Site icon NTV Telugu

Khammam Politics : గాడి తప్పుతున్న రాజకీయాన్ని టీఆర్ఎస్ సెట్ చేస్తుందా..?

Pongulati

Pongulati

Khammam Politics:

ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్‌లో రాజకీయాలు ఎక్కువే. అక్కడ పార్టీలో నేతలు ఎక్కువే. వలస నేతలకు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న వారికి పొసగని పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ పోరు రోడ్డున పడి రచ్చ రచ్చ అవుతుండటంతో.. సమస్య పరిష్కారానికి అధికారపార్టీ చర్యలు మొదలు పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్‌ ఒక సీటే గెలిచింది. 2018 ఎన్నికల్లోనూ అదే సీన్‌. ఇక్కడ కాంగ్రెస్‌ బలంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒక మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చెక్‌ పెట్టేందుకు నడుం బిగించింది టీఆర్ఎస్‌. ఆ మధ్య జిల్లాకు వచ్చిన టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి లంచ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానించారు పొంగులేటి. ఈ మీటింగ్‌లతో అధినేతతో మాజీ ఎంపీకి ఉన్న గ్యాప్‌ తగ్గినట్టుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొంగులేటికి ఎక్కడో ఒక చోట పార్టీ అవకాశం కల్పిస్తే సమస్య సర్దుకుంటుందనే చర్చ గులాబీ శిబిరంలో ఉందట.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు.. టీఆర్ఎస్‌కు మధ్య గ్యాప్‌ కొనసాగుతోంది. ఈ సమస్యనూ పరిష్కరించే పనిలో ఉంది పార్టీ. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారని.. ఆయన చేసిన తాజా కామెంట్స్‌తో అర్థం అవుతోంది. ఇందుకు గోదావరి వరదలు కలిసి వచ్చాయి. భద్రచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్‌.. మాజీ మంత్రి తుమ్మలపట్ల పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు. వరద సమీక్షలకు అర్హత లేకపోయినా తుమ్మలను తీసుకెళ్లారు సీఎం. అక్కడ తుమ్మల పేరును సీఎం పదే పదే ప్రస్తావించడం.. ఆయనను అడిగి వివరాలు తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు సమస్యలను తుమ్మల ప్రస్తావించగా.. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సీఎం.

జిల్లా నుంచి పువ్వాడ అజయ్‌ మంత్రి అయ్యాక.. టీఆర్ఎస్‌లో పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడు అజయ్‌ నాయకత్వంపై నమ్మకం సడలిందో ఏమో.. తుమ్మలకు సీఎం ప్రాధాన్యం ఇవ్వడం టీఆర్ఎస్‌లో చర్చ మొదలైంది. తుమ్మలకు సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనలో పార్టీ ఉందట. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పార్టీ పట్టించుకోకపోయినా.. తమ్మల మాత్రం టీఆర్ఎస్‌ అనుకూల వైఖరినే ప్రదర్శించారు. తన వర్గంపై పార్టీ నేతలే కేసులు పెట్టించినా పార్టీ లైన్‌ దాటలేదనే ముద్ర పడింది. దానికితోడు జిల్లాలో తుమ్మలకు బలమైన ముద్ర ఉండటంతో కలిసి వచ్చిందని చెబుతున్నారు.

మొత్తానికి అటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి.. ఇటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్‌ ప్రాధాన్యం ఇవ్వడంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు మారతాయని అంచనా వేస్తున్నారు. మరి.. అధికారపార్టీ చేపట్టిన ఈ చికిత్స రానున్న రోజుల్లో ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

 

 

Exit mobile version