ఎన్నికలొచ్చాయంటే.. రాజకీయ పార్టీల వ్యూహాలు ఒక యుద్ధాన్ని తలపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ మంత్రి నియోజవర్గంలో జరుగుతున్న పురపోరులో అంతకు మించిన వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ ఒక ప్లాన్‌లో వెళ్తే.. వైసీపీ నేతలు బహుముఖ వ్యూహాంతో వెళ్తున్నారు. ఒక చిన్న మున్సిపాల్టీ కోసం అంత ఎఫర్ట్ అవసరమా.. ఎందుకు వైసీపీ అంత ఛాలంజింగ్ గా తీసుకుందీ అన్నది ఆసక్తికరంగా మారింది.
అనుకోకుండా వచ్చిన పెనుకొండ మున్సిపల్ ఎన్నికల ఏపీలో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తోంది. కుప్పం తర్వాత ఇక్కడే హాట్ హాట్‌గా రాజకీయం నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మంత్రి శంకర్‌నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడమే. మంత్రిని ఓడించాలని టీడీపీ, దమ్ముంటే ఓడించండని వైసీపీ హోరాహోరిగా సవాళ్ళు విసురుకుంటున్నాయి.
టీడీపీకి కంచుకోటలాంటి పెనుకొండపై గత ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. పోయినచోటే వెతుక్కోవాలని డిసైడ్ చేసిన టీడీపీ అధిష్టానం, పెనుకొండ మున్సిపాలిటీని సొంతం చేసుకోవాలని కేడర్‌కు ఆర్డర్స్ వేసింది. ఈ ఎన్నికలో గెలిచి మంత్రి శంకర్‌నారాయణను ఓడించి తీరాలన్న అధిస్టానం సంకేతాలతో జిల్లాలో ఉన్న నేతలంతా పెనుకొండలో దిగిపోయారు. ఇరవై వార్డుల్లో ఒక్కో వార్డుకు ఒక్కో ఇంఛార్జ్‌ను పెట్టి ప్రచారం చేస్తున్నారు. ఇంఛార్జ్‌లంతా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కావడంతో ఈ ఎన్నికను టీడీపీ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతిపక్ష టీడీపీనే ఇన్ని వ్యూహాలు రచిస్తే, అధికారంలో ఉన్న మేమేంత చేయాలి అంటోంది వైసీపీ. పెనుకొండలో విక్టరీని రిపీట్ చేసి తీరుతామని చెబుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇంఛార్జ్‌గా పెట్టిన పార్టీ, టీడీపీని మించిన ప్లాన్లు వేస్తోంది. వార్డుల వారిగా టీడీపీ మాజీలను ఇంఛార్జ్‌లుగా దించితే, వైసీపీ అధికారంలో ఉన్నవారిని పట్టుకొచ్చింది. ఇరవై వార్డుల్లో ఒక్కోదాన్ని ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి అప్పగించింది.
ఇంఛార్జులుగా ఉన్నవారు ఖచ్చితంగా వార్డును గెలిచి తీరాలన్నది అధికార పార్టీ పెట్టిన టార్గెట్. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్నే గెలిచిన వాళ్లకు, ఇప్పుడు వార్డులను గెలిపించే బాధ్యతల్ని అప్పగించడంపై సర్వత్రా చర్చ మొదలైంది. చిన్న మున్సిపాలిటీలో అధికార పార్టీ ఇంత పెద్ద వ్యూహాన్ని ఎందుకు రచిస్తోందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు సొంతగడ్డ కుప్పంలో కూడా విజయం సాధించిన వైసీపీ, పెనుకొండను సీరియస్‌గా ఎందుకు తీసుకుంటుందనే ఆసక్తి మొదలైంది.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పెనుకొండ మున్సిపల్ ఎన్నికను సీరియస్‌గా తీసుకోవడంతో, పరిస్థితి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. జిల్లా నేతలంతా ఇప్పుడు పెనుగొండలోనే తిష్ట వేయడంతో ఇక్కడ విజయం సాధించేది ఎవరు? అన్న ఉత్కంఠ మొదలైంది.
