NTV Telugu Site icon

Jyothula Chanti Babu : ఆ ఎమ్మెల్యే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారా..?

Jyothula Sati Babu

Jyothula Sati Babu

Jyothula Chanti Babu : ఆ ఎమ్మెల్యేకి సీటు విషయంలో పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చేశారా? లెక్కలతో సహా వివరాలు చూపించి మారు మాట్లాడకుండా ముగింపు పలికారా? ఆయన వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవడానికి ఓకే చెప్పినట్టేనా? మాజీ మంత్రి ఫామిలీకి తిరిగి పట్టం కడతారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఏమా కథా?

జ్యోతుల చంటిబాబు. జగ్గంపేట ఎమ్మెల్యే. 2009, 2014లో మరో పార్టీ నుంచి పోటీ చేసినా.. నెగ్గలేదు. 2019లో వైసీపీలో చేరి గెలిచి.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన మాట్లాడిన అంశాలు వివాదాలు అవుతాయో… వాటిని వెతుక్కుంటూ ఆయనే వెళ్తారో కానీ.. మొదటి నుంచి స్పెషల్‌గా కనిపిస్తారు ఎమ్మెల్యే. మూడేళ్లుగా ఏదో చేద్దామని మరేదో చేసి తుస్సుమన్నట్టు ఉంటుంది చంటిబాబు తీరు.

ఇటీవల వైసీపీ జిల్లా నేతలతో రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశం అయ్యారు. ఆ మీటింగ్‌లో చంటిబాబుకు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట పార్టీ పెద్దలు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడం కుదరబోదని.. ఇప్పటినుంచే ప్రిపేర్ అయిపోవాలని క్లారిటీ ఇచ్చేశారట. అయితే తాను బాగానే పని చేస్తున్నానని.. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందు ఉంటున్నానని చెప్పారట చంటిబాబు. దానికి అక్కడే ఉన్న పార్టీ పెద్దలు కల్పించుకుని.. చంటిబాబుగారు.. పార్టీకి.. మాకు మీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు.. కానీ.. వాస్తవాలను అర్థం చేసుకుని మసులుకోవాలి అని తేల్చి చెప్పేశారట. అక్కడితో ఆగకుండా పార్టీ చేయించిన అంతర్గత సర్వే వివరాలు చంటిబాబు ముందు ఉంచారట. మీరే అభ్యర్థి అయితే వచ్చే ఎన్నికల్లో ఏ మండలంలో ఎన్ని ఓట్లు పడతాయి? ఎందుకు వ్యతిరేకత ఉంది? అనే వివరాలు పూస గుచ్చినట్టు వివరించారట. చివరిగా పార్టీ ఫైనల్ అని.. పార్టీ ఆదేశాలు పాటించాలని జోల పాడి ఒప్పించేశారట.

అంతా చెప్పేశాక..ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కల్పించుకొని పార్టీ అవసరాల కోసం త్యాగాలు చేయాలని.. ఆ తర్వాత కూడా మనకు న్యాయం జరుగుతుందని చంటిబాబుకు ధైర్యం చెప్పారట. వరుస ఎన్నికల్లో ఓటమితో తాను పక్కకి తప్పుకోలేదా అని బోసు గుర్తు చేశారట. జగ్గంపేట బరిలో వచ్చే ఎన్నికల్లో తోట నరసింహం ఫామిలీ ఉంటుందని ఫిక్స్‌ చేశారట పార్టీ దూతలు. తోట నరసింహం జగ్గంపేట నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జగ్గంపేట సీటుకోసం ప్రయత్నించినా.. పార్టీ అవసరాలు.. పరిస్థితులు దృష్ట్యా నరసింహం భార్య వాణికి పెద్దాపురం టికెట్‌ ఇచ్చింది వైసీపీ. పోటీలోనే లేదనుకునే పెద్దాపురంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు వాణి. ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌కు నరసింహం దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు జగ్గంపేటలో పార్టీ అవసరాల దృష్ట్యా నరసింహంను దగ్గరకు తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. అందువల్లే ఎమ్మెల్యే చంటిబాబును ఆ విధంగా డైవర్ట్ చేశారట. తాడికొండలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్లాన్‌బీ అమలు చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఎమ్మెల్యేను నేరుగా తోట నరసింహం కుటుంబం దగ్గరకు తీసుకెళ్లారు. పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా అలా కథ కొలిక్కి తెచ్చారని చెవులు కొరుక్కుంటున్నారు. పైకి చెప్పకపోయినా చంటి బాబు వర్గానికి ఇది మింగుడు పడటం లేదట. మొత్తానికి లోకల్‌ చంటిని నాన్‌ లోకల్‌ చేశారని.. ఇక ఎన్నికల బరిలో దిగడం కష్టమని అభిప్రాయపడుతున్నారట కొందరు. జగ్గంపేటలో తోట ఫ్యామిలీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. చంటిబాబుకు ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ పిక్చర్‌ చూపించారని టాక్‌. మరి.. చంటిబాబు కూల్‌గా ఉంటారో లేదో చూడాలి.