Site icon NTV Telugu

Kakinada : ఆ జిల్లాలో కలెక్టర్కు ఎస్పీకి పడటంలేదా..?

Kakinada

Kakinada

ఆ జిల్లాలో కలెక్టర్‌కి ఎస్పీకి పడటం లేదా? ఇద్దరు అధికారులకు ఏ అంశంలో చెడింది? సీఎం పర్యటనలో జరిగిన ఘటనతో గ్యాప్ ఇంకా పెరిగిందా? ఇంతకీ ఏంటా జిల్లా.. ? ఎవరా అధికారులు?

కృతికాశుక్లా. కాకినాడ జిల్లా కలెక్టర్‌. రవీంద్రనాథ్‌ బాబు.. కాకినాడ జిల్లా ఎస్పీ. కీలక విభాగాలకు జిల్లా బాస్‌లైన ఇద్దరు అధికారుల మధ్య పొరపచ్చాలు వచ్చాయట. కలెక్టర్‌ డామినేషన్‌ పెరిగిందని ఎస్పీ ఫీలవుతున్నారట. సర్వీస్‌లో సీనియర్‌ అయినప్పటికీ తన మాటను పట్టించుకోవడం లేదనేది ఎస్పీ వాదనగా ఉందట.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఉమ్మడి తూర్పుగోదావరి మూడు జిల్లాలైంది. కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాకి కృతికాశుక్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2013 బ్యాచ్‌కి చెందిన ఈ IAS అధికారికి తొలిసారి కలెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. అంతకు ముందు ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్‌తోపాటు పలు విభాగాల్లో పని చేశారు. దిశా స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రవీంద్రనాథ్‌బాబు 2021లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎస్పీగా వచ్చారు. కొత్త జిల్లాలు వచ్చాక కాకినాడకే పరిమితం అయ్యారు. గతంలో కృష్ణా జిల్లా ఎస్పీగా.. వైజాగ్‌ క్రైమ్‌ డీసీపీగా విధులు నిర్వహించారు రవీంద్రనాథ్‌బాబు. 2001 గ్రూప్‌ వన్‌ ఆఫీసరైన ఆయన 2015లో IPS హోదా వచ్చింది.

గత నెలలో జిల్లాలో సీఎం పర్యటించారు. ప్రజలకు అభివాదం చేస్తూ హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణానికి వెళ్లేలా ప్లాన్ చేశారు సీఎంవో అధికారులు. దానికి తగ్గట్లుగా రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంతలో ఏమైందో ఏమో .. సీఎం వచ్చే సమయానికి దారి పొడవునా పబ్లిక్ లేకుండా పంపించేశారు పోలీసులు. ఈ విషయంలో సీఎంవో అధికారులు కలెక్టర్‌ను వివరణ అడిగారట. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులే బాధ్యత తీసుకోవాలని చెప్పేశారట. అయితే పబ్లిక్‌ను ఉంచాలని తమకు ఎవరూ చెప్పలేదన్నారట ఎస్పీ. దాంతో ఇద్దరు అధికారుల మధ్య గ్యాప్‌ వచ్చినట్టు టాక్‌.

జిల్లాస్థాయిలో సమీక్షా సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతాయి. ఎస్పీ, కలెక్టర్‌ తప్పకుండా పాల్గొంటారు. ఈ మధ్య జరిగిన మీటింగ్స్‌లో ఎస్పీ కనిపించడం లేదని.. అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని పంపించారని చెబుతున్నారు. సమావేశానికి వెళ్లిన ఉపయోగం లేదు కదా.. తమను ఎవరు పరిగణనలోకి తీసుకోరు అని ఎస్పీ ఫీలవుతున్నట్టు సమాచారం. నిర్ణయాలు తీసేసుకుని.. అవి మనకు చెబుతారు అంతేగా అని నిట్టూర్పులిడుస్తున్నారట. ఉమ్మడి జిల్లాకు ఎస్పీగా పనిచేసిన తాను సీనియర్‌ అధికారి అయినప్పటికీ కాకినాడ జిల్లాలో మాత్రం ఆ పరిస్థితులు లేవని అంటున్నారట ఎస్పీ. కృతికాశుక్లా కూడా తాను IAS అయినప్పటికి.. దిశ తొలి స్పెషల్ ఆఫీసర్‌గా ప్రభుత్వం తనకు అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారట. ఇక ప్రొటోకాల్‌ కార్యక్రమాలకు ఇద్దరూ వచ్చినా.. ఏదో వచ్చాం అన్నట్టుగా హాజరై వెళ్లిపోతున్నట్టు కిందిస్థాయి సబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఈ గ్యాప్‌ ఇద్దరు బాస్‌ల వరకే పరిమితం అయితే ఫర్వాలేదని.. కిందిస్థాయి ఉద్యోగులపై ప్రభావం పడితే పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారట.

Exit mobile version