Site icon NTV Telugu

ఆ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకు పడటం లేదా..?

Exit Ayedi Avaru

Exit Ayedi Avaru

ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార టీఆర్ఎస్‌లో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోంది. ఎన్నికల వాతావరణం క్రమంగా రాజుకుని.. అందులో వర్గపోరు సెగలు రేపుతోంది. సమయం చిక్కితే చాలు అధిపత్యపోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. చివరకు మేడే వేడుకలు, ఇఫ్తార్‌ విందుల్లోనూ తన్నుకునే వరకు వెళ్తున్నారు పార్టీ నేతలు.. వారి అనుచర వర్గాలు.

నకిరేకల్‌లో ఎవరు ఎగ్జిట్‌ అవుతారు?నకిరేకల్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లోని పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చల్లో ఉంటున్నాయి. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అది మేడే వేడుకల్లో మరో రూపంలో బయటపడింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయులు మెయిన్‌ సెంటర్‌లో బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్‌కు నిజమైన ఓనర్లు తామేనని వీరేశం అనుచరులు పార్టీ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్‌లో లేనేళ్లు జెండా ఎలా ఎగరేస్తారని ఎమ్మెల్యే లింగయ్య ఫాలోవర్స్‌ అడ్డు పడ్డారు. మాటామాటా పెరిగి చివరకు ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్‌ ఇస్తారో క్లారిటీ లేదు. ఇద్దరిలో ఒకరికే ఛాన్స్‌ ఉంటుందని అందరికీ తెలిసిందే. దాంతో ఎవరు ఎగ్జిట్‌ అవుతారు? ఎవరికి ఛాన్స్‌ ఇస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే భగత్.. ఎమ్మెల్సీ కోటిరెడ్డిల మధ్య ఉప్పు నిప్పులానే ఉంది. భగత్‌కు వ్యతిరేకంగా కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీకి చెందిన ఒక నేత అండతో కోటిరెడ్డి నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భగత్‌కు టికెట్‌ రాదని.. స్థానికుడైన కోటిరెడ్డికే టికెట్‌ వస్తుందని ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఇఫ్తార్‌ విందులో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.

ఇక నల్లగొండలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వర్గాలకు అస్సలు పడటం లేదు. దేవరకొండలోనూ గుత్తా, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. రవీంద్ర కుమార్‌కు వ్యతిరేకంగా తన ప్రధాన అనుచరుడు.. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ దేవేందర్‌ను తెరపైకి తెస్తున్నారట గుత్తా. ఇలా జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలు చేస్తున్న పనులు రచ్చ రచ్చ అవుతున్నాయి. ముఖ్యంగా నకిరేకల్‌లో మాత్రం రోడ్డెక్కడడానికి క్షణం ఆలోచించడం లేదు లింగయ్య, వీరేశం అనుచరులు. మరి.. వర్గపోరుకు అధిష్ఠానం ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

 

 

Exit mobile version