Site icon NTV Telugu

Off The Record: ముస్తఫా నుంచి నేతలు ఎందుకు జారుకుంటున్నారు?

Maxresdefault (2)

Maxresdefault (2)

ముస్తఫా దగ్గర నుంచి జారుకుంటున్న నేతలు..కారణం ఏంటో తెలుసా ? | OTR | Ntv

కొండ నాలుకకు మందు వేస్తే…ఉన్న నాలుక ఊడిపోయినట్లుంది ఆ ఎమ్మెల్యే పరిస్థితి. తాను అనుకున్న వారసత్వ రాజకీయ ప్రమోషన్ తనకే ఎదురు తిరగడంతో…నియోజకవర్గంలో పరువు పోతుందట ఆ ప్రజాప్రతినిధికి. ఇక ఈయన పోటీ చేయరు. ఈయనతో మనకేంటి అంటూ…ఇప్పటి వరకు దండాలు పెట్టిన అధికారులు…మెల్లగా ముఖం చాటేస్తున్నారట. ఎమ్మెల్యేకు పవర్‌ పోయిందని తెలిసిన జనం…మీరు మాకు ఏం చేశారంటూ…ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తున్నారట. దీంతో ఎరక్కపోయి…ఇరుక్కుపోయాను అంటూ దిగాలు పడుతున్నాడట ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే…ఏంటా కథ.

రెండు సార్లు గెలిచేసరికి…పదవి మీద మెహం మొత్తిందా లేక..దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనుకుంటున్నారో ఏమో కానీ..ఆ ఎమ్మెల్యే కొత్త రూట్‌ ఎంచుకున్నారు. 2014కు ముందు ఎమ్మెల్యే కావడానికి సీటు కోసం ఎక్కే గడప దిగే గడప అన్నట్లు ప్రయత్నించిన గుంటూరు ఈస్ట్‌ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా…2014, 2019లో వరుసగా రెండుసార్లు గెలిచారు. మొన్నటి కేబినెట్‌ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి అవుతారని కూడా ఊహాగానాలు వచ్చాయ్.

ఇపుడు ముస్తఫా రూట్‌ మార్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. అంతేనా…తన వారసురాలిగా కూతుర్ని బరిలో నిలబెడతానని చెప్తున్నారు. ఎక్కడికెళ్లినా ఆమెను తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. మొదట్లో లైట్‌ తీసుకున్న జనం…ముస్తఫాను చూసి ఈయనకు పోటీ చేసే ఆసక్తిపోయినట్టుందని డిసైడ్‌ అయ్యారు. అంతవరకు అనుకుంటే బాగానే ఉండేది. త్వరలో పదవి పోయే ఎమ్మెల్యే వెనక తిరిగితే ఏం వస్తుందనుకున్నారేమో… ఎమ్మెల్యేను పట్టించుకోవడం మానేశారట. అంతేకాదు ఆయన కంటపడితే చాలు…రెండుసార్లు గెలిచేసరికి ఏం చేశారంటూ నిలదీస్తున్నారట.

అధికారులు కూడా ఎమ్మెల్యే మాటలకు చేతలకు ఎందుకు వచ్చిన కర్మరా బాబు…అని ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా తలవంచుకొని వెళ్తే సరిపోతుందిలే అనుకునే వారు….కానీ ఎప్పుడైతే ముస్తఫా వచ్చే ఎన్నికల్లో తన పోటీ చేయడం లేదని చెప్పాడో అప్పటి నుంచి నియోజకవర్గంలో ముస్తఫాకు పట్టు సడలిపోతుంది. అధికారులు పనులు చేయడం లేదు ,ప్రజలు గౌరవం ఇవ్వడం లేదు.

తాను ఎమ్మెల్యేగా ఉండగానే…తన కూతుర్ని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది నేను కాదు… నా కూతురికి సీట్ ఇవ్వబోతున్నారు. అధిష్టానం కూడా క్లారిటీ ఇచ్చేసిందని ఊరువాడ చెబుతున్నాడట. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ముస్తఫా కాదు కదా? ఆయన కూతురికి సీటు ఇచ్చిన గెలుస్తుందో లేదో చెప్పలేమని…ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి గౌరవం ఇస్తారని… వాళ్ళ తండ్రులకి, తమ్ముళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈ విషయం తెలుసుకున్న అధికారులు…ఇప్పుడు ఎమ్మెల్యే ముస్తఫా పనులు చెప్తున్నా సున్నితంగా తిరస్కరిస్తున్నారట. ఎమ్మెల్యేగా ఉన్న గౌరవాన్ని సొంత ప్రచారంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడనే చర్చ నడుస్తోంది.

ఒకవేళ తన కూతుర్ని రాజకీయ వారసురాలుగా చేద్దామనుకుంటే…ఎన్నికలకు ఓ నెల ముందు లేదా రెండు నెలల ముందు ప్రకటిస్తే బాగుండేది. ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహారశైలితో అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం…జరుగుతున్న డామేజ్‌ని గుర్తించిన ఎమ్మెల్యే అనుచరులు… ఇదెక్కడ గొడవరా బాబు ? ఎమ్మెల్యేగా ఉంటేనే చెప్పిన మాట వినని అధికారులు… ఇప్పుడు పనులే చేయడం లేదు, ఏ పని అడిగినా నిబంధనలు, టైం లేదు బిజీ బిజీ అంటూ అడ్డతిరుగుతున్నారట.

చిన్న చిన్న పనులు కూడా కాక…నియోజకవర్గంలో ప్రజలు ముందు చులకన అయిపోతున్నామని లోలోపల మదనపడుతున్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వారసురాలిగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే కుమార్తెకు కూడా…ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో గడ్డు పరిస్థితులు వస్తాయని చర్చలు జరుగుతున్నాయ్. పలువురు నేతలు ముస్తఫా దగ్గర నుంచి జారుకుంటున్నారట. డామేజ్‌ను గుర్తించిన ముస్తఫా…తాను ముందస్తుగా చేసుకున్న వారసత్వ రాజకీయ ప్రచారం…తనకే ఏకు మేకైందని వాపోతున్నారట. మరి ముస్తఫా బాధలకి ,ముందస్తు ప్రచారానికి అధిష్టానం ఏ విధంగా మందేస్తుందో చూడాలి…..

Exit mobile version