NTV Telugu Site icon

Congress : కొండా కుటుంబం నుంచి బరిలోకి దిగేది ఎవరు..?

Kona

Kona

ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ, మురళీ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి. 2018లో పరకాలలో సురేఖ ఓటమి తర్వాత పెద్దగా చర్చల్లోకి వచ్చింది లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌ అయ్యాక ఆయనకు దగ్గరయ్యారు. మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతారని భావించాయి పార్టీ శ్రేణులు. ఇంతలో హుజూరాబాద్‌ ఉపఎన్నిక పీసీసీ చీఫ్‌, కొండా ఫ్యామిలీ మధ్య దూరం పెంచింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరంగల్‌ తూర్పు తమ సొంత నియోజకవర్గంగా ప్రకటించి అక్కడ ఫోకస్‌ పెట్టినా.. అనుకున్నంత స్థాయిలో కార్యక్రమాలు లేవు. పీసీసీ నుంచి సహకారం లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు. సభ్యత్వాల నమోదును పెద్దగా పట్టించుకోలేదని చర్చ సాగింది.

వరంగల్‌లో రాహుల్‌ గాంధీ సభకు కూడా వచ్చామా వెళ్లామా అన్నట్టుగానే కొండా దంపతుల తీరు సాగింది. జనాలను తరలించలేదట. ఇటీవల కొండా ఫ్యామిలీ సొంత ప్రాంతంలో రేవంత్‌రెడ్డి రచ్చబండ నిర్వహిస్తే అక్కడికి వెళ్లలేదు. వాస్తవానికి కొండా దంపతులు వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి మూడు టికెట్లు ఆశిస్తున్నారు. సురేఖ, మురళీతోపాటు వీళ్ల కుమార్తె సుశ్మిత పటేల్‌ను కూడా బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. దానికి కాంగ్రెస్‌లో సానుకూల సంకేతాలు లేనట్టు తెలుస్తోంది. దీంతో కనీసం రెండు సీట్లు ఇచ్చినా సరిపెట్టుకుంటామని చెప్పారట. ఆ అంశానికి కూడా స్పష్టత ఇవ్వలేదట. దీనికితోడు తాము అడిగిన నియోజకవర్గాల్లో వేరేవారిని ప్రోత్సహించడం కొండా దంపతులకు మింగుడు పడటం లేదట.

ఇటీవల కాలంలో జిల్లా కాంగ్రెస్‌లో కొండా సురేఖ, మురళీని కాదని.. ఎమ్మెల్యే సీతక్క, వేం నరేందర్‌రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంపై వాళ్లు కినుక వహించినట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే సైలెంట్ అయినట్టు చర్చ నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టాలని చూస్తున్న కొండా దంపతుల భవిష్యత్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ కాంగ్రెస్‌లోనే ఉంటే.. ఉదయపూర్‌ చింతన్‌ శిబిర్‌ నిర్ణయం ప్రకారం ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌ ఇస్తారు. అప్పుడు సురేఖ, మురళీ దంపతుల్లో ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్న. వీరిద్దరూ కాకుండా కుమార్తెను సుశ్మిత పటేల్‌ను బరిలో దించుతారా అనేది తేలాలి. కాదూ కూడదు అని భావిస్తే.. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చే పార్టీలోకి జంప్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. కొండా దంపతులు ఫ్యూచర్‌ పాలిటిక్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.