చామకూర మల్లారెడ్డి. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారే గెలిచినా.. ఆయనకు కేబినెట్‌లో చోటుకల్పించారు సీఎం కేసీఆర్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టికెట్‌ను తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఇప్పించుకున్నారు మల్లారెడ్డి. కానీ.. రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అల్లుడి ఓటమి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. దానికితోడు కార్మికశాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు బాగోలేదనే రిపోర్ట్స్ వెళ్లాయట. సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్‌లో నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలను మల్లారెడ్డే ప్రోత్సహిస్తున్నట్టు కేడర్ ఆరోపిస్తోంది.
ఈ పరిణామాల మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి మల్లారెడ్డి పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఆయన మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. ఎంపీగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా మంచి పదవులే అనుభవించేశాననే ఫీలింగ్‌లో ఉన్నారట. ఇకపై రాజకీయాల్లో ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. క్రియాశీలక పాలిటిక్స్‌కు దూరంగా ఉంటానని కుటుంబ సభ్యులతో మల్లారెడ్డి అన్నట్టు తెలిసింది. అయితే ఉన్న ఫలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వెనక ఇంకో కారణం ఉందని ప్రచారం జరుగుతోంది.
మల్లారెడ్డి విద్యాసంస్థలకు ఆయన కుమారుడు భద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. కోడళ్లతోపాటు ఇతర వ్యవహారాల్లో కుమార్తె, అల్లుడు కొనసాగుతున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండగానే ఆయనకు ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరిక నెరవేరిందని.. దీంతో ఇక ఎలాంటి ఆశలు లేవని చెప్పుకొస్తున్నారట. అయితే ఎమ్మెల్యే టికెట్‌పై కుటుంబ సభ్యుల నుంచే ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. కుమారులు, కోడళ్లు, కుమార్తెతోపాటు అల్లుడు కూడా క్రియాశీలక రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట. అయితే ఇప్పటికే ఎంపీగా పోటీ చేసి ఓడిన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి మళ్లీ మల్కాజ్‌గిరి లోక్‌సభకు బరిలో ఉంటారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది క్లారిటీ లేదు. గత ఎన్నికల్లోనే ఖర్చు తడిసి మోపెడు అయ్యిందని.. మరోసారి అంతటి భారాన్ని మోయలేనని అనుచరులతో రాజశేఖర్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. మామ మల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ తాను తీసుకుని పోటీ చేస్తే ఈజీగా గెలవొచ్చనే లెక్కల్లో ఉన్నారట అల్లుడు.
మల్లారెడ్డి నిర్ణయంపై ప్రస్తుతం కుటుంబంలోనూ.. పార్టీ కేడర్‌లోనూ చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పెద్దల వరకు వెళ్లలేదట. దీంతో తనకు కాకుండా కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారని మంత్రి చెబితే సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న. మంత్రి మాత్రం.. ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు దూరంగా ఉంటూ.. విద్యా సంస్థల నిర్వహణ చూసుకుంటూ.. వ్యాపారాలపై ఫోకస్ పెట్టి కాలం వెళ్లదీయాలనే ఆలోచనలో ఉన్నారట. మరి.. వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి ఏ అంశానికి కట్టుబడి ఉంటారో చూడాలి.
