Site icon NTV Telugu

కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేలు…

కేబినెట్‌లో చోటుకోసం ఎదురు చూస్తోన్న వైసీపీ ఎమ్మెల్యేలను రెండున్నరేళ్ల గడువు ఊరిస్తోంది. జిల్లాల నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రేస్‌లో వెనకబడకుండా.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు శాసనసభ్యులు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అలాంటి వారిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కర్నూలు జిల్లా నుంచి కేబినెట్‌లో చోటుదక్కేది ఎవరికి?

రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌ ఏర్పాటుకాగానే.. మొదటి జాబితాలోనే మంత్రి కావాలని ఆశించినవారు అనేక మంది. సీనియర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు సీరియస్‌గానే ప్రయత్నించారు. కానీ.. రాజకీయ, సామాజిక సమీకరణాలు వారి ఆశలకు గండికొట్టాయి. కాకపోతే రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని నాడు.. సీఎం జగన్‌ చేసిన ప్రకటన వారికి ఊరటనిచ్చింది. ఇప్పుడా సమయం దగ్గర పడుతుండటంతో మంత్రివర్గంలో చోటుకోసం సీనియర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. కర్నూలు జిల్లా నుంచి కేబినెట్‌లో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిలో ఎవరిని మారుస్తారో ఏమో.. జిల్లాలో కొత్తగా రేస్‌లో ఉన్నవారి సంఖ్య మాత్రం భారీగానే ఉంది.

ఆరోసారి ఎమ్మెల్యేగా ఉన్న రాంభూపాల్‌రెడ్డికి ఛాన్స్‌ ఉంటుందా?

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రస్తుతం ఆరోసారి ఎమ్మెల్యే. YS సీఎంగా ఉన్న సమయంలోనే మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ‘నేను ఉన్నాను కదా.. నీకు మంత్రి పదవి అవసరమా?’ అని నాడు వైఎస్‌ అనడంతో రాంభూపాల్‌రెడ్డి మిన్నకుండిపోయారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచినా మంత్రి కాలేకపోయాననే బాధ అలాగే ఉండిపోయింది. దీంతో ఈసారి ఎలాగైన బెర్త్‌ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారట. సీనియరిటీని సీఎం జగన్‌ గుర్తిస్తారని.. తనకు న్యాయం చేస్తారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట రాంభూపాల్‌రెడ్డి. ఓ సందర్భంలో సీఎం జగన్‌ను కలిసినప్పుడు..తనను దృష్టిలో ఉంచుకోవాలని కూడా ఆయన కోరారట.

కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ఆశలో చక్రపాణి రెడ్డి

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా నాడు మంత్రివర్గంలో చోటు కోసం వైసీపీ ముఖ్యులతో తీవ్రంగా ప్రయత్నించారట. అప్పట్లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో వైసీపీలో చేరేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు చక్రపాణి రెడ్డి. టీడీపీ మండలి ఛైర్మన్‌ పదవి ఆఫర్‌ చేసినా వదలుకొన్నానని చెబుతూ.. వైఎస్‌ కుటుంబంలో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తున్నారట. చక్రపాణి సైతం ఈ దఫా తప్పకుండా మంత్రి అవుతాననే గట్టి నమ్మకంతో ఉన్నారట.

సాయి ప్రసాద్‌రెడ్డి కోసం సాయం పడుతున్న సోదరులు!

ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి సైతం కేబినెట్‌లో చోటు కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. ఆయన మూడోసారి ఎమ్మెల్యే. సాయి ప్రసాద్‌రెడ్డి సోదరుల్లో బాలనాగిరెడ్డి మంత్రాలయం, వెంకట్రామిరెడ్డి గుంతకల్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తమ కుటుంబం నుంచి సాయి ప్రసాదరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సోదరులు కూడా కృషి చేస్తున్నారట. కర్నూలు జిల్లా నుంచి ఈ దఫా ఎంత మందికి చోటు దక్కుతుందో కానీ.. రేస్‌లో ఉన్నవారంతా సీనియర్లే. అందుకే మంత్రివర్గం నుంచి అవుటయ్యేది .. కొత్తగా ఎంట్రీ ఇచ్చేది ఎవర్నది ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version