NTV Telugu Site icon

రివ్యూ : 9 అవర్స్

June

June

 

గతంలో ఆహాలో ఒక్క రాత్రి జరిగే కథతో ‘లెవన్త్ అవర్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ వచ్చింది. ఇప్పుడు తొమ్మిది గంటల్లో జరిగే కథతో బ్యాంక్ రాబరీ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘9 అవర్స్’ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ ‘9 అవర్స్’ కు ప్రముఖ దర్శకుడు క్రిష్‌ షో రన్నర్ గా వ్యవహరించారు. ఆయన ‘గమ్యం’ సినిమాను కన్నడలో రీమేక్ చేసిన జాకోబ్ వర్గీస్; యాడ్ ఫిల్మ్ మేకర్ నిరంజన్ కౌషిక్ ‘9 అవర్స్’ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశారు. క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి దీనిని నిర్మించారు.

ఇది 1985 నాటి కథ. హైదరాబాద్ లోని డక్కన్ ఇంపీరియల్ బ్యాంక్ కు చెందిన మూడు బ్రాంచ్ లలో ఒకే రోజు దాదాపు ఒకే సమయంలో దోపిడీ జరుగుతుంది. ముసారం బాగ్, సైదాబాద్ బ్రాంచ్ లో దోపిడీని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు దొంగలు. అయితే కోఠీ బ్యాంక్ లోకి వెళ్ళిన వారు మాత్రం చిక్కుల్లో పడతారు. బ్యాంక్ నుండి దొంగలు బయటకు వెళ్ళక ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది. దాంతో వారు బ్యాంక్ ను చుట్టుముడతారు. బ్యాంక్ లోని దొంగలను పట్టుకునే పనిని సీఐ ప్రతాప్ (తారక రత్న)కు ఏపీసీ కృష్ణమాచారి (బెనర్జీ) అప్పగిస్తాడు. అతను ఆ పనిలో ఉండగానే మీడియాలోనూ ఈ దోపిడీ విషయం లీకవుతుంది. హైదరాబాద్ హెరాల్డ్ కు చెందిన జర్నలిస్ట్ చిత్రలేఖ (మధుశాలిని) వెంటనే సంఘటనా స్థలానికి చేరుతుంది. అయితే ఈ మూడు బ్యాంక్ రాబరీలను జైలర్ విశ్వనాథ్‌ (వినోద్ కుమార్) ప్లాన్ చేశాడని, అతనికి జైలులో ఉండే ఖైదీ దశరథ్‌ (అజయ్‌) సహకరించాడని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. జైలర్ కు ఇలా బ్యాంకులు దోచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాజమండ్రి జైలు నుండి హైదరాబాద్ జైలుకొచ్చిన దశరథ్‌ నేపథ్యం ఏమిటీ? అసలు అతను ఈ బ్యాంక్ దోపీడీ విషయంలో జైలర్ కు ఎందుకు అండగా ఉన్నాడు? ఖైదీల సాయంతో దోపిడీని చేయాలనుకున్న విశ్వనాథ్‌ పన్నాగం ఫలించిందా? లేదా? ఈ మొత్తం వ్యవహరంలో హోమ్ మినిస్టర్ మునిస్వామి నాయుడు (వడ్డి నాగమహేశ్‌) పాత్ర ఏమిటీ? అనేదే ఈ వెబ్ సీరిస్ కథ.

మూడు బ్యాంకులను, మూడు ముఠాలు ఒకేసారి దొంగతనం చేయడం అనేది ఆసక్తికరమైన అంశమే. అయితే మిగిలిన రెండు బ్యాంకుల దోపిడీనీ జస్ట్ అలా చూపించి వదిలేసి, మొత్తం ఫోకస్ అంతా కోఠీ బ్రాంచ్ పైనే పెట్టారు. నవల ఆధారంగా రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ కావడంతో చాలా పాత్రలు, వాటి నేపథ్యాలను వివరంగా ఒక్కో ఎపిసోడ్ లో చూపిస్తూ వచ్చారు. బ్యాంక్ ఉద్యోగుల జీవితాలనే కాకుండా బ్యాంక్ రాబరీకి వచ్చిన వారి కుటుంబ విశేషాలు తెలిపే ప్రయత్నం చేశారు. అందులో కొందరిది జాలి కొలిపే కథ కాగా, మరి కొందరిది పెద్దంత ప్రాముఖ్యం లేని గతం. ఒక్కో ఎపిసోడ్ ను ఒక్కో గంటగా మనం భావించొచ్చు. ఎందుకంటే మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్ లో ఈ ‘9 అవర్స్’ వెబ్ సీరిస్ సాగుతుంది. చిత్రం ఏమంటే… తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి అయినా ఈ కథ కంచికి చేరదు. కేవలం బ్యాంక్ నుండి దొంగలు పారిపోవడంతో ఈ సీజన్ ముగుస్తుంది. జైలు నుండి బ్యాంక్ రాబరీకి ప్లాన్ చేసిన దశరథ్ అసలు మోటివ్ ఏమిటో ఇందులో రివీల్ చేయలేదు. అలానే దొంగల చేతిలో దెబ్బలు తిన్న సీఐ ప్రతాప్ కు ఏమైందో చూపలేదు. సో… అసలు కథ ఇంకా మిగిలే ఉంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాల నిడివితో ఉంది. అంటే… తొమ్మిది ఎపిసోడ్స్ చూడాలంటే నాలుగున్నర గంటల సమయం వెచ్చించాలి. నిజానికి అంత వర్త్ ఈ వెబ్ సీరిస్ కు లేదు. నిజానికి కథను ఇంతలా సాగదీయకుండా చకచకా దర్శకులు నడిపేయవచ్చు. కానీ ఆ పనిచేయలేదు. దాంతో సీజన్ 2 చూస్తే కానీ పూర్తి స్థాయిలో కథ ఏమిటనేది వ్యూవర్స్ కు అర్థం కాదు.

నటీనటుల విషయానికి వస్తే… తారకరత్న ఇందులో సీఐ ప్రతాప్ గా నటించాడు. గత కొంతకాలంగా అంత ప్రాధాన్యత లేని చిత్రాలలో నటిస్తున్న తారకరత్నకు మంచి అవకాశం లభించినట్టే. అయితే నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకునే సన్నివేశాలేవీ ఇందులో లేవు. పరమ రొటీన్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అతనిది. అతని భార్యగా, విలేకరిగా నటించిన మధుశాలినిదీ అలాంటి పాత్రే. ఈ సినిమాలో నటనకు కాస్తంత స్కోప్ దక్కిందంటే జైలర్ గా నటించిన వినోద్ కుమార్ కు, జైలులో ఖైదీగా ఉండి బ్యాంక్ రాబరీకి పథక రచన చేసిన అజయ్ కే! అలానే బ్యాంక్ దోపిడీ చేసే బృందంలోని జ్వాలా కోటి, శ్రీతేజ్, రవివర్మ తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. బ్యాంక్ సిబ్బందిగా రాజ్ మాదిరాజు, అంకిత్ కొయ్య, ప్రీతి అస్రాని, పార్వతి నిర్బన్, గిరిధర్ తదితరులు నటించారు. గిరిధర్ ఇందులో కాస్తంత విలనిజాన్ని ప్రదర్శించడం విశేషం. ఇతర ప్రధాన పాత్రల్లో మోనికా రెడ్డి, రవిప్రకాశ్, శ్రీహర్ష, ప్రభు, చిత్రం శ్రీను, సమీర్, జెమినీ సురేశ్, రూప హెగ్డే, రోహిణి ఇలా చాలామంది నటీనటులు నటించారు. సమీర్ చేసిన హీరో చంద్రశేఖర్ పాత్ర నుండి బోలెడంత కామెడీని సృష్టించొచ్చు కానీ దర్శకులు ఆ పని ఎందుకో చేలేదు. నటీనటులందరి నుండి చక్కని నటననైతే రాబట్టుకున్నారు. బట్ కథనం పేలవంగా సాగింది. తర్వాత ఏం జరుగుతుందోననే ఉత్కంఠను కలిగించడంలో వారు ఫెయిల్ అయ్యారు. గతంలో వచ్చిన ‘లెవన్త్ అవర్’ బిజినెస్ టైకూన్స్ మధ్య జరిగే వార్ అయితే… ఇది బ్యాంక్ రాబరీ నేపథ్యంలో జరిగే కథ. అది సోఫెస్టికేటెడ్ వెబ్ సీరిస్ కాగా… ఇది వింటేజ్ ఫీల్ కలిగించే వెబ్ సీరిస్. ఆ రకంగా మూడు దశాబ్దాల కాలం నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు బాగానే చూపించారు. సంభాషణలు సైతం సహజంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. టెక్నీషియన్స్ పనితనం చెప్పుకోదగ్గది. బట్… రెండో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆసక్తిని అయితే కలిగించలేకపోయారు. వీకెండ్ లో టైమ్ దొరికితే, ఓసారి చూడొచ్చు!

రేటింగ్ : 2.75 / 5

ప్లస్ పాయింట్స్
మల్లాది నవల కావడం
పేరున్న ఆర్టిస్టులు నటించడం
టెక్నికల్ వాల్యూస్ ఉండటం

మైనెస్ పాయింట్స్
సాగదీసిన కథనం
ఉత్కంఠ కలిగించలేక పోవడం

ట్యాగ్ లైన్: టైమ్ చూసుకోవాల్సిందే!