స్థాయిలో నటించే అవకాశం జెమీ లివర్ కే దక్కింది. మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ తెలుగు సినీ పరిశ్రమకు దొరికినట్టు అయింది. అయితే ఆమెకు డబ్బింగ్ చెప్పించే విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక మిగతా పాత్రలలో నటించిన కల్పలత, రవికృష్ణ, అరియానా గ్లోరీ, వైవాహర్ష, అక్సా ఖాన్ , అనీష్ కురువిళ్ళ, హరితేజ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే గోపి సుందర్ అందించిన సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ ఎందుకో క్యాచీగా అనిపించలేదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది. డైలాగ్స్ అందించిన అబ్బూరి రవి పనితనం చాలా చోట్ల కనిపిస్తుంది. చాలా డైలాగులు ఆలోచింపచేసేలా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఇక ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. చిలకా ప్రొడక్షన్స్ నిర్మాణం విలువలు బాగున్నాయి ఎక్కడ మొదటి సినిమా అనిపించేలా లేదు.
ఫైనల్ గా చెప్పాలంటే ఆ ఒక్కటి అడక్కు పెళ్ళికాని వారికి కనెక్ట్ అవుతుంది, ముఖ్యంగా అబ్బాయిలకి. లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఎంజాయ్ చేయొచ్చు.