NTV Telugu Site icon

ఆ ఎంపీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?

Congrss

Congrss

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నల్లగొండ ఎంపీ. గతంలో హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే. పీసీసీ మాజీ చీఫ్‌. ఎంపీగా కిక్కు ఇవ్వలేదో.. అసెంబ్లీనే ముద్దు అనుకుంటున్నారో కానీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్‌ పెడుతున్నారు. హుజూర్‌నగర్‌ను విడిచిపెట్టేది లేదని.. ఎమ్మెల్యేగా బరిలో దిగుతానని ఇటీవలే ఓపెస్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు ఉత్తమ్‌. నల్లగొండ ఎంపీగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఉత్తమ్‌ ఏం చేస్తారు అనేదానిపై పార్టీ కేడర్‌లో ఇన్నాళ్లూ కొంత సస్పెన్స్‌ ఉండేది. ఆ ఉత్కంఠకు ఆయన తెరదించేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుజూర్‌నగర్‌తోపాటు కోదాడ కూడా ఉత్తమ్‌ అడ్డానే. వచ్చే ఎన్నికలకు హుజూర్‌నగర్‌ను ఎంచుకోవడంతో కోదాడలో ఆయన అనుచరులు నిరాశ చెందినట్టు చెబుతున్నారు.

కోదాడలోని సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌ ప్రకటన రుచించలేదట. 2018 ఎన్నికల సమయంలోనే హుజూర్‌నగర్‌ కాకుండా కోదాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. ఆయన హుజూర్‌నగర్‌ను ఎంచుకు భార్య పద్మావతిని కోదాడ బరిలో నిలిపారు. పద్మావతి టీఆర్‌ఎస్‌ అభ్యర్తి మల్లయ్య యాదవ్‌ చేతిలో ఓడిపోయారు. తమ మాటలను ఉత్తమ్‌ పరిగణనలోకి తీసుకోలేదని సందర్భం చిక్కినప్పుడల్లా కోదాడ కాంగ్రెస్‌ నేతలు చర్చకు పెడుతూనే ఉన్నారట. కొందరైతే ఇప్పటికీ తమ నాయకుడు ఎదురైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారని టాక్‌.

ఉత్తమ్‌ భార్య పద్మావతి కోదాడలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నప్పటికీ.. కెప్టెన్‌ పోటీలో ఉంటే కలిగే లెక్క వేరని కేడర్‌ అభిప్రాయంగా ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాత నియోజకవర్గమైన కోదాడకు ఎప్పటికైనా తిరిగి వస్తారని ఆశిస్తూ వచ్చారట కార్యకర్తలు. ఇదే సమయంలో హుజూర్‌నగర్‌లోనే పోటీ చేస్తానని ఉత్తమ్‌ తేల్చి చెప్పేయడంతో కోదాడ పరిస్థితి ఏంటా అని మల్లగుల్లాలు పడుతున్నారట ఆయన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచి మరోసారి పద్మావతే బరిలో ఉంటారని అనుకుంటున్నారు.

ఇదే సమయంలో కోదాడ కాంగ్రెస్‌లో మరో చర్చ మొదలైంది. ఉత్తమ్‌ కుటుంబానికి కాకుండా కొత్త వారికి టికెట్‌ ఇప్పించేలా పార్టీపై ఒత్తిడి చేయాలని కొందరు ఆలోచిస్తున్నారట. అయితే కాంగ్రెస్‌లో ఉత్తమ్‌ను ఎదిరించి.. ఆయన్ని కాదని పార్టీ టికెట్‌ సాధించడం అయ్యేపనేనా అనే వాదన ఉంది. మొత్తంగా పీసీసీ మాజీ చీఫ్‌ ప్రకటన కోదాడ కాంగ్రెస్‌లో పెద్ద అలజడే తీసుకొచ్చింది. మరి.. గుర్రుగా ఉన్న కేడర్‌ను కెప్టెన్‌ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.