Site icon NTV Telugu

YCP : ఏలూరులో వైసీపీకి దిక్కు లేకుండా పోయిందా?

New Project (42)

New Project (42)

ఆళ్ల నాని. మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం. ఏలూరు ఎమ్మెల్యే. సీఎం జగన్‌కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో కినుక వహించారో ఏమో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్‌ పెంచుకోవాలని సీఎం జగన్‌ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో చలనం లేదని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. తీరు మారని నేతలపై వేటు తప్పదని హెచ్చరించినా ఆయన పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదట. ఎందుకలా అన్నదే ఏలూరు వైసీపీ శ్రేణుల్లో ప్రశ్న.

గడప గడప కార్యక్రమం చేపట్టని జీరో పెర్‌ఫార్మెన్స్‌ లిస్ట్‌లో ఆళ్లనాని ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంఛార్జులు ఫీల్డ్‌లోకి వెళ్లాని సీఎం జగన్‌ చెప్పారు. కానీ.. ఏలూరులో మాత్రం ఆళ్లనాని కిందిస్థాయి నాయకులకు సరికొత్త ఆదేశాలు ఇచ్చారని చర్చ జరుగుతోంది. సమస్యలన్నీ తీరాక తాపీగా తానొస్తానని కేడర్‌కు చెప్పారట. అయితే కందకు లేని దురద కత్తికి ఎందుకని స్థానిక నేతలు ఎవరి పనుల్లో వారు బీజీగా ఉంటున్నారట. దీంతో ఏలూరులో వైసీపికి దిక్కు మొక్కు లేకుండా పోయిందనేది శ్రేణులు ఆవేదన.

అధినేతకు విధేయుడిగా ఉండే ఆళ్ల నాని.. జనంలో లేకుండా పోవడం స్థానికంగా వైసీపీకి పెద్ద సమస్యగా మారుతోందట. జనంలో తిరగకుండా విధేయత ప్రదర్శిస్తే కలిగే లాభం ఏంటన్నది కేడర్‌ ప్రశ్న. దీంతో ఆయనపై అసంతృప్తి పీక్స్‌కు చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏలూరులో ఆళ్ల నానికి తప్ప మరొకరికి అవకాశం ఉండకూదనేట్టుగా మాజీ మంత్రి వైఖరి ఉంటుందని.. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఆళ్లనాని పోటీ చేస్తారో లేదో అనే అనుమానం కొందరిలో ఉందట. ఆ కారణంగానే లోకల్‌ లీడర్స్‌ను ఫీల్డ్‌లోకి వెళ్లాని చెబుతున్నారేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు.

పార్టీ అజెండాలను పక్కనపెట్టి సొంత అజెండాతో ముందుకు వెళ్లడం వల్లే ఆళ్లనానికి మంత్రి పదవి కొనసాగించలేదని కొందరి వాదన. ఇప్పటికే కిందిస్థాయి నేతలు నాని పేరు చెబితే అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఛాన్స్ దొరికితే రివేంజ్‌ కోసం చూస్తున్నారట. ఈ విషయాలన్నీ తెలిసినా ఆళ్ల నాని ఎందుకు మనసు మార్చుకోవడం లేదో అంతుచిక్కడం లేదట పార్టీ పెద్దలకు. ఏలూరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారట తాడేపల్లిలోని పార్టీ పెద్దలు. ఏలూరు విషయంలో వైసీపీ అధిష్ఠానమే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరందుకుంది. మంత్రిగా ఆళ్లనాని ప్రొగ్రస్‌.. ఆ పదవి పోయాక ఆయన అనుసరిస్తున్న వైఖరిని ఎప్పటికిప్పుడు వడపోస్తున్నట్టు చెబుతున్నారు. మరి.. మాజీ మంత్రి విషయంలో పార్టీ ఏం చేస్తుందన్నది కాలమే చెప్పాలి.

 

Exit mobile version