NTV Telugu Site icon

777 Charlie Movie Review: ‘777 చార్లీ’ (కన్నడ డబ్బింగ్)

Charlie

Charlie

కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ’ మూవీతో తెలుగు వారి ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు ‘777 చార్లీ’తో రక్షిత్ శెట్టి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. విశేషం ఏమంటే.. ఈ సినిమాకు రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

కథగా చెప్పుకోవాలంటే చాలా సింపుల్. ధర్మ (రక్షిత్ శెట్టి) చిన్నప్పుడే యాక్సిటెండ్ లో తల్లిదండ్రులను, చెల్లిని కోల్పోతాడు. దాంతో ఒంటరి బ్రతుకు అతనికి అలవాటైపోతుంది. నా అనేవాళ్లు లేకపోవడంతో కాస్తంత మొరటుగానే ప్రవర్తిస్తుంటాడు. అయితే తన వరకూ తనదే కరెక్ట్ అనుకుంటాడు. కానీ ఎదుటి వాళ్ళకు అతను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్.. ఇదే అతని ప్ర‌పంచం. అలాంటి వ్యక్తి ఇంటిలోకి ఓ కుక్కపిల్ల ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అతని జీవితం ఎలా మారిపోయిందన్నదే ‘777 చార్లీ’ కథ.

ఈ ప్రపంచంలో విశ్వాసంగా ఉండే జంతువు ఏదైనా ఉందంటే అది కుక్కే అని చాలామంది చెబుతుంటారు. రక్తం పంచుకుని పుట్టినవాళ్ళు కూడా ఓ దశలో వదిలి వెళ్ళిపోతారేమో కానీ పిడికెడు అన్నం పెట్టినందుకు కుక్క విశ్వాసంతో కడవరకూ కాచుకుని ఉంటుందని అంటారు. అలాంటి పెంపుడు కుక్కల మీద గతంలో చాలానే చిత్రాలు వచ్చాయి. తన యజమాని చావుకు కారణమైన వ్యక్తుల మీద పగ తీర్చుకున్న కుక్కల సినిమాలూ బోలెడన్ని ఉన్నాయి. తెలుగులో ఆ మధ్య రాజేంద్ర ప్రసాద్ హీరోగా హరి రామజోగయ్య ‘టామీ’ అనే సినిమా తీశారు. ఓ నెలన్నర క్రితం సూర్య, జ్యోతిక తమ సొంత బ్యానర్ పై అరుణ్‌ విజయ్ తో ‘ఓ మై డాగ్’ అనే మూవీ నిర్మించారు. ‘కుక్క విశ్వాసజీవి’ అనే స్థాయి దాటి, వాటి అనారోగ్యం కారణంగా యజమానులు ఎంత మనోవేదనకు గురి అవుతారో ఆ సినిమాలో చూపించారు. అందులో కుక్క పిల్లకు కంటి చూపు ఉండదు. ఇప్పుడీ ‘777 చార్లీ’లో కుక్కపిల్లకు క్యాన్సర్ సోకుతుంది. మొదట్లో ఆ కుక్క పట్ల విముఖత చూపిన ధర్మ.. ఆ తర్వాత అదే ప్రాణంగా బతుకుతాడు. మంచుపర్వతాలంటే చార్లీకి ఇష్టమని తెలిసి, దానిని తీసుకుని హిమాలయాలకు ప్రయాణమౌతాడు. అది చనిపోయే లోపు అక్కడకు తీసుకెళ్ళాలన్నది అతడి కోరిక. ఓ రకంగా ఇది పెంపుడు కుక్కతో హీరో చేసిన రోడ్ జర్నీ మూవీ అని చెప్పాలి. ఆ ప్రయాణంలో ధర్మాకు ఎదురైన తీపి, చేదు అనుభవాలను దర్శకుడు కె. కిరణ్ రాజ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

రక్షిత్ శెట్టి గత చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ తరహాలో ఇది కూడా వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. జీవితంలో తగిలిన ఊహించని ఎదురుదెబ్బలకు రాటుతేలిన వ్యక్తిగా రక్షిత్ బాగానే నటించాడు. డాగ్ ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ గా సంగీత శ్రింగేరి నటించింది. సెకండ్ హాఫ్ లోని రోడ్ జర్నీలో ఆమె కూడా పాలుపంచుకోవడంతో మూవీ కాస్తంత కలర్ ఫుల్ గా మారింది. అలానే నేషనల్ అవార్డ్ విన్నర్ బాబీ సింహా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం ఆసక్తిని కలిగించింది.

పెంపుడు కుక్కలు, అవి యజమానుల పట్ల చూపించే విశ్వాసం, అప్పుడప్పుడు వారి ప్రాణాలను సైతం కాపాడటం వంటి సన్నివేశాలను మనం గతంలోనే కొన్ని సినిమాలలో చూసి ఉండటం వల్ల అది కొత్తగా అనిపించదు. కానీ ఓ కుక్క కోసం సెంటిమెంటే లేని వ్యక్తి హిమాలయాల వరకూ వెళ్ళడం, దాని ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని తపన పడటం కాస్తంత కదిలిస్తుంది. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, నోబిన్ పాల్ రీరికార్డింగ్ బాగున్నాయి. అలానే రోడ్ ట్రిప్ సమయంలో వివిధ భాషలకు సంబంధించిన గీతాలను పెట్టడం ఆసక్తికరంగా ఉంది. బట్ డాగ్ లవర్స్ కనెక్ట్ అయినట్టుగా ఈ సినిమాకు మిగిలిన వారు కనెక్ట్ కావడం కాస్తంత కష్టమే!

రేటింగ్: 2.5 / 5

ప్లస్ పాయింట్స్
పెట్ యానిమల్ స్టోరీ కావడం!
ఆకట్టుకునే క్లయిమాక్స్
సినిమాటోగ్రఫీ, ఆర్.ఆర్.

మైనెస్ పాయింట్
ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం
నిడివి ఎక్కువ ఉండటం

ట్యాగ్ లైన్: డాగ్ లవర్స్ కు మాత్రమే!