NTV Telugu Site icon

Music Shop Murthy Review: అజయ్ ఘోష్ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ రివ్యూ.. ఎలా ఉందంటే?

Pm

Pm

గతంలో చాలా సినిమాలు చేసినా పుష్ప సినిమాతో అజయ్ ఘోష్ కి మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో కొండారెడ్డి అనే పాత్రలో నటించిన అజయ్ ఘోష్ హీరోగా మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా తెరకెక్కింది. 50 ఏళ్లు పైబడిన తర్వాత డీజేగా మారాలనుకునే వ్యక్తిగా ఈ సినిమాలో అజయ్ ఘోష్ నటించడం జరిగింది. టీజర్, ట్రైలర్ కట్స్ బాగుండడంతో సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడింది. మరి ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఎంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది మాత్రం రివ్యూలో చూసి తెలుసుకోవాల్సిందే.

మ్యూజిక్ షాప్ మూర్తి కథ: గుంటూరు జిల్లా వినుకొండలో మూర్తి (అజయ్ ఘోష్) ఒక మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఇంటర్నెట్ సోషల్ మీడియా విరివిగా అందు బాటులోకి వచ్చాక మ్యూజిక్ క్యాసెట్లు కొనేవాళ్లు కరువు అయిపోయినా తన దగ్గర ఉన్న మైక్ సెట్ లతోనే జీవనం సాగిస్తూ ఉంటాడు. తన భార్య(ఆమని) ఆ షాపు మూసేసి వచ్చే డబ్బులతో సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్ పెట్టుకోమని కోరుతూ ఉంటుంది. అయితే మ్యూజిక్ మీద ప్రేమతో అదే షాప్ ని లాభాలు రాక పోయినా నడుపుతూ ఉంటాడు. మూర్తి ఒకానొక సందర్భంలో ఒక బర్త్డే పార్టీ కి వెళ్లి అక్కడ సాంగ్స్ ప్లే చేస్తే ఇదే పని డీజేలు చేసి లక్షల తీసుకుంటారు. మీరు ఎందుకు ట్రై చేయకూడదు అని ఒకరు సలహా ఇస్తారు. అయితే ఈజీగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఎలా అయినా డీజే అవ్వాలని మూర్తి అనుకుంటాడు. కానీ వినుకొండ లాంటి ప్రాంతంలో ఎవరు నేర్పిస్తారు? అనుకుంటున్న తరుణంలో అంజన(చాందిని చౌదరి) పరిచయమవుతుంది. స్వతహాగా డీజే అయిన ఆమె మూర్తికి డీజే నేర్పిస్తున్న సమయంలో అనేక అవమానాలకు గురవుతుంది. ఒకానొక సందర్భంలో ఆమె సడన్గా మిస్ అవ్వడంతో మూర్తి మీద కిడ్నాప్ కేసు ఫైల్ అవుతుంది. ఆ సమయంలో తన కలలకు అడ్డంగా భార్య ఉందంటూ మూర్తి అవుట్ బరస్ట్ అవుతాడు. అయితే నీకు నచ్చిన పని చేసుకో పో అంటూ భార్య కూడా అతన్ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా హైదరాబాద్ వచ్చిన మూర్తి డీజే అయ్యే ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే నిజంగానే మూర్తి డీజే అయ్యాడా? అసలు అంజన ఎలా మిస్సయింది? చివరికి అంజన తిరిగి వచ్చిందా? మూర్తి ఏమయ్యాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ; తన అభిరుచి మేరకు ఒక మ్యూజిక్ షాప్ పెట్టుకున్నా, మారిన పరిస్థితుల కారణంగా దాన్ని నడపలేక, వదిలేయలేక ఇబ్బంది పడే పాత్రలో అజయ్ మెరిశాడు. నిజానికి ఇది కొత్త కథ ఏమీ కాదు. అసలు ఏమీ చేయలేడు అనుకునే హీరో పట్టుదలకు పోయి తనకు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని నేర్చుకొని రాష్ట్రస్థాయిలో సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచిన లైన్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం వాటికి కాస్త భిన్నం. ఎందుకంటే 20 లలో చేయడానికి కూడా ఇబ్బంది పడే పనిని 50 లలో చేసి చూపించడమే కాదు. పట్టుదలకు వయసుతో పనిలేదు. అలాగే నిజంగా పనిని ప్రేమిస్తే ఆ పని ఎంత గౌరవాన్ని ఇస్తుంది లాంటి అంశాలను ఆసక్తికరంగా తెరమీద చూపించే ప్రయత్నం చేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అసభ్యతకు అశ్లీల కామెడీకి తావు లేకుండా చాలా ప్లెజెంట్ మూడ్లో సినిమాని తీసుకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లుకు వెళ్లి సినిమా మొదలైనప్పుడు కథలో లేనమైపోతారు. ఇంటర్వెల్ కి భారీ ట్విస్టులు ఏమీ లేకుండానే సెకండ్ హాఫ్ కి లీడ్ తీసుకున్నారు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా మొత్తం ఎమోషనల్ మూడ్ లోకి మారిపోతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా కామెడీగా సరదా సరదాగా సాగిపోయినా సినిమా ఒక్కసారిగా సెకండ్ హాఫ్ కి వచ్చాక సీరియస్ అవుతుంది. మూర్తి డీజేగా ఎదిగిన తీరు తర్వాత మంచి స్థాయిలో ఉన్న సమయంలో భార్య మరణం వంటివి ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. అయితే సినిమా క్లైమాక్స్ లో ఒక భారీ హై వస్తుంది. అక్కడితో సినిమా ముగించకుండా కాస్త మరింత ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు. హై వచ్చిన చోట సినిమాని ముగించి ఉంటే సినిమా రిసల్ట్ మరోలా ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటీనటుల విషయానికి వస్తే అజయ్ ఘోష్ మూర్తి అనే పాత్రలో నటించలేదు జీవించాడు అంతే. ఆయన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాందిని చౌదరి కూడా తనకు బాగా అలవాటు అయిపోయిన తరహా పాత్రలో మెరిసింది. ఆమనికి చాలా కాలం తర్వాత గడుసు పెళ్ళాం పాత్ర దొరకడంతో ఒక రేంజ్ లో ఆడేసుకుంది. ఇక దయానంద్ రెడ్డి, అర్జున్ రెడ్డి అమిత్ పాత్రలు కూడా బాగున్నాయి. మిగతా పాత్రధారులు అందరూ కొత్తవారే అనిపించినా పాత్రల పరిధి మేరకు ఉంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే దర్శకుడికి ఇది మొదటి సినిమా అనిపించలేదు. అనుభవజ్ఞుడైన దర్శకుడిలా నడిపించాడు. ముఖ్యంగా చాలా డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. అలాగే సినిమా నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు అనేలా కథ నుంచి డైలాగ్స్ వరకు రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ మీద గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపించింది. సినిమా పేరే మ్యూజిక్ తో ముడిపడి ఉంది కాబట్టి మ్యూజిక్ మీద ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కొన్ని పాటలు బాగానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా ఇంకా కొంత చేయవచ్చు అనిపించింది.

ఓవరాల్ గా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి ఒక హానెస్ట్ అటెంప్ట్. అశ్లీలతకు తావు లేకుండా ఒక డీసెంట్ ఎంటర్టైనర్.