Site icon NTV Telugu

తెలంగాణ కేబినెట్‌లో ఒక బెర్త్‌ ఖాళీ..!

తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? వడపోతల్లోకి వచ్చి పోతున్న నాయకులు ఎవరు? సీఎం కేసీఆర్‌ వేస్తున్న సామాజిక లెక్కలేంటి?

ఒక్క బెర్త్‌ భర్తీకి వడపోతలు మొదలయ్యాయా?

అధికార టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం పదవుల భర్తీ జాతర నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల సందడి పూర్తి కాగానే.. పలు దఫాలుగా నామినేటెడ్‌ పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్‌ పోస్టులు చాలానే ఉన్నాయి. వాటి కోసం పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదే విధమైన ఎదురు చూపులు ఎమ్మెల్యేలు… ఎమ్మెల్సీలలోనూ ఉంది. అది కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఒకేఒక బెర్త్‌పై. ఇటీవల ఎమ్మెల్సీ అయినవాళ్లు.. సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లూ తమకు ఛాన్స్‌ దక్కకపోతుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కొన్ని వడపోతలు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు ఆ వడపోతలకు వస్తున్నారు.. మరికొందరు జాబితాల్లో నుంచి జారిపోతున్నారు.

ముగ్గురు పేర్లపై పార్టీ వర్గాల్లో బలమైన చర్చ..!

వాస్తవానికి కేబినెట్‌లో ఖాళీల భర్తీపై ఎప్పటికప్పుడు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ కామన్‌. అప్పుడా ఇప్పుడా.. ఎప్పుడా అన్న కోణంలో పొలిటికల్‌ సర్కిల్స్‌లో డిస్కషన్స్‌ ఉంటాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్‌పై .. మారుతున్న రాజకీయ పరిణామాల ప్రభావం ఉంటుందని సమాచారం. నామినేటెడ్‌ పదవుల భర్తీ.. సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేస్తున్న సమయంలో గులాబీ బాస్‌ దృష్టి ఎవరిపై ఉందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. వివిధ సామాజికవర్గాల కోణాల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ నుంచి సడెన్‌గా ఎమ్మెల్సీ అయిన బండ ప్రకాష్‌, టీ టీడీపీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయిన ఎల్‌ రమణ పేర్లపై ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీసీ కోటాలో ప్రకాష్‌, రమణ పేర్లు పరిశీలన

రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను ఎమ్మెల్సీని చేయడంతో.. ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకుంటారని అప్పట్లో ప్రచారం జరిగింది. మధ్యలో ఆయన పేరును శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి పరిశీలిస్తున్నారని అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ గులాబీ దళపతి వడపోతల్లోకి బండ ప్రకాష్‌ పేరు చేరినట్టు సమాచారం. ఎస్సీ సామాజికవర్గంలో సండ్ర వెంకట వీరయ్య పేరు నలుగుతోందట. బీసీ సామాజికవర్గంలో ఎల్‌ రమణ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. హుజురాబాద్‌ ఉపఎన్నిక సమయంలో ఎల్‌ రమణ టీఆర్ఎస్‌లోకి వచ్చారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆయన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన నాయకుడు. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల్లో బీసీ నేతకు పట్టం కట్టాలని అనుకుంటే రమణ పేరును కొట్టిపారేయలేమన్నది గులాబీ వర్గాల వాదన.

ఎస్సీ కోటాలో చర్చల్లోకి సండ్ర పేరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. లెక్క వేరు. సీనియర్‌ ఎమ్మెల్యే. సండ్రకు సీఎం కేసీఆర్‌ నుంచి బలమైన హామీ ఉందని చెబుతారు. ఆ కోణంలో చూస్తే సండ్ర పేరును పరిశీలించొచ్చని అనుకుంటున్నారట. రాష్ట్రంలో రాజకీయ అవసరాలు.. సమర్థతను పరిగణనలోకి తీసుకుంటే.. కేబినెట్‌లో చేరే ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Exit mobile version