Site icon NTV Telugu

BJP :బీజేపీ లక్ష్మణ్ ప్లేస్ ను రీప్లేస్ చేసేదెవరు ? |

Musheerabad

Musheerabad

 

డాక్టర్‌ కె లక్ష్మణ్‌. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా.. అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేతగా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ పదోన్నతిపై తెలంగాణ బీజేపీ నేతలు ఫుల్‌ ఖుషీగా ఉన్నా.. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌ను రీప్లేస్‌ చేసేది ఎవరన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. మొన్నటి వరకు ముషీరాబాద్‌ అంటే లక్ష్మణ్‌,.. లక్ష్మణ్‌ అంటే ముషీరాబాద్‌ అన్నట్టుగా బీజేపీలో చర్చ ఉండేది. కానీ.. రానున్న రోజుల్లో ముషీరాబాద్‌ బీజేపీ తెరపై కొత్త ముఖాన్ని చూపించేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. ఈ గ్యాప్‌లో ముందుకొచ్చి.. అక్కడ కర్చీఫ్‌ వేసేందుకు పలువురు బీజేపీ నేతలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట. నియోజకవర్గంలో పార్టీకి ఓటు బ్యాంకు ఉండటం.. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ.. కమలనాథుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

ముషీరాబాద్‌ టికెట్ కోసం యువనేతల పోటీ..!GHMC ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అదే ఊపులో నగరంలో మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయాలన్నది పార్టీ ఆలోచన. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేయాలని లక్ష్మణ్‌ ప్రణాళికలు వేసుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఆయన్ని రాజ్యసభకు పంపింది జాతీయ నాయకత్వం. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేయడానికి పార్టీలోని చాలామంది యువ నాయకులు ఆసక్తితో ఉన్నారట.

మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రంగౌడ్‌ బీజేపీలో చేరినప్పటి నుంచీ యాక్టివ్‌గా ఉండటమే కాకుండా వచ్చే ఎన్నికల్లో సిటీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గోషామహల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌తో విభేదాలు రావడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ కండువా కప్పుకొన్నారు విక్రమ్‌. గోషామహల్‌లో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ ఉన్నారు. అక్కడ సీటు ఖాళీ లేదు. దీంతో విక్రంగౌడ్‌ కన్ను ముషీరాబాద్‌పై పడినట్టు తెలుస్తోంది. అలాగే హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సైతం ముషీరాబాద్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట. ఆమెకు పార్టీ లైన్‌ క్లియర్‌ చేసిందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలోనే ముషీరాబాద్‌తోపాటు అంబర్‌పేట, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని చూశారు విజయలక్ష్మి. మరి.. విక్రంగౌడ్‌, విజయలక్ష్మిల్లో బీజేపీ ఎవరికి ముషీరాబాద్‌లో ఛాన్స్‌ ఇస్తుందో చూడాలి.

 

 

Exit mobile version