Site icon NTV Telugu

ఎమ్మెల్సీ సీటు కోసం అనంత వైసీపీ నేతల పైరవీలు !

ఆ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటం ఒక్కటే. ఎమ్మెల్సీ మాకు కావాలంటే మాకు కావాలని ట్రై చేస్తున్నారు. గతంలో చేసిన త్యాగాలు.. ప్రస్తుతం తమ పొజిషన్.. ఫ్యూచర్‌లో ఎదురయ్యే సమస్యలు ఏకరవు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు ఎక్కని వాహనం.. దిగని వాహనం లేదన్నట్టు క్యూ కడుతున్నారట. ఎవరా నాయకులు? పార్టీ పెద్దలు వారికిచ్చిన హామీలేంటి?

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్‌

అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ఎమ్మెల్సీ పదవి కోసం అనంతపురం జిల్లాలో నలుగురు కీలక నేతలు వెయిట్ చేశారు. ప్రత్యేకించి గవర్నర్ కోటా కోసం ఎంతో ఆత్రంగా చూశారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ వేశారు. వారే గురునాథ్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, శమంతకమణి. ఈ నలుగురు జిల్లా వైసీపీలో ముఖ్య నేతలు. గతంలో ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా పని చేసిన వారే.

read also : రెండు నెలల్లో కొత్త పాలకమండలి ప్రకటిస్తారా?

గురునాథ్‌రెడ్డికి సీఎం జగన్‌తో అంతా సెట్‌ అయినట్టు టాక్‌!

అనంతపురానికి చెందిన గురునాథ్ రెడ్డి కుటుంబం వైఎస్ ఫ్యామిలీకి దగ్గర. అందుకే గత ఎన్నికల్లో ఆయన సోదరుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. గురునాథ్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. జగన్ వెంట నడిచిన వారిలో ముఖ్యుడు. అయితే టీడీపీలోకి వెళ్లారు. దీంతో సీఎం జగన్‌కు గురున్నాథరెడ్డి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల అది మళ్లీ సెట్ అయిందని టాక్. ఈసారి మంచి అవకాశం ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ సీటు కోసం విశ్వేశ్వర్‌రరెడ్డి యత్నం!
మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అదే ప్రయత్నం

ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి. గత ప్రభుత్వంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. విశ్వా మాత్రం జగన్ వెంటే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఉరవకొండలో ఓడిపోవడం.. స్థానికంగా మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మరో నేత మధుసూదన్‌తో విబేధాలు రావడం వల్ల చాలా పరిణామాలు జరిగాయి. ఈసారి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని విశ్వా కోరినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనకు కూడా ఎమ్మెల్సీ కావాలని అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట.

మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్న శమంతకమణి

మరో సీనియర్ నేత శమంతకమణి. రాజకీయ ప్రవేశం కాంగ్రెస్‌లోనే అయినా.. ఆ మధ్య మండలిలో జరిగిన గొడవ వరకు టీడీపీతో ఉన్నారు. టీడీపీ కూడా చాలా పదవులే ఇచ్చింది. ఏడాది క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆమె ఎమ్మెల్సీ పదవి వారం క్రితం ముగిసింది. తాను సొంత పార్టీని విడిచి వచ్చానని.. మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట శమంతకమణి.

అహుడా ఛైర్మన్‌ పదవిపైనా నేతలు గురి!

ప్రస్తుతం ఈ నలుగురు నేతలు తాడేపల్లికి వెళ్లి వచ్చారు. తమకు తెలిసిన యాంగిల్‌లో పార్టీ పెద్దల వద్దకు వెళ్తున్నారు. తాము ఇన్ని రోజులు చేసిన త్యాగాలు, రేపు తమకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే జరిగే నష్టాల గురించి చెబుతున్నారట. ఎవరెన్ని చెప్పిన బాస్ మదిలో ఎవరున్నారనేది సస్పెన్స్. గవర్నర్ కోటాలో అంతా కొత్త వారిని తీసుకున్నారు. ఇప్పుడు కాకున్నా.. మరోసారి కచ్చితంగా జిల్లా వాసులకు అవకాశం వస్తుందన్న ఆశ వారిలో ఉంది. మరోవ్తెపు అనంతపురం నుంచి హిందూపురం వరకు పరిధి ఉన్న అహుడా ఛైర్మన్‌ పదవి ఇస్తే.. కొంత వరకు పట్టు సాధించవచ్చని.. ఆర్థికంగానూ కొంచెం గట్టెక్కవచ్చన్న ఆలోచనలతో వీరిలో కొంతమంది ఉన్నారట.

ఒకే జిల్లా నుంచి అంతమందికి ఎమ్మెల్సీ ఇవ్వడం కష్టం!

ఒకేసారి ఒకే జిల్లా నుంచి ఇంతమందికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం కష్టం. అయినా ఎవరి మెరిట్స్‌ వాళ్లు చెప్పుకొంటూ తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ కాకుంటే కనీసం దానికి సాటిరాగల నామినేటెడ్‌ పదవైనా దక్కకపోతుందా? అనేది వారి ధోరణిగా కనిపిస్తోంది.

Exit mobile version